నందిగుప్తుడు
వ్యాపారంలో సంపాదించిన లాభాన్నంతటినీ రెండు లంకె బిందెల్లో దాచాడు నందిగుప్తుడు. మిత్రుడు సుదర్శనగుప్తుడు చూస్తూండగానే ఆ బిందెల్ని మర్రి చెట్టు కింద గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. తర్వాత చేతికి అంటిన మట్టిని దులుపుకుని పైకి లేచాడు.‘ఇక పద’ అన్నాడు సుదర్శనగుప్తుడితో.ఇద్దరూ ఇంటిదారి పట్టారు.పడుకున్నాడే గాని, నందిగుప్తుడికి నిద్రపట్టడం లేదు. అనుకున్నట్టుగానే అంతా అమలు చేశాడు. సుదర్శన గుప్తుణ్ణి ఒప్పించి, డబ్బంతా మర్రిచెట్టు కింద దాచిపెట్టాడు. ఇప్పుడు దాన్ని తస్కరించాలి. ఆలస్యం అమృతం విషం అనుకుని, దిగ్గున లేచి, పరుగులాంటి నడకతో మర్రిచెట్టును సమీపించాడు. ఎవరూ లేరు. చీకటిగా భయం భయంగా ఉందంతా. అయినా ధైర్యంగా పాతిపెట్టిన లంకెల బిందెలు బయటకు తీశాడు.తర్వాత గొయ్యిని పూడ్చేసి, ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు.కొన్నాళ్ళు గడిచాయి.వ్యాపారం వ్యవహారం అంటూ గుప్తులిద్దరూ ఎక్కడికీ పోవడం లేదు. ఉన్న వూరినే కనిపెట్టుకుని ఉంటున్నారు. పైగా వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రచారం చేశారేమో! ప్రజలకి వారంటే జాలీ, సానుభూతీ కలిగాయి. ఇదే అవకాశంగా దాచిన డబ్బును ఇంటికి తెచ్చుకుందామన్నాడు సుదర్శన గుప్తుడు.‘రాత్రి తెచ్చుకుందాం.’ అన్నాడు నందిగుప్తుడు.
అన్నట్టుగానే రాత్రివేళ సుదర్శనగుప్తుణ్ణి వెంటబెట్టుకుని, మర్రిచెట్టును చేరుకున్నాడు. కింద తవ్వాడు. ఎంత లోతుకి తవ్వినా లంకెబిందెలు కనిపించడం లేదు. ఆందోళనలో పడ్డారిద్దరూ.‘ఇక్కడ కాదు, అక్కడ’ అంటూ మర్రిచెట్టు కింద మరో చోట తవ్వారు. అక్కడ కూడా లంకె బిందెలు కనిపించలేదు. నోట మాట లేదు సుదర్శనగుప్తుడికి. దాచిన సొమ్ము ఏమయింది? ఆలోచించసాగాడు. అతని పీక పట్టుకున్నాడు నందిగుప్తుడు.‘చెప్పు, సొమ్ము ఎక్కడ దాచావు?’ అడిగాడు.‘నేను దాచడం ఏమిటి? మనిద్దరం కలిసే కదా దాచాం.’’ అన్నాడు సుదర్శనగుప్తుడు.‘కలిసి దాచింది నిజమే! కాని ఇప్పుడిక్కడ లేదంటే, నువ్వే కాజేసి ఉంటావు.’‘అదే మాట నేనంటే...’‘అంటావంటావు. సొమ్ము దొంగిలించింది కాక, నన్ను దొంగంటావు. పద రాజుగారి దగ్గరకి. అక్కడ తేల్చుకుందాం.’ అన్నాడు నందిగుప్తుడు. సుదర్శనగుప్తుడు పారిపోకుండా రాత్రంతా కాపలా ఉండి, తెల్లారుతూనే రాజు దగ్గర అతన్ని ప్రవేశపెట్టాడు నందిగుప్తుడు.
విషయాన్ని కూడా వివరంగా చెప్పాడు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు.‘మిత్రద్రోహం చేశాడు మహారాజా! నా డబ్బు నాకు ఇప్పించి, వీడికి తగిన శిక్ష విధించండి.’ అన్నాడు.నువ్వేమంటావు? అన్నట్టుగా సుదర్శనగుప్తుణ్ణి చూశాడు రాజు. సమాధానంగా కళ్ళు చెమర్చుకుంటూ ఇలా చెప్పాడు సుదర్శనగుప్తుడు.‘రాజా! మేమిద్దరం మిత్రులమే! అయితే మిత్రద్రోహానికి నేను ఒడిగట్టలేదు. ఇద్దరం మర్రిచెట్టు కింద డబ్బు దాచిన మాటా నిజమే! కాని, అదే ం అయిందోనాక్కూడా తెలీదు.’‘దొంగలింతే రాజా! కన్నీళ్ళు పెట్టుకుని, శిక్ష తప్పించుకుంటారు. సుదర్శనగుప్తుడు దొంగే, అనుమానం లేదందులో. నాలుగు తగిలించండి, వాడే నిజం చెబుతాడు.’ అన్నాడు నందిగుప్తుడు.
‘మహారాజా! నాకేం పాపమూ తెలీదు. నేను నిజమే చెబుతున్నాను.’ చేతులు జోడించాడు సుదర్శనగుప్తుడు.మహారాజు ఆలోచనలో పడ్డాడు. చూస్తూంటే సుదర్శనుడు దొంగిలించినట్టుగా లేదు. కాని, అతనే దొంగిలించాడంటున్నాడు నంది. దీన్నెలా పరిష్కరించడం?‘మహారాజా! నాకు న్యాయం చెయ్యండి. ఈ దొంగని శిక్షించి, నా డబ్బు నాకు ఇప్పించండి.’ నందిగుప్తుడు పెద్దగొంతుతో అరిచాడు.‘నీకు న్యాయం చేస్తాను కాని, సుదర్శనగుప్తుడే ఈ డబ్బు దొంగిలించాడనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా?’ అడిగాడు రాజు.‘ఉంది మహారాజా! అక్కడ డబ్బు దాచిపెట్టిన సంగతి నాకూ, ఈ సుదర్శనుడికే తెలుసు. మరి తవ్వితే డబ్బు లేదంటే అర్థం? సుదర్శనుడు దొంగిలించాడనేగా.’ అన్నాడు నందిగుప్తుడు.‘అదే మాట సుదర్శనుడు నీ గురించి అంటే?’‘ఆ మాట అన్నందుకే ఈ దొంగని మీ దగ్గరకి తీసుకొచ్చాను. అయినా ఆధారాలు వదిలిపెట్టి, సాక్షులను వెంటబెట్టుకుని ఎవరయినా దొంగతనాలు చేస్తారా మహారాజా’ గుండెలు బాదుకున్నాడు నందిగుప్తుడు.చెడ్డ చిక్కొచ్చి పడిందే! అనుకున్నాడు రాజు. ఈ చిక్కుని ఎలా విడదీయగలన నుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాజు కళ్ళు మూసుకున్నంతనే తగవుని ఒక తీరుకు తెచ్చేందుకు ఎత్తు వేశాడు నందిగుప్తుడు. ఇలా అరిచాడు.
‘సాక్ష్యం ఉంది మహారాజా’‘చెప్పు’‘సుదర్శనుడే సొమ్ము దొంగిలించాడు అనడానికి మర్రిచెట్టే సాక్ష్యం. ఏ మర్రిచెట్టు దగ్గరయితే మేమిద్దరం లంకెబిందెలు దాచామో, అదే మర్రిచెట్టు సాక్ష్యం చెబుతుంది.’ అన్నాడు నందిగుప్తుడు. ఆశ్చర్యపోయారంతా. మర్రిచెట్టు మాట్లాడుతుందా? సాక్ష్యం చెబుతుందా? నందిగుప్తుడికి మతి చలించలేదు కదా? అనుకున్నారు.‘నేను మంచివాణ్ణి. నా మంచితనమే మర్రిచెట్టుకు మాటనిస్తుంది. నేను సత్యవంతుణ్ణి. నా సత్యమే మర్రిచెట్టును మాట్లాడేట్టు చేస్తుంది. నేను అమాయకుణ్ణి. నా అమాయకత్వమే నాకంతా మంచి చేస్తుంది. రండి మహారాజా! మర్రిచెట్టుని ఆశ్రయిద్దాం, రండి.’ అన్నాడు నందిగుప్తుడు.చీకటి పడింది అప్పటికే! రాత్రివేళ రాజు అంతఃపురాన్ని వీడరాదు. మంత్రులు చెప్పారా మాట. దాంతో ఇలా అన్నాడు రాజు.‘రేపు మంత్రి సామంతుల సహా మేము మర్రిచెట్టు దగ్గరికి వస్తాం. ఈ రాత్రి ఓపిక పట్టండి.’కొలువు చాలించాడు రాజు.
వెళ్ళిపోయాడక్కణ్ణుంచి.డబ్బు పోయింది. దొంగంటూ అపకీర్తి మీద పడింది. బతకడం అనవసరం. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు సుదర్శనుడు. అంతలోనే ఆ ఆలోచనను మానుకున్నాడు. చనిపోతే దొంగనన్నది ఖాయమవుతుందనుకున్నాడు. కుటుంబ పరువు మర్యాదలు పోతాయనుకున్నాడు. దుఃఖిస్తూనే నిద్రపోయాడు. నిద్రలేనిది నందిగుప్తునికే! చెట్టు చేత మాట్లాడించాలి. సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పించకపోతే తన తల ఎగిరిపోతుంది. రాజు ఆగ్రహించి ఎంతటి శిక్షకయినా వెనుకాడడు. ఇప్పుడెలా? అనుకున్నాడు. ముసలి తండ్రి గుర్తొచ్చాడప్పుడు. పనికిరాడని, ముసలివాడని పట్టించుకోక, అతన్ని ఓ మూల గదిలో ఉంచాడు. ఇప్పుడతనితో అవసరం పడిందనుకున్నాడు. పరుగుదీశాడతని దగ్గరికి.
‘అయ్యా! నాకో సాయం చెయ్యాలి.’‘చెప్పు’‘ధనం మూలమిదమ్ జగత్ అన్నారు. అంటే ఈ జగానికంతటికీ డబ్బే మూలం అని అర్థం. అవునా? అలాగే డబ్బుకి లోకం దాసోహం అన్నారు. అంటే డబ్బున్న వాడి మాటే చెల్లుతుంది. అందుకని డబ్బు సంపాదించాలి. ఈ డబ్బు ఎలాగయినా సంపాదించాలి. దొంగతనం, దోపిడీలు చేసయినా సంపాదనే ధ్యేయంగా బతకాలి. అక్రమంగా సంపాదించడం పాపం, తప్పన్నా సరే, సంపాదించి తీరాల్సిందే! కావాలంటే అదే డబ్బుతో పాపాల్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. తప్పుని ఒప్పు చెయ్యొచ్చు. ఏవంటావు?’ అడిగాడు నందిగుప్తుడు.‘అసలు సంగతి చెప్పు’ తండ్రి తలకొట్టుకున్నాడు.
‘ఆ మధ్య అవంతీనగరానికి వెళ్ళి నేనూ సుదర్శనుడూ బాగానే డబ్బు సంపాదించాం. ఆ డబ్బంతా లంకె బిందెల్లో పెట్టి ఊరవతల మర్రిచెట్టు కింద దాచాం. ఎందుకు దాచామన్నది తర్వాత చెబుతాను. అయితే దాచిన ఆ సొమ్ముని సుదర్శనుడికి తెలీయకుండా నేనే దొంగిలించాను. మనింట్లోనే ఆ డబ్బంతా ఉంది. కాని, సుదర్శనుడే దొంగిలించాడని, రాజుగారికి ఫిర్యాదు చేశాను. సాక్ష్యం కావాలన్నారు రాజుగారు. ఏం చెప్పాలో తెలీక మర్రిచెట్టే సాక్ష్యం చెబుతుందని అన్నాను. నేను మంచివాణ్ణి కాబట్టి నా సత్యగుణానికి ముచ్చటపడి మర్రిచెట్టు మాట్లాడుతుందని అన్నాను. ఇప్పుడు ఆ చెట్టు మాట్లాడాలి.’‘ఎలా మాట్లాడుతుంది?’ అడిగాడు తండ్రి.‘చెట్టుకి నోరెక్కడిదిరా’ అన్నాడు.‘దానికి లేదు, నీకుందిగా! నువ్వు మాట్లాడు.’ అన్నాడు నందిగుప్తుడు.‘నేనా’ ఆశ్చర్యపోయాడు తండ్రి.‘నువ్వే మాట్లాడాలి. తెల్లారకుండానే నువ్వు వెళ్ళి ఊరవతల మర్రిచెట్టు తొర్రలో దాక్కో! రాజుగారు వచ్చినప్పుడు, వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ సమాధానాలన్నీ నన్ను కాపాడేలా ఉండాలి.’ అన్నాడు నందిగుప్తుడు. నోరెళ్ళబెట్టాడు తండ్రి.‘అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగితే దొంగతనం చేసినా, దొంగనయినా నేను ధర్మాత్ముణ్ణి. సత్యసంధుణ్ణి. అప్పుడు నేనంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. పాపం సుదర్శనుడు. దొంగ కాకపోయినా దొంగవుతాడు. శిక్షింపబడతాడు. నాక్కావాల్సింది అదే!’ అన్నాడు నందిగుప్తుడు.‘తప్పురా’ అన్నాడు తండ్రి.‘చెడపకురా చెడేవు అన్నారు. నాకెందుకో నువ్వే ప్రమాదంలో పడతావనిపిస్తోంది.’ అన్నాడు మళ్ళీ.
‘నువ్వెప్పుడూ ఇంతే! ఏనాడు నన్ను పొగిడావు కనుక. నీ ఆలోచనలు నీవి. నా ఆలోచనలు నావి. నాకూ నీకూ పొత్తు కుదరదు. చెప్పక చెప్పక ఓ పని చెప్పాను. చెయ్, పద.’ అన్నాడు నందిగుప్తుడు.‘వద్దురా’ అన్నాడు తండ్రి.‘నోర్ముయ్! పద’ అన్నాడు నందిగుప్తుడు. రానని మొండికేసిన తండ్రిని భుజాల మీదికి ఎత్తుకుని, రాత్రికిరాత్రే ఊరి చివరకు చేరుకున్నాడు. మర్రిచెట్టు తొర్రలో తండ్రిని ఉంచాడు. తొర్రలో తండ్రి చొరడం కష్టంగా ఉంటే, బలవంతాన లోపలికి తోశాడు.
‘నొప్పిరా’ అని తండ్రి అంటున్నా పట్టించుకోలేదు. బయటికి వస్తేనే గాని కనిపించడు తండ్రి. తనంతట తను రావాలి తప్ప, తొర్రలో ఎవరో ఉన్నారు, వెలుపలికి తీద్దామనే ఆలోచనే రాదెవరికీ. చీమలూ పురుగులూ తొర్రని అంటిపెట్టుకుని వేలూ లక్షలు ఉన్నాయి.తెల్లగా తెల్లారింది. మంత్రి సామంతులు, సేవకులతో రాజు మర్రిచెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఊరి జనం కూడా వింత చూసేందుకు ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా పోగయ్యారు. బాధగా సుదర్శనగుప్తుడు రాజు ముందు వంగి నిల్చుని ఉంటే, ధైర్యంగా బోరవిరుచుకుని నిలబడి ఉన్నాడు నందిగుప్తుడు. అతనికి ఎలాంటి భయం లేదప్పుడు. అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకంలో ఉన్నాడు.