నమ్మకద్రోహం



రాత్రి గుడ్లగూబలు చేసిన దాడికి చచ్చిపడి ఉన్న కాకుల్నీ, వాటి గూళ్ళనీ చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు కాకిరాజు. ముక్కును నేలకు రాస్తూ తలొంచుకున్నాడు.మర్రిచెట్టు దగ్గరకి రాజు వచ్చాడని తెలుసుకున్న, గాయాలపాలయిన కాకులూ, పారిపోయిన కాకులూ ఎగిరొచ్చి, రాజు ముందు నిలిచాయి. ఏడుస్తోన్న రాజుని చూసి, అవీ కన్నీళ్ళు పెట్టుకున్నాయి. మంత్రులు వారించారు. దాంతో గుడ్లలోనే నీరు కుక్కున్నాయి. రాజుని ఓదారుస్తూ మంత్రులిలా అన్నారు.‘దుఃఖించకండి మహారాజా! రాజుగామీరు దుఃఖించకూడదు. మీ దుఃఖంరాజ్యానికి మంచిది కాదు. దయచేసి,నిగ్రహించుకోండి.’కాకిరాజు బాధను నిగ్రహించుకున్నాడు. తేరుకుని, చూశాడు.‘మీకు ఎలాంటి హానీ జరగలేదు. అందుకు అంతా ఆనందిస్తున్నాం. ఏనాడు ఏ పాపం చేశామో, ఈనాడు ఇలా అయింది. కాలం మనకి కలసి రాలేదు మహారాజా, అంతే!’ అన్నారు.‘అవును’ అన్నట్టుగా తలాడించాడు రాజు.‘చేసిన పాపానికి గుడ్లగూబలకు శిక్ష తప్పదు. అనుభవిస్తారు. ఆ రోజు వస్తుంది.’ అన్నారు మంత్రులు.

‘మహారాజా! జరిగిందాని గురించి బాధపడవద్దు. నువ్వు మాకున్నావు. మేము నీకున్నాం. ఆదేశించండి మహారాజా, గుడ్లగూబల మీదికి యుద్ధానికి వెళ్దాం. వాటి పని పడదాం.’ అన్నారు.‘విజయమో, వీరస్వర్గమో తేల్చుకుందాం మహారాజా, కాకపోతే ఇప్పుడు శత్రువు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి, దెబ్బ తీసేందుకు వేచి చూద్దాం.’ అన్నారు.‘సరే’నన్నట్టుగా తలాడించిన రాజుతో మళ్ళీ ఇలా అన్నారు.‘మనకు బలవంతుల అండ కావాలి. బలవంతులతో స్నేహం కావాలి. బలవంతులు మన పక్షం ఉన్నప్పుడే ఈ శత్రువుని మనం ఎదుర్కోగలం. బలవంతులు ఎవరున్నారన్నది ఆలోచించండి. వారితో స్నేహం కోసం సంప్రదించండి.’ అన్నారు.ఆలోచనలో పడ్డాడు రాజు. దీర్ఘంగా ఆలోచిస్తోన్న రాజుని చూశాడు చిరంజీవి. అతను ఓ మంత్రి. రాజుకి ఇష్టమయిన మంత్రి. అతను అందరిలో కలుగజేసుకుని, రాజుతో ఎన్నడూ మాట్లాడ లేదు. ఏకాంతంలోనే ఎక్కువగా మాట్లాడాడు. అలాంటిది, ఇప్పుడు తప్పదని కలుగజేసుకున్నాడు. ఇలా అన్నాడు.

‘బలహీనులతో బలవంతులు స్నేహం చేయరు మహారాజా! ఒకవేళ వారు స్నేహం చేసినా, రేపు బలవంతులతో యుద్ధం అంటే వారూ వారూ ఒకటైపోతారు. బలహీనుల్ని వేరు చేస్తారు. వేరు చేయడమే కాదు, దోచేస్తారు. అందుకని వారి ప్రాపు కోసం, వారితో స్నేహం కోసం పెద్దగా ఆలోచించకండి.’‘ఆలోచించను సరే, ఏం చేద్దామో చెప్పు?’ కొద్దిగా విసుక్కున్నాడు రాజు.‘మీరు విసుక్కున్నా, కసరుకున్నా మేమేమీ అనుకోము మహారాజా! ఊహించని కష్టం వచ్చినప్పుడు, ఎంతటి వారికయినా అసహనం తప్పదు. ఆ అసహనంలో ఆలోచించడం కూడా కష్టమే! అందుకుని దయచేసి నా మాటలు వినండి. ఇప్పటికిప్పుడు శత్రువు మీద మనం యుద్ధం ఎలానూ ప్రకటించలేం. కొద్ది సమయం వేచి చూడక తప్పదు. ఈ లోపు ఏం చేద్దామంటే...అదీ మీరు అంగీకరిస్తేనే...నేను శత్రువుల పంచన చేరుతాను.’

‘వద్దు! అది చాలా ప్రమాదం.’ అన్నాడు రాజు.‘పూర్తిగా వినండి! నేను శత్రువు గుహలో దూరుతాను. వారి ఆశ్రయం కోరుతున్నట్టు నటించి, శత్రువుల దయనీ, జాలినీ సంపాదిస్తాను. సంపాదించి, కథ నడిపిస్తాను చూడండి.’ అన్నాడు.చిరంజీవి ఆవేశపరుడు కాదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. ఎంతగానో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడు. కథ నడిపిస్తానంటున్నాడు! ఏం చేస్తాడు? కథ ఏమయి ఉంటుంది? అక్కడున్న అందరి గుండెల్లోనూ ఇవే ప్రశ్నలు. వాటికి సమాధానం తర్వాత చెబుతానన్నట్టుగా ఇలా అన్నాడు చిరంజీవి.‘ముందు మీరంతా నాకో సహాయం చెయ్యండి. ఎక్కణ్ణుంచయినా కొంచెం రక్తం తీసుకొచ్చి, నా ఒంటికి పులమండి. తర్వాత మీరంతా, ఈ చెట్టు వదిలిపెట్టి, అదిగో అక్కడుందే ఋష్యమూకపర్వతం అక్కడకి వెళ్ళిపొండి. అక్కడే నివాసాలు ఏర్పరుచుకోండి. కొద్దికాలం అక్కడే ఉండండి. తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను.’చిరంజీవి ఆషామాషీగా దేనికీ పూనుకోడు. పూనుకున్నాడంటే విజయం సాధించినట్టేననుకున్నాడు రాజు. ఆజ్ఞాపించాడిలా.

‘వెళ్ళండి, రక్తం తీసుకు రండి.’కాకులు పరుగుదీసినట్టుగా ఎగిరాయి. రక్తం కోసం వెదికాయి. రెండు ఎలుకలు కనిపించాయి వాటికి. పటి ్ట, చంపేశాయి వాటిని. వాటి నెత్తురునుతీసుకొచ్చి, చిరంజీవికి ఒంటికి ఎలా కావాలంటే అలా పులిమాయి.‘ఇక మేము వెళ్ళిరామా’ అడిగాడు రాజు.‘వెళ్ళిరండి’ అన్నాడు చిరంజీవి.కాకులన్నీ ఎగిరిపోయాయి అక్కణ్ణుంచి. రాజుతో కలసి ఋష్యమూకపర్వతానికి చేరుకున్నాయి.చీకటి పడింది. చిరంజీవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, గుడ్లగూబల గుహ దగ్గరికి చేరాడు. భయం భయంగా ఉంది. అయినా తెగించాడు. లోపలికి తొంగి చూశాడు. గుహ లోపల పెద్దదిగానే ఉంది. అయితే లోపలికెళ్ళే గుహ ద్వారం మాత్రం చిన్నదిగా ఉన్నదని గ్రహించాడు. ద్వారం దగ్గర దీనంగా ‘కావు కావు’మని అరిచాడు. హఠాత్తుగా వినవచ్చిన ఆ అరుపునకు, గుహలోని గుడ్లగూబలు కంగారుపడ్డాయి. తర్వాత తేరుకున్నాయి.‘చూడెవరో’ అంటే ఓ గూబ గుహ బయటికి వచ్చి ద్వారం దగ్గర దీనంగా ఉన్న కాకిని చూసింది. పట్టుకుని, లోపలికి లాక్కుపోయింది. రాజు ఉపమర్దనుడి ముందు నిలబెట్టింది.

‘ఎవరు నువ్వు? ఏంటీ రక్తం?’ అడిగాడు రాజు. జవాబుగా ఏడుపందుకున్నాడు చిరంజీవి. పెద్ద గొంతుతో ఏడవసాగాడు. గుడ్లగూబలన్నీ చిత్రంగా చూశాయి.‘ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది?’ అడిగాడు రాజు.‘ఏం చెప్పమంటారు మహారాజా, మిమ్మల్ని పొగిడి, ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను.’ అన్నాడు చిరంజీవి. అర్థం కానట్టుగా చూశాడు రాజు.‘నా పేరు చిరంజీవి. నేను కాకుల రాజు మంత్రివర్గంలో ఓ మంత్రిని. రాత్రి మీరు దాడి చేసి, మా కాకుల్ని చంపేరు చూడండీ, ఆ విషయమై పొద్దున పెద్ద సభ జరిగింది. కాకులకు ఇంత కష్టం వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు? అనడిగాడు మారాజు. ‘ ఏం చేద్దాం? ఏడుస్తూ కూర్చుందాం.’ అన్నాను.

రాజు నన్ను కోపంగా చూశాడు. చూస్తే చూశాడు. నిజాలు చెప్పాలనుకున్నాను. చెప్పేశాను. ‘బలవంతులు దాడి చేస్తే ఇంతే! ఇలాగే ఉంటుంది. ఉపమర్దనుడు బలవంతుడు. మహావీరుడు. ఆ మహావీరుణ్ణి మనమేమీ చెయ్యలేం. చేయగలిగింది ఒక్కటే, ఆయన్ని మనం శరణు కోరడం. శరణు కోరితే ప్రాణాలతో ఉంటాం’ అన్నాను. మరింత కోపంగా చూశాడు మా రాజు. చూడనీ, ఏం కాదనుకున్నాను. ‘ప్రతీకారం తీర్చుకుందాం, దాడి చేద్దాం లాంటి ఆలోచనలు వద్దు. బతకాలంటే ఒకటే ఆలోచన. మనందరం వెళ్ళి ఉపమర్దనుడి కాళ్ళ మీద పడడం తప్ప, మరో మార్గం లేద’ని చెప్పాను. రాజునని విర్రవీగక, ఉపమర్దనుడి కాళ్ళు పట్టుకో, జాలి పడి వదిలేస్తాడన్నాను. అంతే! ఆ మాటకి మా రాజుకే కాదు, మా కాకులన్నిటికీ నా మీద కోపం వచ్చింది. వచ్చి, నన్ను చంపాలనుకుని, ముక్కులతో పొడిచి పొడిచి ఒళ్ళంతా చిల్లులు చేశాయి. అదే ఈ రక్తం.’ అన్నాడు చిరంజీవి.

‘అయ్యయ్యో’ అన్నాయి గుడ్లగూబలు. చిరంజీవి మీద జాలిపడ్డాయి.‘పొడిచి పొడిచి, చచ్చానుకుని వదిలి పెట్టి వెళ్ళిపోయాయి. చేతకాని రాజూ, చేతకాని కాకులూ ఎక్కడికెళ్ళాయో వెళ్ళిపోయాయి. నన్నొదిలేశాయి. కొనప్రాణంలో కొట్టుమిట్టాడుతూ మీ దగ్గరకి చేరాలనిపించింది. చేరాను. మిమ్మల్ని చూడాలనిపించింది. చూశాను. ఈ జీవితానికిది చాలు.’ అన్నాడు చిరంజీవి.‘బలేవాడివే’ అభినందనగా చూశాడు ఉపమర్దనుడు.‘మహారాజా, మారాజు దుష్టచర్యలు మీకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదు. మీ కాళ్ళ మీద పడి, నా ప్రాణం విడుస్తాను.’ అంటూ ఉపమర్దనుడి కాళ్ళ మీద పడ్డాడు చిరంజీవి.‘లేవయ్యా లే! నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు.’ అన్నాడు ఉపమర్దనుడు. చిరంజీవిని లేపి, నిలబెట్టాడు.‘ఇదే మహారాజా! ఈ మంచితనాన్నే, మీ మంచితనాన్ని పొగడ్డంతోనే వచ్చింది గొడవంతా. మిమ్మల్ని పొగడకూడదట! ఎందుకు పొగడకూడదు? శత్రు రాజయితే మాత్రం, బలవంతుడూ, గొప్పవాడూ అయితే పొగడం తప్పా? చాలు మహారాజా, చాలు! మీ ఆశ్రయం నాకు దొరికింది. మిమ్మల్ని సేవించుకుంటూ ఇక్కడే ఉంటాను. మీ పేరు చెప్పుకుని బతుకుతాను. కృతజ్ఞుణ్ణి.’ అన్నాడు చిరంజీవి.తను ఆశ్రయం కల్పిస్తానని ఉపమర్దనుడు అనలేదు. అనకపోయినా, అన్నట్టుగా మాట్లాడాడు చిరంజీవి.

తాను అన్నాడేమో! అంటే మాత్రం మాటకి కట్టుబడి ఉండక తప్పదనుకున్నాడు ఉపమర్దనుడు. తమ జాతికి చెందకపోయినా రాజుగారు ఆశ్రయం కల్పించారు. తప్పదిక. అక్కున చేర్చుకోవాల్సిందే అనుకున్నాయి సేవక బృందాలు. మంత్రులు మాత్రం కొంచెం అనుమానంగా చిరంజీవిని చూశారు. వారు తనని అనుమానిస్తున్నారన్న సంగతి తెలుసుకుని, చిరంజీవి చూపును మరల్చుకున్నాడు.‘రాజా’ అన్నాడో మంత్రి.‘ఏంటి?’‘నాకెందుకో ఈ చిరంజీవిని నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటి వారికి ఆశ్రయం కల్పించడం, దూదిగుట్టలో నిప్పు రవ్వను దాచినట్టే! ఆలోచించండి. కొండంత దూదీ బూడిదయిపోతుంది.’

‘నన్నింతగా అభిమానించే చిరంజీవిని మీరు అనుమానించడం పద్ధతి కాదు. జాతి వేరని, శత్రువు అనుకోవడం పొరపాటు. బలహీనుల్ని మనం చేరదీయాలి. జాలి, దయ, కరుణ చూపించాలి. ఇదే నా ఆజ్ఞ! ఇక మీదట మీరంతా ఇతన్ని ఆదరించి, అభిమానించి తీరాల్సిందే’ అన్నాడు ఉపమర్దనుడు. నమస్కరిస్తోన్న చిరంజీవిని దగ్గరికి తీసుకున్నాడు.కన్నీళ్ళతో రాజు కౌగిట ఒదిగిపోయాడు చిరంజీవి. ఇలా అన్నాడు.‘మహరాజంటే మీరు. రాజంటే ఇలా ఉండాలి. మీలాంటి రాజులుండబట్టే ఈ నేల మీదింకా నాలాంటి వాళ్ళు బతుకుతున్నారు.’‘మీలాంటి వాళ్ళు బతకాలనే నా తాపత్రయం.’ అన్నాడు ఉపమర్దనుడు.‘మంత్రులు కాదంటున్నా నన్ను చేరదీశారు. నాకింత నీడ కల్పించారు. ధన్యుణ్ణి.’ అన్నాడు చిరంజీవి. ఎవరో కిందికి లాగినట్టుగా ఒక్కసారిగా జారిపడి, మళ్ళీ ఉపమర్దనుడి కాళ్ళ మీద పడ్డాడు చిరంజీవి. తన మీది భక్తికీ, గౌరవానికీ తెగ పొంగిపోయాడు ఉపమర్దనుడు.ఆనందబాష్పాలు చోటు చేసుకున్నాయి అతని కళ్ళలో.కొద్దిరోజులు గడిచాయి.మహారాజు ఉపమర్దనుడికి చిరంజీవి బాగా సన్నిహితుడయిపోయాడు.

ఎంతగా సన్నిహితుడయిపోయాడంటే చిరంజీవి లేకుండా ఉపమర్దనుడు ఏ పనీ చేయడం లేదు. అన్నిటికీ అతని తోడుండాలి. అంతగా దగ్గరయి, అసలు పని చక్కబెట్టుకు రాసాగాడు చిరంజీవి. గుడ్లగూబల అలవాట్లు తెలుసుకున్నాడు. గుహ రహస్యాలు తెలుసుకున్నాడు. గుహకి రక్షణ బాగానే ఉంది కాని, గుహ ద్వారమే మరీ చిన్నదిగా ఉంది. పైగా ఒకటే ద్వారం అని గమనించాడు.ఒకరోజు, పగటి పూట, గుడ్లగూబలన్నీ గుహలో మాంఛి నిద్రలో ఉండగా గుహలోంచి బయట పడ్డాడు చిరంజీవి. చుట్టుపక్కల పేడ కోసం చూశాడు. కొద్దిదూరంలో పశువులు మేస్తున్నాయి. అక్కడికి వచ్చి వాలాడు. తట్టలు తట్టలుగా పేడ పడి ఉందక్కడ. ఆ పేడని కాళ్ళలో, ముక్కులో పెట్టుకుని పట్టుకొచ్చాడు. గుహ ద్వారం దగ్గర జార విడిచాడు. పదే పదే తిరిగి ద్వారం దగ్గర బాగానే పేడని కూడేశాడు. తర్వాత గుహ ద్వారానికి పేడని పట్టించాడు. గాలి కూడా లోపలికి చొరబడలేని విధంగా గట్టిగా పేడని గుహద్వారానికి అడ్డంగా పెట్టి, సన్నగా నవ్వుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media