నలుడు స్వయంవరానికి బయలుదేరుట



దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒకరోజులో విదర్భను చేరటం ఎలా? అనుకుని సారధి అయిన బాహుకుని పిలిచి "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్కరోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అన్నాడు. సరే అని చెప్పినా బాహుకుడు మనస్సు కలతకు గురైంది. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది.

అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కాని అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది. అని దుఃఖించాడు. "అయినా దమయంతి పతివ్రత. ఇద్దరుపిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్ళి చేసుకుంటుందా? ఏమో? ఆ వింత చూస్తాను" అని మనసులో అనుకున్నాడు.

వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్ష్ణేయుడికి అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కాని ఈ కురూపి నలుడెలా అవుతాడు" అని మనసులో అనుకున్నాడు.

ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి, క్రింద పడింది "బాహుకా రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అన్నాడు. బాహుకుడు "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేసాం. అంతదూరం నడుచుకుంటూ ఎలా తీసుకు రాగలడు?" అన్నాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది.

అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో "బాహుకా ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను " అని అన్నాడు. బాహుకుడు "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్కకు కచ్చితంగా సరిపోయింది.

బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు "బాహుకా ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం" అన్నాడు. అప్పుడు బాహుకుడు "మహారాజా! ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను" అన్నాడు. ఋతుపర్ణుడు "ఇప్పుడు కాదు, తరువాత అడిగి నేర్చుకుంటాను" అన్నాడు.

అక్షహృదయ విద్య మహిమవలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకడు కాటువేయడం వలన అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శాపం ఏముంది, నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని, దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కాని రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించ లేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.