నలుడు



నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.

దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది.

చెడు ప్రభావానికి గురైన తరువాత, నలుడు తన సోదరుడు పుష్కరుడితో పాచికల ఆట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి వెళ్ళిపోయేముందు దమయంతి తన పిల్లలను రథసారధితో తన తండ్రి రాజ్యానికి పంపించింది. నలదమయంతులకు ఎవరు సహాయం చేసినా వారికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుందని పుష్కరుడు హెచ్చరించాడు. దమయంతి నిద్రపోతున్నప్పుడు కలి ప్రభావంతో నలుడు ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

అడవిలో కర్కోటకుడు అనే నాగుని నలుడు అగ్ని నుండి రక్షించాడు. కర్కోటకుడు (నాగు) తన విషాన్ని చిమ్మగా నలుడు, బాహుకుడు అనే వికారమైన మరగుజ్జుగా మారాడు. అయోధ్య రాజు ఋతుపర్ణుడు దగ్గరికి వెళ్ళి అతనికి సేవ చేయమని కర్కోటకుడు, నలుడికి సలహా ఇచ్చాడు. నలుడు తన అసలు రూపాన్ని పొందడం కోసం ఒక మాయ వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. నలుడు, ఋతుపర్ణుడు వద్దకు వెళ్లి అతనికి రథసారధిగా, వంటవాడిగా పనిచేశాడు.

దమయంతి నిద్రనుండి లేచి చూడగా తన భర్త పక్కన లేకపోవడంతో, కన్నీళ్లు పెట్టుకుంటూ అతనిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ దారిలో ఆమెకు పాము ఎదురయింది. మునులను, వ్యాపారులను, ప్రయాణికులను కలుసుకుంది. రాజ్యానికి రాణి అయిన తన అత్తను కలుసుకుంది. చివరికి, తన తండ్రి రాజ్యాన్ని చేరుకుంది. ఎవరైనా తన భర్త జాడను చెప్తే వారికి బహుమతిని ఇస్తానని ప్రకటించింది. ఆమె సేవకులలో ఒకరు వచ్చి సుదూర రాజ్యంలో బాహుకుడు అనే రథసారధి ఉన్న సమాచారం అందించాడు.

నలుడి జాడ తెలుసుకోవడానికి దమయంతి ఋతుపర్ణుడికి ఒక వర్తమానాన్ని పంపింది. దమయంతి మరో వివాహం చేసుకోబోతున్నదని విన్న బాహుకుడు, ఋతుపర్ణుడిని తీసుకొని రథాన్ని వేగంగా నడుపుతూ అయోధ్య నుండి విదర్భకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలో కలి తన శరీరం నుండి బయటకు వచ్చి భయంతో, క్షమించమని కోరాడు. నలుడు అతనిని క్షమించి, కొద్దిగంటల్లో భీముని రాజ్యానికి చేరుకున్నాడు.

దమయంతి తన సేవకుడి ద్వారా రథసారధి బాహుకుడిని తన భవనానికి పిలిపించింది. ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టగా నలుడు తన అసలు రూపంలోకి వచ్చాడు. ఋతుపర్ణుడి సహాయంతో జూదంలో సోదరుడు పుష్కరుడిని ఓడించి, అతను చేసిన తప్పును క్షమించి, అతనిని తన బానిసగా చేసుకున్నాడు. నలుడు కలి ప్రభావాన్ని అధిగమించి, తన రాజ్యాన్ని పొంది, దమయంతిని కలుసుకున్నాడు. నలదమయంతుల కథను ఎవరు చదివినా కలి దుష్ప్రభావాల ప్రభావితం ఉండదని కలి, నలుడికి వరం ఇచ్చాడు.

Responsive Footer with Logo and Social Media