నక్కమారాజు



అటు చిత్రవర్ణుడూ, ఇటు హిరణ్యగర్భుడూ యుద్ధానికి సన్నద్ధులయ్యారు. బలాబలాలు తెలుసుకునేందుకు గూఢచారుల్ని ఆశ్రయించారు. తమ పనుపున గూఢచర్యానికి సరయిన వాడు దీర్ఘముఖుడే అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. అవునన్నాడు హిరణ్యగర్భుడు. అంగీకరించాడు.‘‘శత్రువు పట్ల ఏమరుపాటు పనికిరాదు. చిటారుకొమ్మన ఆదమరిచి నిద్రపోయినంత ప్రమాదం అది. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు.మనల్ని మనం రక్షించుకోవడంలో ఇరవై నాలుగు గంటలూ అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనలూ, వ్యూహరచనలూ రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మిన మంత్రితోనే రాజు చర్చించాలి. ఇవన్నీ మీకు తెలియనవి కావు. కాకపోతే మంత్రిగా చెప్పడం నా ధర్మం.’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘‘చెప్పడంలో తప్పులేదు. బాగానే చెప్పావు. గూఢచారిని కూడా మంచివాణ్ణే నిర్ణయించావు. ఇక ఆలస్యం దేనికి? పంపించు.’’ అన్నాడు హిరణ్యగర్భుడు. మంత్రి మరేదో చెప్పబోతున్నాడు. అంతలో అక్కడికి సేవకుడు ఒకడు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు. ఇలా చెప్పాడు.‘‘జంబూద్వీపం నుంచి ఓ చిలక వచ్చింది. పేరు అరుణముఖడు. రాజదర్శనం కావాలంటోంది. పంపించమంటారా?’’సమాధానం కోసం మంత్రిని చూశాడు హిరణ్యగర్భుడు.‘‘కొద్దిరోజుల పాటు ఆగాలని చెప్పు. రాజదర్శనం తప్పక అవుతుందని చెప్పు’’ సేవకుడితో చెప్పాడు సర్వజ్ఞుడు.‘‘చిత్తం’’ అని వెనుతిరిగాడు సేవకుడు. చిలక దగ్గరకు వచ్చాడు.‘‘రాజుగారూ, మంత్రిగారూ చర్చల్లో ఉన్నారు. రాజుగారిని కలవాలంటే మీకు కొద్ది రోజులు పడుతుంది. వేచి ఉంటానంటే మీకు వసతి సౌకర్యాలు చూస్తాం. లేదంటే మీ ఇష్టం.’’ అన్నాడు సేవకుడు.‘‘వేచి ఉంటాను’’ అన్నాడు అరుణముఖుడు. అతనికి వసతి సౌకర్యాలు నిముషాల్లో ఏర్పాటు చేశాడు సేవకుడు.‘‘వచ్చేసింది. యుద్ధం వచ్చేసింది. వీరులకిది పండగ. శక్తి యుక్తులు చూపించి వారంతా కీర్తిమంతులవుతారు. ఈ మాటే చెప్పి, రాజ్యంలోని వీరులందర్నీ యుద్ధానికి సిద్ధం చెయ్యండి. వాళ్ళకు ఉత్సాహాన్నీ, యుద్ధం పట్ల అనురక్తినీ కలిగించండి.’’ చెప్పాడు హిరణ్యగర్భుడు.

సర్వజ్ఞుడు అలాగేనన్నట్టుగా తలూపాడు. యుద్ధం అనగానే హుషారొచ్చింది రాజుకి. యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించాడు. గమనించాడది సర్వజ్ఞుడు. ఇలా అన్నాడు.‘‘సామ దాన భేద దండోపాయాల్లో, దండోపాయం ఆఖరిది. అంటే ముందు మూడు ఉపాయాలూ సామం, దానం, భేదం ఫలించకపోతే అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి. అయినా మనం కారణం అయినట్టుగా యుద్ధాన్ని మనం మొదలుపెట్టకూడదు. అవతలి వారే మొదలుపెట్టడం అన్ని విధాలా మంచిది. రెండు వైపులా ప్రజల సానుభూతి మనకే ఉంటుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే గెలుపు. ఇది జగమెరిగిన సత్యం.’’‘‘అవునవును’’ అన్నాడు హిరణ్యగర్భుడు.

‘‘యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనం. ఎవరు గెలిచేదీ, ఎవరు ఓడేదీ ఆఖరి వరకూ అంతుపట్టదు. యుద్ధం వచ్చేదాకా అందరూ వీరులూ శూరులే! యుద్ధం వచ్చాక తెలుస్తుంది, అసలు వీరులూ, శూరులూ ఎవరన్నదీ. జననష్టాన్ని తెచ్చే యుద్ధాన్ని నివారించడం అన్ని విధాలా మంచిది. యుద్ధం వరకూ రాకూడదెవరూ. యుద్ధంతో పని లేకుండా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టుకోవాలి. పెద్దబండరాయిని కొండ మీదకి ఉపాయంతోనే కదా చేర్చేది. అలాగే ఇదీనూ. సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చిందీ చిన్న ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కాలి. సుఖపడాలి. అంతేకాని, కయ్యానికి కాలు దువ్వుతూ శపథాలు చేయడం, బీరాలు పలకడం చాలా ప్రమాదం. అది బుద్ధిహీనుల లక్షణం కూడా’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘నిజమే’నన్నట్టుగా చూశాడు హిరణ్యగర్భుడు.

‘‘చిత్రవర్ణుడేమీ తక్కువ తినలేదు. అతనూ బలవంతుడే! అతని మీద యుద్ధం ప్రకటించడం మిడతలు నిప్పులో దూకినట్టుగా ఉంటుంది. దేనికయినా ఓర్పు ముఖ్యం. తొందరపాటు కూడదు. ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే, ముందు మనం కోట నిర్మించుకోవాలి. కోటలో ఉన్న రాజు, బయట వందమంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువూ ఎదుర్కోలేడు. అందుకని, కోట నిర్మాణం పూర్తయ్యే వరకూ ఏ దేశం దూతలకూ దర్శనం ఇవ్వకపోవడమే మంచిది. ఏమంటారు?’’ అడిగాడు సర్వజ్ఞుడు.‘‘నిజమే! మనకిప్పుడు కోట అత్యవసరం.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘ముందు దాని నిర్మాణం చూడండి.’’ ఆజ్ఞాపించాడు. మరుక్షణం అక్కడ వీరవరుడు అనే పక్షి ప్రత్యక్షమయింది. అతను కోట నిర్మాణంలో పెట్టింది పేరు.‘‘రాజుగారికి తొందరగా ఒక కోటను నిర్మించి పెట్టాలి. అది నువ్వే చెయ్యగలవు. అందుకే నిన్ను పిలిపించింది.’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘‘తప్పకుండా’’ అన్నాడు వీరవరుడు. రాజుకి ఇలా విన్నవించాడు.

‘‘రాజా! ఈ పక్కనే కొండ గుహ ఉంది. చాలా పెద్దది. అక్కడ కొలను కూడా ఉంది. వచ్చి చూడండి, అది మీకు నచ్చితే దానినే కోటగా రూపొందిస్తాను.’’మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవడమే కాదు, అవసరాలు కనిపెట్టి చెప్పడం వీరవరుడు కార్యదక్షతకు నిదర్శనమనిపించింది. రాజుకి అది చాలా నచ్చింది. మెచ్చుకున్నాడతన్ని. బహుమానాలు అందజేశాడు.‘‘కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారులంతా నీ కనుసన్నల్లో ఉండాలి. నీ ఆజ్ఞనే పాటించాలి. సేవకుల్ని నువ్వే నియమించుకో! అన్నిటికీ బాధ్యత నీదే’’ అన్నాడు హిరణ్యగర్భుడు.‘‘చిత్తం’’ అన్నాడు వీరవరుడు. సెలవు తీసుకున్నాడు అక్కణ్ణుంచి. ఒకనాడు రాజూ, మంత్రీ కొండగుహను సందర్శించారు. బాగుందనుకున్నారు. కోట నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా వీరవరుణ్ణి ఆదేశించారు. అంతే! శత్రువులు చొరలేని విధంగా కోటను నిర్మించాడు వీరవరుడు. వేయికళ్ళతో దాన్ని కాపలా కాశాడు.కొద్దిరోజులు గడిచాయి.యుద్ధం గురించి చర్చోపచర్చలు ఇంకా జరుగుతునే ఉన్నాయి. సర్వజ్ఞుడికి క్షణం తీరిక లేకుండా ఉంది. ఎల్లవేళలా రాజుని అంటిపెట్టుకునే అతను ఉండాల్సి వస్తోంది. ఒకరోజు సేవకుడొకడు వచ్చాడు. ఇలా చెప్పాడు.

‘‘జయము జయము మహారాజా! సింహళద్వీపం నించి కాకి ఒకటి వచ్చింది. పేరు నీలవర్ణుడు. మీ దర్శనం కోరుకుంటున్నాడు.’’ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. యుద్ధసమయంలో తెలివితేటలు గల వాళ్ళు అనేకులు అవసరమవుతారు. వాళ్ళ సలహాలూ సంప్రదింపులూ కావాల్సి ఉంటుంది. ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ. కాకులు తెలివయినవి. వాటిని ఉపయోగించుకోవాలి.‘ప్రవేశపెట్టు’ అందామనుకుంటూనే, ఎందుకయినా మంచిదని, సర్వజ్ఞుని చూశాడు రాజు. తన మనసులో మాట బయటపెట్టాడు.‘‘వెయ్యి కుక్కలకన్నా ఒక సింహం గొప్పది. తెలివితేటలు లేని సింహం కన్నా అవి మెండుగా ఉన్న కాకి గొప్పది. అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవడం ఎంతయినా అవసరం. ఏమంటావు?’’ అడిగాడు.

హిరణ్యగర్భుని ఆలోచనకు నవ్వు వచ్చింది సర్వజ్ఞుడికి. అయినా నవ్వలేదు. అణుచుకున్నాడు దాన్ని. రాజు ముందు నవ్వడం ప్రమాదం అని అతనికి తెలుసు.‘‘నిన్నే, ఏమంటావు?’’ రెట్టించాడు హిరణ్యగర్భుడు.‘‘మీరేమీ అనుకోనంటే నాదొక మాట! శత్రువుల్ని గెలిచేందుకు ముక్కూ మొహ ం తెలియని వాళ్ళని చేరదీయకూడదు. అది చాలా ప్రమాదం. ఒకరకంగా కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలనుకోవడమే! కాకులు మనలా నీటి పక్షులు కావు. వాటి సలహాలూ, సూచనలూ వే రే విధంగా ఉంటాయి. వాటి వల్ల మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అయినవాళ్ళను వదిలి కాని వాళ్ళను పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. దెబ్బ తింటాం. అలా దెబ్బ తిన్న నక్క కథ ఒకటి చెబుతాను, వినండి. ’’‘‘చెప్పు’’సర్వజ్ఞుడు ఇలా చెప్పసాగాడు.

‘‘అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ నక్క ఉంది. రాత్రి చీకట్లో తిండి కోసం అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంటపాత్రలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. తెల్లారితే, ఇంటివాళ్ళు చూస్తే చంపడం ఖాయం. అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లారుతూనే కళ్ళు తేలేసి, కాళ్ళు బిగదీసి, ఊపిరి బిగబట్టింది. చచ్చిందాన్లా పడి ఉంది. తెల్లారింది. ఇంటివాళ్ళు చూశారు. పాత్రలో నక్క చచ్చిపడి ఉండడాన్ని చూసి చిత్రంగా చెప్పుకున్నారు. ఇంటిపెద్ద కబుర్లాపి, పాత్రలోంచి నక్కని బయటికి లాగాడు. మోసుకుని ఊరి చివరకు తీసుకెళ్ళాడు. అక్కడ పారేసి, వెనక్కి తిరిగాడు. కనుచూపు మేర అతను వెళ్ళేంత వరకూ ఆగి, తర్వాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. పరుగుదీసింది అక్కణ్ణుంచి.రాత్రంతా వంటపాత్రలో దొర్లడంతో, తప్పించుకునే ప్రయత్నాలు చెయ్యడంతో పాత్రలోని మసి అంతా నక్కకి అంటుకుంది. దాంతో నల్లగా తయారయిందది. ఆ నలుపుని చూసుకుని ఆనందించింది.

‘ఈ రంగు నా అదృష్టం. ఇంత నలుపురంగు కలిగిన నక్క నాకు తెలిసీ ఎవరూ లేరు. అందం అంటే నలుపుదే! నా అందాన్ని నాలుగు నక్కలకీ చూపించాలి’ అనుకుంది. చూపించింది.‘ఎలా వచ్చిందీ రంగు?’ అడిగాయి నక్కలు.‘‘ఎలా వచ్చిందంటే...రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్లాడు. దేవతలందరిముందూ నా మంచితనాన్నీ, నా పనితనాన్నీ మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్నీ అడవికి రాజుని చేశాడు. అందుకు గుర్తుగా నిగనిగలాడే ఈ నలుపురంగుని పులిమాడు.’ అంది. ఆశ్చర్యపోయాయి నక్కలు. ‘అవునా’ అన్నట్టుగా చూశాయి.‘నేనేం మీలా మామాలు నక్కను కానిప్పుడు. రాజుని. మీరంతా నన్ను సేవించాలి. గౌరవించాలి. ఇది నా మాట కాదు. దైవాజ్ఞ.’ అంది నక్క.

వణికిపోయాయి నక్కలు.వినయంగా ముందరి రెండు కాళ్ళూ జోడించి నమస్కరించాయి.‘మీరే కాదు, ఇక మీదట ఈ అడవిలోని జంతువులన్నీ నా మాట వినాల్సిందే! వెళ్ళండి, నన్ను రాజుని చేసింది దేవుడని అందరికీ చెప్పండి. నా మాట కాదంటే ప్రమాదం అని కూడ చెప్పండి’ అంది నక్క. అలాగే అన్నాయి పిచ్చి నక్కలు. పరుగుదీశాయి అక్కణ్ణుంచి.