నక్కజిత్తులు
‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.
చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.
‘‘బాధపడకు. నువ్వింత మంచిదానివని తెలియక తొందరపడ్డాను. తప్పునాదే! నన్ను క్షమించు. ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం. కబుర్లాడుకుందాం. సరేనా’’ అన్నది గద్ద. ఆ మాట కోసమే కాచుకుని ఉంది పిల్లి.‘‘సరే’’ అంది. కొద్దిరోజులు గడిచాయి. గద్ద-పిల్లి రెండూ మంచి స్నేహితులయిపోయాయి. గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే, తన దగ్గరే చెట్టు తొర్రలోనే ఉండిపొమ్మంది గద్ద. పిల్లికి కావాల్సింది అదే! ఉండిపోయింది. ఉండిపోయి, గద్దకు తెలియకుండా ప్రతిరోజూ చెట్టెక్కి పక్షిపిల్లల్ని గొంతు కొరికి అక్కడేకొమ్మ మీదే చంపి, తొర్రలోకి తెచ్చుకుని తినసాగింది పిల్లి. అది తింటున్నది ఆకో అలమో అనుకునేది కళ్ళు లేని గద్ద.కొన్నాళ్ళకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు. గూటిలోనుంచి కిందపడే అవకాశం లేదు. మరెలా మాయమవుతున్నదీ అంతుచిక్కక ఆలోచనలో పడ్డాయి. వెతకసాగాయి. పక్షులు పిల్లల కోసం వెతుకున్న సంగతి గ్రహించి, ఇక అక్కడ ఉండడం తనకు ఎంత మాత్రం క్షేమం కాదనుకుంది పిల్లి. పారిపోయింది అక్కణ్ణుంచి. వెతగ్గా వెతగ్గా పక్షులకు పిల్లల బొమికలు గుడ్డిగద్ద తొర్రలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయవి. ముసలిది, పైగా గుడ్డిదని గ ద్ద మీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా అనుకున్నాయి. కోపం తెచ్చుకున్నాయి పక్షులు. ఒక్కుమ్మడిగా గద్ద మీద దాడి చేశాయి. ఏం జరుగుతోందో తెలియట్లేదు. పారిపోయేందుకు అవకాశం లేదు. ప్రతిఘటించలేని పరిస్థితుల్లో, పక్షులు పొడిచి పొడిచి హింసించడంతో పాపం గుడ్డిగద్ద చచ్చిపోయింది.-కథ చెప్పడం ముగించింది కాకి. కొత్త వాళ్ళను వెంటనే నమ్మకూడదంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది.
నిజమేనన్నట్టుగా ఆలోచనలోపడ్డ జింకను చూసి, నక్క కల్పించుకుంది ఇలా.‘‘బాగుంది బాగుంది. వినే వాళ్ళుంటే నీతులు ఎన్నయినా నేనూ చెబుతాను. నాకు తెలియక అడుగుతాను. నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు, నువ్వూ తనకి కొత్తేకదా! కొత్త అనుకుని దూరంగా ఉంటే మీ ఇద్దరికీ స్నేహం కుదిరేదా చెప్పు. నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు. నేను చెప్పిందే వేదం అంటే ఎవరూ ఒప్పుకోరు.’’నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్నది జింక. ‘వూరుకో వూరుకో’ అని ఓదార్చ చూసింది. పట్టించుకోలేదు నక్క.‘‘వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువంటూ సాటి జీవుల్ని అనుమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. బతికినంత కాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములికి వీడూ వాడంటూ తేడాలు ఉండవు. అందరూ తమవారేననుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి.’’ అంది నక్క.
‘అవును కదా’ అన్నట్టుగా కాకిని చూసింది జింక.‘‘చూడు, బతికినంత కాలం బతకం. రేపో మాపో అంతా చనిపోయే వాళ్ళమే! ఈ మూడునాళ్ళ ముచ్చట కోసం అనుమానాలూ, శత్రుత్వాలూ పెంచుకోవద్దు. మంచినే తలపెడదాం. మంచిగా ఉందాం. స్నేహంగా ఉందాం. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం.’’ అంది నక్క.‘‘నిజమే! ఉన్న నాలుగు రోజులూ కలిసి మెలసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం.’’ అంది జింక. ఒప్పుకోక తప్పింది కాదు కాకికి. ‘సరే మరి’ అంది. కొద్ది రోజులు గడిచాయి. కాకి-నక్క-జింక స్నేహంగా ఉంటూ హాయి హాయిగా అడవి అంతా తిరగసాగాయి. ఒకరోజు జింకను తీసుకుని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఎపుగా పెరిగి ఉందక్కడ.‘‘చూస్కో! కన్నుల పంటంటే ఇదే! కడుపునిండా తిను.’’ అన్నది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి.
పొలంలో పడి, పంటను తిన్నది. మర్నాడు, ఆ మర్నాడు...అలా వారం పదిరోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజు రోజుకీ పంట తరిగిపోవడంతో ‘ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే. దాన్ని ప్రాణాలతో వదలకూడదు’ అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు. ఆకలికి పరుగుదీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి, అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగుణ్ణనుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే! నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది.
కాస్సేపటికి నక్క వచ్చిందక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడతను. అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చన నుకుంది నక్క. అయితే లోలోపలి తన భావాలేవీ జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగు పరుగున వచ్చింది నక్క.‘‘వచ్చావా! నీకోసమే చూస్తున్నాను. రారా! తొందరగా వల తాళ్ళను కొరుకు. బయటపడతాను. ఈ పొలం యజమాని రాక ముందే మన ం ఇక్కణ్ణుంచి పారిపోవాలి.’’ అంది జింక.‘‘అవునవును’’ అంటూ వల తాళ్ళను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి, తర్వాత తాళ్ళ వాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క.‘‘ఏమయింది’’ అడిగింది జింక.‘‘ఈ వల తాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారోగాని, ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండనీ! ఈ తాళ్ళను కొరకాలంటే ఈ రోజు సోమవారం. సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలనూ ముట్టను. ముడితే వ్రతభంగం అయిపోతుంది. పాపం చుట్టుకుంటుంది.’’ అంది నక్క.ఊహించని జావాబు అది. జింకకు స్పృహ తప్పినంత పనయింది.