నక్క మరియు తాబేలు



ఒక అడవిలో మర్రిచెట్టు ఉంది, దాని ప్రక్కనే చిన్న చెరువు ఉంది. ఆ ప్రాంతమంతా పచ్చని చెట్లతో, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో చక్కగా ఉంటుంది. చెరువులో ఒక తాబేలు నివసిస్తుంది. అది అప్పుడప్పుడూ ఆ చెట్టు క్రింద చేరి చల్లని గాలికి సేదతీరేది. ఆ సమయంలో మంచినీళ్ళు తాగేందుకు ఒక నక్క ఆ చెరువు వద్దకు వచ్చింది. చెట్టు క్రింద సేదతీరుతున్న తాబేలును నక్క చూసింది. దాన్ని చంపి తినాలని నక్క భావించి తన కాలితో తాబేలు డిప్పపై కొట్టింది. ఎవరో తనకు హాని చేయతలపెట్టారని భావించిన తాబేలు వెంటనే తన తలను డిప్పలోనికి ముడుచుకుంది.

తాబేలు ఏ మాత్రం కదలలేదు. నక్క ఎంత ప్రయత్నించినా తాబేలు పైభాగాన ఉన్న డిప్పను కొరకలేకపోయింది. అప్పుడు తాబేలు మాట్లాడుతూ “నక్క! నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను తినలేవు, నా శరీరం చాలా గట్టిది. నన్ను గంటసేపు నీటిలో నానబెడితే నా శరీరం మెత్త బడుతుంది, అప్పుడు నువ్వు సులభంగా తినవచ్చు” అన్నది.

తాబేలు ఉపాయాన్ని అర్థం చేసుకోలేని నక్క చెరువు ఒడ్డున నీటిలో తాబేలును ఉంచి కాలితో పట్టుకుని ఉంది. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత తాబేలును తినే ప్రయత్నం చేసింది, అయినా దాని డిప్ప మెత్త పడలేదు. “ఇంకా నీ శరీరం మెత్తబడలేదేమిటి?” అని నక్క తాబేలును ప్రశ్నించింది. “నక్క! నువ్వు చిన్న పొరపాటు చేశావు.

నువ్వు నాపై కాలితో పట్టుకుని ఉన్నావు. అందువల్ల నా శరీరం సరిగ్గా నీటిలో నానలేదు. నీ కాలును తేలికగా నా శరీరంపై ఉంచు, త్వరగా నేను నీటిలో నానిపోతాను” అన్నది తాబేలు. తాబేలు చెప్పినట్లు చేసింది నక్క, తనపై నక్క తేలిక బరువుతో కాలు మోపగానే ఆలస్యం చేయకుండా తాబేలు చెరువులోకి దూకేసింది.

నీతి కథలు : నక్క మోసబుద్ధితో తాబేలును తినాలనుకుంది. తాబేలు మోసాన్ని మోసంతోనే జయించి, నక్క నుండి తన ప్రాణాలను కాపాడుకుంది.

Responsive Footer with Logo and Social Media