ముంగిస-దేవశర్మ



పాములరాజు మందవిషుని ఆలోచన ఫలించింది. అతడు చెప్పిందంతా నమ్మాడు కప్పలరాజు జలపాదుడు.పాముపడగ మీద ఊరేగుతూ చెరువులోని కప్పల్ని తినేందుకు అంగీకరించాడతను. పాముకి పట్టపగ్గాలు లేకపోయాయి. అలా రోజూ కొన్ని కప్పల్ని తింటూ, కొన్నాళ్ళకు చెరువులోని కప్పలన్నిటినీ తినేసింది పాము. చివరికి ఓ రోజు జలపాదుణ్ణి కూడా మింగేసింది.ఆ పాములాగే నేను కూడా హిరణ్యగర్భుణ్ణి నమ్మించి మోసం చేశాను. యుద్ధంలో కోట తగలబెట్టి, అతన్ని నాశనం చేశాను. అడవిలో పుట్టే దావాగ్ని, చెట్లను కాలుస్తుందిగాని, వాటిని సమూలంగా నాశనం చెయ్యదు. అదే, నది నీటిని తీసుకోండి, చల్లగా ఉండి, ఒడ్డు మీది చెట్లను వేళ్ళతో సహా మింగేస్తుంది. బలంతో చెయ్యలేని పనిని, తీయతీయని మాటలతో నమ్మించి సాధించవచ్చు.’’ అన్నాడు మేఘవర్ణుడు.

అవునన్నట్టుగా తలూపాడు చిత్రవర్ణుడు. కొద్దిసేపు మాటలు లేవు. అంతా ఆలోచనలో పడ్డారు. అదే సమయం అన్నట్టుగా కల్పించుకున్నాడు దూరదర్శి. సంధి విషయం మళ్ళీ ప్రస్తావించాడు.‘‘రాజా! హిరణ్యగర్భుడు, తన దూతను సింహళరాజు మహాబలుని దగ్గరకు పంపాడంటూ మన గూఢచారులు ఇప్పుడే కబురు తెచ్చారు. గుర్తుందా మహారాజా! ఈ మహాబలుణ్ణి గతంలో మనం ఓడించాం. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకటయ్యారు. ఒకటై ఆ ఇద్దరూ మన మీద దాడి చేస్తే వారిని ఓడించడం మనవల్ల కాదు. అందుకే చెబుతున్నాను, హిరణ్యగర్భునితో మనం సంధి చేసుకోవడమే అన్ని విధాలా ప్రయోజనం.’’దూరదర్శి మాట పూర్తికానేలేదు, ఓ చిలుక ఎగురుకుంటూ వచ్చిందక్కడకి. వేగంగా ఎగురుకుంటూ రావడంతో అలసిపోయిందేమో, ఆగాగి ఇలా చెప్పింది.‘‘మహారాజా! సింహళరాజు మహాబలుడు లేడూ, వాడు పెద్ద సైన ్యంతో వచ్చి, మన రాజధానిని చుట్టుముట్టాడు.’’చిత్రవర్ణుడికి మతిపోయింది.‘‘చూసింది చూసినట్టుగా వివరంగా చెప్పు’’అడిగాడు.

‘‘ఇందాక నేను పళ్ళ కోసం తిరుగుతూంటే పొలిమేరల్లో మన సరిహద్దు సైన్యం హడావుడి చూశాను. ఎందుకు హడావుడి పడుతున్నారంటూ చెట్టు చిటారుకొమ్మన కూర్చుని గమనించానంతా. దుమ్ములేపుకుంటూ సింహళరాజు సైన్యం తరలి వస్తోంది. బారులు తీర్చి కవాతు చేస్తోంది. ఆ సైన్యాన్ని చూసి, ప్రాణభయంతో అటుగా ఉన్న పక్షులన్నీ ఎగిరి, మన రాజధానిని చేరుకుంటున్నాయి. ఓ కొంగని ఆపి అడిగాను, ‘ఏమిటిదంతా?’ అని. ‘ఏమిటేమిటి? సింహళరాజు మన మీదికి దండెత్తి వస్తున్నాడు’ అని చెప్పింది. అంతే! తెలిసిన సమాచారాన్ని వెంటనే మీ ముందుంచాలని పరుగున వచ్చానిక్కడికి.’’ అంది చిలుక.‘‘ఏ కారణం లేకుండా సింహళరాజు మనమీదికి దండెత్తి వస్తున్నాడు మహారాజా! పెద్ద సేనతో తరలి వస్తున్నాడు. పాపం! మన సరిహద్దు సైన్యానికి ఏ మాత్రం ఈ విషయం తెలియదు. దాంతోనే హడావుడి పడుతున్నారు.’’ అంది మళ్ళీ చిలుక.

చిత్రవర్ణుడికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబారాయి. పెద్ద గొంతుతో అరిచాడిలా.‘‘పేరుకి మహాబలుడే కాని,మన మీద దాడి చేయబోయి చిత్తుగా ఓడిపోయాడు. అప్పుడే ఆ సంగతిమరచిపోయినట్టున్నాడు. వేలాది సైన్యాన్ని యుద్ధంలో కోల్పోయి, ఒంటరివాడైపోయాడు. బంధిద్దాం అనుకునేంతలో పారిపోయాడు. పారిపోయిన వాణ్ణి పట్టుకుని చంపడం యుద్ధనీతి కాదు. అందుకనే వదిలేశాం. వదిలేసిన పాపానికి ఇప్పుడు దండెత్తి వస్తున్నాడు. రానీ రానీ! వాడెంత? వాడి సైన్యం ఎంత? పదండి, చెబుదాం వాడి సంగతి. మన బలం ముందు, మన సైన్యం ముందు వాడు నిలబడగలడా? కావాలనే నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు. ముందు దండెత్తి వచ్చిన సైన్యాన్ని మట్టుబెడదాం. ఆ తర్వాత సింహళరాజ్యాన్ని చేజిక్కించుకుందాం. రండి.’’చిత్రవర్ణుడు దారి తీశాడు. అతన్ని వారించాడు మంత్రి.

‘‘తొందరపడవద్దు మహారాజా! జాగ్రత్తగా ఆలోచించండి. అంతా మీకే తెలుస్తుంది. ఇప్పుడు మన పరిస్థితేం బాగాలేదు. మొన్నటి యుద్ధంలో చాలా సైన్యాన్ని మనం కోల్పోయాం. ధైర్యశాలి, పరాక్రమవంతుడు మన సేనాని తామ్రచూడుడు చనిపోయిన తర్వాత మన సైన్యానికి సరయిన నాయకుడే లేకుండా పోయాడు. నాయకుడి సంగతి వదిలేస్తే, ప్రాణాలొడ్డి, వీరోచితంగా పోరాడగలిగినవాళ్ళు ఇప్పుడు మన సైన్యంలో లేరు.’’ అన్నాడు మంత్రి. చిత్రవర్ణుడు అప్రయత్నంగా వెనకడుగు వేశాడు.‘‘మహాబలుణ్ణి మనం ఓడించిన మాట నిజమే! కాని, ఇవాళ అతన్ని ఓడించగల శక్తి సామర్ధ్యాలు మనకు లేవు. నిప్పుతో కాగిన నీరే, పొంగి పొర్లి, నిప్పును ఆర్పేస్తుంది. అర్థం చేసుకోండి! పరిస్థితులు మారాయి. బండిచక్రంలా తిరుగుతూ కాలగతి మారుతోంది. ఒకప్పుడు పైన ఉన్నవారు కిందికి వస్తున్నారు. వస్తారు. తప్పదు. ఇదంతా నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికీ, నన్ను నేను కాపాడుకోవడానికీ చెప్పట్లేదు. దయచేసి ఆలోచించమని చెబుతున్నాను. సాహసం అన్ని వేళలా పనికి రాదు. మన బలాబలాల సంగతి తెలియకుండా ముందుకురకడం మనకే మంచిది కాదు.తానెంత బలవంతుడయినా ఒక రాజు, పదిమంది రాజులతో తగవు పెట్టుకోకూడదు.

ఒకేసారి నలుగురితోతగవు పెట్టుకుంటే, ఎంతటి మహారాజయినా మట్టి కరుస్తాడు. బలవంతమయిన సర్పం చలిచీమలకి చిక్కి చచ్చిపోవడం మనకు తెలియదా చెప్పండి.’’ ఆగాడు మంత్రి.ఆలోచనలో పడ్డాడు చిత్రవర్ణుడు.‘‘ప్రయోజనం లేని పని చేయడం వల్ల లాభం ఏముంది మహారాజా? అలాగే ప్రయోజనం లేని యుద్ధం ఇప్పుడు అవసరం లేదు. దయచేసి యుద్ధం మాటే తలపెట్టకండి. ఆ ఆలోచనే మానుకోండి. వివేచన లేకుండా కోపంతో రెచ్చిపోతే నష్టం ఇంతా అంతా కాదు. కోపంతో ప్రేమగా పెంచిన ముంగిసను చంపుకున్న బ్రాహ్మణుని కథ తెలిసిందే కదా, అయినా మరొకసారి చెబుతాను, వినండి.’’ అన్నాడు మంత్రి. చెప్పసాగాడిలా.

‘‘పూర్వం గౌడదేశంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. సంతానం కోసం భార్యతో పాటుగా అతను చేయని పూజలేదు. నోచని నోము లేదు. తిరగని క్షేత్రం లేదు. ఆఖరికి చేసిన పూజలూ, నోచిన నోములూ ఫలించాయి. వాళ్ళకో కొడుకు పుట్టాడు. లేక లేక కలిగిన కొడుకుని అతి గారాబంగా పెంచుకోసాగారిద్దరూ.ఒకరోజు, పాలుపట్టి, నిద్రపుచ్చి, ఉయ్యాలలో ఉన్న బాబుని జాగ్రత్తగా చూస్తూండమని చెప్పి, పక్క వీధికి, పుట్టింటికి వెళ్ళింది భార్య. అక్కడ వదినగారేదో వ్రతం చేస్తున్నారు. ముత్తయిదువుగా రమ్మన్నారామెను. వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే ఇటు రాజభవనం నుంచి దేవశర్మకు కబురొచ్చింది. సంభావన స్వీకరించమని రాజుగారు కబురంపారు. ఇరకాటంలో పడ్డాడు దేవశర్మ. భార్యకోసం ఆగుదామంటే ఆ వ్రతం ఎప్పటికి అవుతుందో ఏమో! సాయంత్రం వరకు సాగినా ఆశ్చర్యపోనక్కరలేదు. సంభావన వదులుకుందామంటే వదులుకోలేడు.

రాజ సంభావన. పెద్ద మొత్తంలోనే ఇస్తారు. అయినాసరే వదులుకుందామంటే, రాజాజ్ఞను ధిక్కరించినట్టవుతుంది. రాజుగారికి కోపం వస్తుంది. అసలుకే మోసం వస్తుంది ఎలా?ఆలోచనలో పడ్డాడు దేవశర్మ.సంభావనకు రాజు దగ్గరకు వెళ్ళక తప్పదనుకుంటే, ఉయ్యాలలోని పిల్లాడికి కాపలా ఎవరుంటారు?దేవశర్మకు ఏదీ అంతుచిక్కకుండా పోయింది. అప్పుడు అతని ముందు నుంచీ పరిగెత్తుకుని వెళ్తూ కనిపించింది పెంపుడు జంతువు ముంగిస. దాంతో సమస్యకు పరిష్కారం దొరికినట్టయిందతనికి.

ముంగిసను పిలిచాడు. పిల్లాడికి కాపలాగా ఉండమని చెప్పి, రాజభవనానికి పరిగెత్తాడు.సంభావన కోసం చేతులు జాచినప్పుడు కూడా పిల్లాడిని గురించిన ధ్యాసే! అక్కడ వాడెలా ఉన్నాడో? ఏ ఆపద పొంచి ఉందో? ముంగిస సరిగా కాపలా కాస్తోందో లేదోనని తెగ ఆలోచనలు పోయాడు దేవశర్మ. అతని ఆలోచనలకు తగ్గట్టుగానే ఇక్కడ పిల్లాడికి ఆపద ఎదురయింది. ఇంటి పైకప్పు మీద నుంచి ఓ త్రాచుపాము జారిపడింది. పిల్లాడి ఉయ్యాల వైపు పాకుతూ రాసాగింది. ముంగిస దానిని చూసింది. మీద పడింది. ముక్కలు ముక్కలుగా కొరికి పారేసింది. చంపేసింది దాన్ని. గండాన్ని గట్టెక్కించింది.సంభావన తీసుకుని దేవశర్మ ఇంటి దారి పట్టాడు. పరుగు పరుగున ఇంటికి వచ్చాడు. యజమాని వస్తున్నాడని తెలుసుకుని ఆనందంగా అతనికి ఎదురెళ్ళింది ముంగిస. అప్పడది ఎలా ఉందంటే పాముని కొరికి కొరికి చంపడంతో దాని రక్తం, మూతి నిండా, ఒంటి నిండా పడి ఉండడంతో చూసేందుకు అనేక అనుమానాలకు తావిచ్చేట్టుగా ఉంది.

రకరకాలుగా కీడుని శంకిస్తూ భయపడుతూ వచ్చిన దేవశర్మకు ముంగిస అలా రక్తంతో గుమ్మంలో కనిపించడంతో మతి పోయింది.ముందు పిల్లాణ్ణి ముంగిస గాయపరిచి ఉంటుందనుకున్నాడు దేవశర్మ. అంతలోనే చంపేసి ఉంటుందనుకున్నాడు. చెప్పలేనంత బాధ కలిగింది. కోపం వచ్చిందతనికి. దగ్గరలో ఉన్న కర్ర అందుకున్నాడు. దాంతో ముంగిసను కొట్టి కొట్టి చంపేశాడు. తర్వాత లోపలికి వెళ్ళి చూశాడు. పిల్లాడు ఉయ్యాలలో హాయిగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే ముక్కలు ముక్కలుగా ఉన్న త్రాచుపాము కనిపించింది. అంతా అర్థమయిందప్పుడు. తన తొందరపాటుకి చింతించాడు. నెత్తీ నోరూ కొట్టుకుని రోదించాడు. కోపంలో ఎంత పాపానికి నెట్టుకున్నానంటూ ముంగిసను కొట్టిన కర్రతోనే తనని తాను కొట్టుకుని హింసించుకున్నాడు దేవశర్మ.దాని వల్ల వచ్చే లాభం ఏమయినా ఉందా మహారాజా? కోపంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంతే! ఇలాగే ఉంటాయి. నష్టాన్నే కాదు, చెప్పలేనంత కష్టాన్ని కూడా కలిగిస్తాయి. అందుకే తొందర కూడదంటారు. అన్నీ బాగా ఆలోచించే కార్యరంగంలోకి దూకాలంటారు.’’ అని కథ ముగించాడు దూరదర్శి. ఒక రకంగా రాజు చిత్రవర్ణుని జాగ్రత్తంటూ హెచ్చరించాడతను.

Responsive Footer with Logo and Social Media