మదర్ థెరిసా
1. మొగ్గనుండి పువ్వు
మదర్ అసలు పేరు ఏగ్నెస్. ఆమె పూర్తిపేరు ఏగ్నెస్ గోంజా బోజాక్తు. కాని ఇప్పుడు ఆమెని అందరూ మదర్ థెరిసా అంటారు. కొందరు ఆమెని టెరెసా అంటారు. 'టెరెసా” అనేవాళ్ళు అంటారు, కానీ సరైన ఉచ్చారణ ' టెరిజ్నా.' ఆమె తల్లి ఆమెను ఏగ్నెస్ అనే పిలిచేది. గోంజా అని అన్న పిలిచేవాడు.
అన్న ఆమెకిచ్చిన గోంజా అనే పేరుకి మొగ్గ అని అర్ధం. అంటే తామర మొగ్గ అన్నట్టు, ఒక పూల మొగ్గ అన్నమాట. ఏగ్నెస్ పూవులాగ వికసించి మదర్ ధెరిసా అయింది. బీదవాళ్ళలోని అతి బీదవాళ్ళకు కూడా ఆమె అమ్మగా మారింది. ఆకలి, జబ్బులూ, తోడూనీడా లేకపోవటం, ముసలితనంలో వీటి బాధలకి లోనై, వీధుల్లో పడి ఉండేవాళ్ళ అవసరాలు తీర్చటానికి ఆమె నడుం కట్టింది. అప్పట్నుంచీ దిక్కూమొక్కూలేని పసివాళ్ళ దగ్గర్నుంచి ముసలివాళ్ళు వరకూ, అందరికీ ఆమె “అమ్మ” అయింది.
తల్లి తన పిల్లల్ని పెంచి పెద్దచేసి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు నేర్పుతుంది. మదర్ థెరిసా అనాధలైన పిల్లలకే కాదు, దిక్కులేని ముసలివాళ్ళకు కూడా సేవచేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసింది.
మదర్ ఈపని మొట్టమొదట కలకత్తాలో మొదలు పెట్టింది. తరవాత భారత దేశంలోని మిగతా ఊళ్ళల్లో కూడా తన సేవనీ, మమతనీ విస్త రింపజేసింది. ఆతరవాత ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా తన సేవాకార్య క్రమాన్ని ప్రారంభించింది.
స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయాలకి దూరంగా ఉంటూ పేదవారికి సేవచేస్తూ, దేశసేవ చేసేవారిలో మదర్ థెరిసా స్థానం మొదటిది. బీదవారికి సేవ చేయటంద్వారా, తాను దేవుడికి సేవచేస్తున్నానని ఆమె అనేది. ఈ రకంగా దేవునికి సేవచేయటం ఆమె జీవితంలోని ముఖ్యమైన ఉద్దేశం.
పాలన పేరుతో ప్రజల్ని పీడించే దేశాల్లో డబ్బున్నవాళ్ళు కొద్దిమందే ఉంటారు. మిగతా వారంతా పేదలే. ఆదేశాల్లో ముప్టివాళ్ళని చెత్తకుండీల కింద చూస్తారు. చెరుకుని పీల్చాక దాని పిప్పి బయట కొచ్చినట్టుగా, ముష్టివాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళ బాధల్ని పోగొట్టాలని ఎవరూ ప్రయత్నించరు. వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతునే ఉంటుంది. దీని వల్ల దేశంలో దొంగతనాలూ, బందిపోటుతనాలూ, దారి దోపిడీలు పెరిగిపోతాయి. కానీ ఈ ముష్టివాళ్ళకి తిండీ, బట్టా, ఉండటానికి ఇల్లు ఇచ్చి వాళ్ళని 'సంఘసేవలో పెడితే, దేశంలో జరిగే అపరాధాలనీ, అపరాధులనీ చాలావరకు ఆపవచ్చు. దీనివల్ల అందరికీ మేలు కలుగుతుంది. మదర్ థెరిసా బతికున్నన్నాళ్ళూ అందరికీ మేలు కలిగే పనులే చేపట్టింది.
తను బీదగా ఉండికూడా బీదవారికి సహాయం చేయవచ్చన్న విషయాన్ని మదర్ తన సేవాభావంతో చేసి చూపించింది. లొరెటోలో ఉన్న సదుపాయాలన్నీ వదిలేసి కేవలం 5 రూపాయలతో ఆమె వీధిలో కొచ్చింది. చనిపోయేవరకూ ఆమెదగ్గర తనదని చెప్పుకోటానికి మూడు చీరలు తప్ప ఏమీ లేవు. కాని ఆమె చేసిన పనులు పెరిగి, పెరిగి ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. అమ్మని ఇంకెవ్వరితోనూ పోల్చలేం. ఎందుకంటే పిల్లల్ని తల్లిలాగ ప్రేమించగల వాళ్ళెవరూ ఉండరు. కాని అందరూ అమ్మల్లోకీ గొప్పది మదర్ థెరిసా. సాధారణంగా అమ్మతన పిల్లల్ని మట్టుకే జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ మదర్ థెరిసా అలాకాదు. ప్రపంచమంతటా వీధుల్లో తిరిగే అనాధ పిల్లల్ని ఆమె సమానంగా ప్రేమించింది. అందుకే ఆమె అందరి అమ్మలకన్నా గొప్పదయింది.
రాజకీయనాయకులూ, ఆటగాళ్ళూ, సినిమా వాళ్ళూ అందరికీ తెలుసు. వీళ్ళందరితోబాటు జనం అందరికీ తెలిసిన ఇంకోపేరు మదర్ థెరిసాదే ! మనదేశంలో పుట్టకపోయినా ఆమె మనదేశంలోని మనుషులందరి కన్నా గొప్పది. ఆమె ఒక మొగ్గగా విదేశంలో పుట్టింది. కాని మన దేశం మట్టిలో ఆమె కమలంలా విరిసింది. ఆమె మనదేశంలోని పువ్వుల్లో అన్నిటికన్నా అందమైనది. అందరికన్నా మంచి అమ్మ !