మేకపిల్లా-కుక్కపిల్లా



నది ఒడ్డున నిద్రపోతున్న తాబేలుని చూసింది నక్క. ఆహారం దొరికిందని సంబరపడింది. పరుగున వచ్చ్దింది. తాబేలు మీద కాలుంచింది. అదిమి పట్టింది. తాబేలు తప్పించుకోవాలి. ఆ ప్రయత్నంలోనే తనని, నీటిలో ఉంచి, నానబెట్టమంది తాబేలు. అలాగే చేసింది నక్క. రెండు గంటలయింది. అయినా తాబేలు మెత్తబడలేదు. చిరాకు కలిగింది నక్కకి. ఇలా అంది.‘ఏంటిది? నానితే మెత్తబడతానన్నావు. రెండు గంటలుగా నానబెట్టినా మెత్తబడవేఁ’‘నువ్వు తప్పు చేస్తూ నన్ను అంటావేఁ?’ అంది తాబేలు.‘నేనేఁ తప్పు చేశాను?’‘నా మీద కాలు పెట్టి,అదిమి నిల్చున్నావు. నీరు నాకెక్కడ తగులుతూందని? ఓసారి కాలు తీసి చూడు, కాసేపటికే మెత్తబడతాను.’ అంది తాబేలు.‘అలాగా’ అంటూ ఆలోచనలో పడింది నక్క. తప్పదు. కాలు తీసి, చూడాల్సిందే అనుకుంది. తీసింది. నక్క తన మీద నుంచి కాలు తీయడమేమిటి, మరుక్షణంలో నీటిలో ఈదుకుంటూ పారిపోయి, తన ప్రాణాన్ని కాపాడుకుంది తాబేలు.’’ కథలు చెప్పడం ముగించాడు ముసలి దొంగ.

‘‘ఏ పనయినా చక్కబెట్టాలంటే ముందు మోసం చేయడం తెలుసుకోవాలి. బ్రాహ్మణుని దగ్గర్నుంచి ఆ మేకను దొంగిలించడం పెద్ద సమస్య కాదు. తేలిగ్గా దొంగిలించవచ్చు. అయితే మీరంతా నాకో చిన్న సాయం చెయ్యాలి.’’ అన్నాడు అంతలోనే మళ్ళీ.‘‘చెప్పు, ఏం చెయ్యమంటావు?’’ అడిగారు దొంగలు.‘‘ఏం లేదు, మీరంతా ఆ బ్రాహ్మణుడు వెళ్ళే దారిలో అక్కడక్కడా కాపు వెయ్యండి. పావు మైలుకొకడు నిల్చునుండి, ఆ బ్రాహ్మణుడు మీ దగ్గరకు రాగానే ఒకటడగండి.’’‘‘ఏఁవడగమంటావు?’’‘‘ఏంటయ్యా ఇది! నల్ల కుక్కపిల్లనేంటి తాడుగట్టి లాక్కెళ్తున్నావు? అని అడగండి. చాలు! మిగిలింది నేను చూసుకుంటాను.’’ అన్నాడు ముసలిదొంగ.‘సరే’నన్నారు దొంగలు. ముసలిదొంగ చెప్పినట్టుగానే అక్కడక్కడా బ్రాహ్మణుడు వచ్చే దారిలో నిల్చున్నారు. మేకతో పాటుగా రాసాగాడు బ్రాహ్మణుడు. దగ్గరకు రాగానే అతన్ని పలకరించాడో దొంగ.‘‘ఏంటయ్యా ఇది! నల్ల కుక్కపిల్లను తాడుగట్టి లాక్కెళ్తున్నావు? చూడబోతే మళ్ళీ బ్రాహ్మణుడివి’’ అన్నాడు.వెనక్కి తిరిగి మేకను చూశాడు బ్రాహ్మణుడు. తర్వాత దొంగకేసి చూశాడు. కోపంగా చూశాడు.‘‘పొద్దున పొద్దునే తాగావా?’’ అడిగాడు.‘‘అది కాదు బాపనయ్యా...’’ అని ఏదో చెప్పబోయాడు దొంగ.‘‘మాట్లాడకు’’ హెచ్చరించాడు బ్రాహ్మణుడు.

‘‘యజ్ఞానికని శ్రేష్ఠమయిన నల్లమేకను తీసుకుని వెళ్తోంటే, కుక్కంటా వేంటి? తాగుబోతులే ఇలా మాట్లాడతారు. తప్పుకో’’ అన్నాడు బ్రాహ్మణుడు. దొంగను చేత్తో దూరంగా నెట్టి, ముందుకు నడిచాడతను. కొద్దిదూరం నడిచాడో లేదో ఇంకో దొంగ, పలకరించాడు బ్రాహ్మణుణ్ణి.‘‘ఏంటయ్యా పంతులూ నువ్వు చేస్తోన్న పని? వేద వేదాలు చదువుకున్నవాడివి, కుక్కను ముట్టుకుంటేనే మహాపాపమనే కుటుంబంలో పుట్టి, ఓ నల్ల కుక్కపిల్లను లాక్కెళ్తున్నావేంటి? ఏంటయ్యా నీకీ దరిద్రం?’’ఇద్దరు బాటసారులు ఒకే విధంగా అడగడంతో బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. మేకపిల్లే! అనుమానం లేదు అనుకున్నాడు. కోపంగా దొంగను చూసి, ముందుకు నడిచాడు. వాడికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేకపోయిందతనికి. కొద్దిదూరం నడిచి ముందుకెళ్ళాడో లేదో మరో దొంగ ఎదురయ్యాడు. అడిగాడిలా.

‘‘ఛీఛీ! నల్లకుక్కపిల్లనేంటయ్యా పట్టుకెళ్తున్నావు? ఎవరయినా చూస్తారన్న భయం కూడా లేకుండా, ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని? బ్రాహ్మణ పుట్టుక పుట్టలేదయ్యా నువ్వు? ఆచారాలన్నీ మంటగలుపుతున్నావు కదయ్యా! అయ్యయ్యో’’ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అడిగేసరికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. కుక్కపిల్ల! కళ్ళు నులుముకుని చూశాడు. మేకపిల్ల! బ్రతికాననుకున్నాడు. ఎదురుగా ఉన్న దొంగని ఎగాదిగా చూసి గబగబా కదిలాడక్కణ్ణుంచి.కొద్ది దూరం నడిచాడు. అక్కడ ఇద్దరు దొంగలు ఎదురయ్యారు, బ్రాహ్మణుడికి. సాటి దొంగతోముసలిదొంగ ఇలా అన్నాడు.‘‘చూశావా చూశావా! కలికాలం కాకపోతే సద్ర్బాహ్మణుడు అయి ఉండి, కుక్కపిల్లను పట్టుకెళ్ళడం యేంటి చెప్పు?’’‘‘కుక్కపిల్లా’’ అడిగాడు బ్రాహ్మణుడు.

‘‘కాకపోతే, మేకపిల్లా? నిన్నూ, నీ అమాయకత్వం చూసి, సంతలో ఎవడో నీకు టోకరా చేశాడు. నల్లకుక్క పిల్లని, మేకపిల్లని చెప్పి అమ్మేశాడు. మేకపిల్లనుకునే ఇంటికి పట్టుకెళ్తున్నావు. ఊరికి చేరుకుంటే పరువులు పోతాయి. నిన్ను అగ్రహారంలోంచి వెలివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.’’ అన్నాడు ముసలిదొంగ.వెనక్కి తిరిగి చూశాడు బ్రాహ్మణుడు. కుక్కపిల్లే! కళ్ళు నులుముకుని చూశాడు. కుక్కపిల్లే! అనుమానం లేదనుకున్నాడు. ‘ఛిఛీ’ అనుకున్నాడు. మేకపిల్లను వదిలేశాడు. దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి,తడిగుడ్డలతో గాయత్రి మంత్రం జపిస్తూ వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. వెళ్ళిపోతున్న బ్రాహ్మణుని వెనుక దొంగలంతా నవ్వుకున్నారు. తర్వాత మేకపిల్లను తీసుకుని, ఎంచక్కా వండుకుని తినేశారు.’’ ముగించాడు మేఘవర్ణుడు.‘‘మనల్ని నమ్మిన వాళ్ళనూ, అమాయకుల్నీ ఇట్టే మోసం చెయ్యొచ్చు. నేనలాగే చేశాను. నన్ను నమ్మిన హిరణ్యగర్భుణ్ణి మోసం చేశాను. మోసం చేసే మనం గెలుపొందాం. లేకపోతే బలవంతుడూ, బుద్ధిమంతుడూ, సమర్థుడూ అయిన హిరణ్యగర్భుణ్ణి గెలవడం మన వల్ల కాదు. అతని మంత్రి సర్వజ్ఞుడు కూడా గొప్పవాడు. రాజుకి తగిన మంత్రి.’’ అన్నాడు మేఘవర్ణుడు మళ్ళీ.‘‘శత్రువు దగ్గర కాసేపే మనం ఉండగలం. ఎక్కువ సేపు ఉండలేం. ఎక్కువ సేపు ఉండడం ఎవరి వల్లా కాదు. అలాంటిది నువ్వు రోజులకి రోజులే ఉండగలిగావక్కడ. ఎలా ఉండగలిగావు?’’ మేఘవర్ణుణ్ణి అడిగాడు చిత్రవర్ణుడు.‘‘అవసరం మహారాజా! కార్యార్థి అయిన వాడు ఎన్ని కష్టాలొచ్చినా శత్రువుని నెత్తిన పెట్టుకుని మోసి తీరాలి. పని అయిన తర్వాతంటారా,శత్రువుని వదిలేద్దామా, చంపుదామా అన్నది మన ఇష్టం. దీనికి సంబంధించి ఓ కథ ఉంది. పాము-కప్పలు అని. వింటానంటే చెబుతాను.’’ అన్నాడు మేఘవర్ణుడు.

‘‘బలేవాడివే! ఎందుకు వినం. చెప్పు చెప్పు’’ అన్నాడు చిత్రవర్ణుడు. చెప్పసాగాడిలా మేఘవర్ణుడు.‘‘కాంచీపురం సమీపాన ఓ ముసలి పాములరాజు ఉండేవాడు. అతని పేరు మందవిషుడు. ఆహారం కోసం మందవిషుడు తిరుగుతూ తిరుగుతూ ఓ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. చెరువు నిండా కప్పలు కనిపించాయతనికి. ఓహో! బలే ఆహారం! తిన్నవాడికి తిన్నంత అనుకున్నాడు. అనుకుని పథకం వేశాడు. ఆ పథకం ప్రకారం చెరువు గట్టున జబ్బుతో బాధపడుతోన్న వాడిలా మూలుగుతూ పడుకున్నాడు. ఆ మూలుగుకి పాము దగ్గరకి ఓ కప్పలరాజు వచ్చాడు.అతని పేరు జలపాదుడు.

‘ఏమయింది? ఎందుకు మూలుగుతున్నావు?’ అడిగాడు.జవాబు లేదు మందవిషుడు దగ్గర్నుంచి. మూలుగుతూనే ఉన్నాడింకా.‘తలచుకుంటే ఒక్క కాటుతో ఎవరినయినా చంపగల బలవంతుడివి. ఎందుకు పస్తుంటున్నావు? ఇన్ని కప్పలు ఇక్కడున్నా తినడానికి ప్రయత్నించట్లేదెందుకు?. ఏమయింది నీకు?’ మళ్ళీ అడిగాడు జలపాదుడు.అప్పుడిలా నోరు విప్పింది పాము.‘అంతా నా కర్మ. నేనెప్పుడూ ఎవర్నీ ఏదీ అడుక్కోలేదు. ఇన్నాళ్ళకీ అవస్థ వచ్చి పడింది. మీలాంటి వాళ్ళు దయతలచి, తినమని ఏదయినా పెడితే తప్పా, నాకిక దిక్కులేదు. పస్తులే గతి.’’‘అయ్యయ్యో! ఏమయింది?’‘‘నిన్నరాత్రి పొరపాటున ఓ బ్రాహ్మణ కుమారుణ్ణి కాటేశాను. కొడుకుని వైద్యుని దగ్గరకు తీసుకుని వె ళ్ళి, బ్రాహ్మణుడు బ్రతికించుకున్నాడు. అయినా నన్ను శపించాడు.’’‘ఏమని శపించాడు?’‘నీ ఆహారం అయిన కప్పలను తల మీద మోస్తూ నువ్వు తిరగాలి. అలా తిరిగితేనే నీకు ఆహారం దొరుకుతుంది అన్నాడు.

అందువల్లే నేనిక్కిడకి వచ్చాను. దయచేసి, మిమ్మల్ని తల మీద పెట్టుకుని మోసే భాగ్యాన్ని నాకు కలిగించండి. నాకింత తిండి దొరికేలా చూడండి.’ బ్రతిమలాడాడు.పాము పడగెక్కి కప్పలు ఊరేగడమంటే గొప్పనిపించింది జలపాదుడికి. ముందుగా తనని ఊరేగిస్తే బాగుణ్ణనిపించింది.‘మరి నన్ను ఊరేగిస్తావా?’ అడిగాడు.‘ఎందుకు ఊరేగించను. రా’ అంది పాము. తన పడగ మీద జలపాదుణ్ణి ఎక్కించుకుంది. కొంత దూరం మోసి, తిప్పింది.

తర్వాత అలసిపోయినట్టుగా ఆయాసపడుతూ తల వేలాడేసింది. కప్ప సంతోషం నీరుగారిపోయింది. తప్పనిసరయి కిందికి దిగిపోవాల్సి వచ్చింది దానికి.‘తిండి లేదు కదా, నీరసం. శరీరంలో బలం లేదు, మిమ్మల్ని ఎలా మోయగలను చెప్పు?’ బాధపడింది పాము.పడగెక్కి ఒకసారి తిరగ్గానే జలపాదుడికి ఏదో సాధించిన సంబరం కలిగింది. పడగెక్కి ఎప్పుడూ ఊరేగుతుంటే ఆ ఆనందమే ఆనందం అనుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు పాముతో.‘నీకు ఆకలి వేసినప్పుడల్లా ఈ చెరువులో కప్పల్ని నీ కడుపు నిండా తిను. నా అనుమతి కూడా నీకు అక్కరలేదు. తిన్న తర్వాత మాత్రం నన్ను నీ పడగ మీదికి ఎక్కించుకుని తిప్పాలి. ఏమంటావు?’‘గొప్ప వరాన్ని ప్రసాదించావు. చాలు! నా జన్మకిది చాలు.’ అంది పాము. జలపాదుడు చూస్తూండగానే చెరువులోని కప్పల్ని కడుపు నిండా తింది. తర్వాత వచ్చి, పడగ మీద జలపాదుణ్ణి ఎక్కించుకుని ఊరేగించింది.

Responsive Footer with Logo and Social Media