మాట్లాడే గుహ
ఒక అడవిలోని గుహలో నక్క నివసిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే అది ఆహారపు వేటలో బయలుదేరింది. ఇంతలో ఆకలితో ఉన్న ఒక సింహం ఆవైపు వచ్చి గుహను చూసింది. “ఉదయం నుండి చూస్తున్నా, నాకు ఆహారం దొరకకుండా, ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు, నేను ఆకలితో పడిపోయేటట్టు ఉన్నాను. ఈ గుహలో ఏదైనా జంతువు ఉంటే తింటాను” అని సింహం భావించి గుహలోకి వెళ్ళింది.
కొద్దిసేపటికి నక్క తన నివాసమైన గుహ వద్దకు వచ్చి సింహం అడుగు జాడలను గుర్తించింది. “ఈ అడుగుజాడలను బట్టి నాకు అపకారం చేసే శత్రువులు ఈ గుహలో ప్రవేశించినట్లున్నారు. ఇప్పుడు నేను గుహలోకి వెళితే ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించాలి” అని మనసులో అనుకుంది నక్క. కొద్దిసేపు ఆలోచించిన తరువాత నక్కకు ఒక మంచి ఉపాయం తట్టింది. ఉపాయం ప్రకారం గుహతో మాట్లాడసాగింది.
“ఓ గుహ! ఈరోజు మౌనంగా ఉన్నావెందుకు. నేను ప్రతిరోజు రాగానే మాట్లాడేదానివి కదా? ఈరోజు నీకు ఏమైంది?” అని గుహను ప్రశ్నించింది నక్క. నక్క మాట్లాడుతున్నదేమిటో సింహానికి అర్థం కాలేదు. “గుహలు ఎక్కడైనా మాట్లాడతాయా? అయినా నేను మాట్లాడకపోతే నక్క గుహలోపలికి రాదు. నోటి వద్దకు వచ్చిన ఆహారం దూరమౌతుంది. తెలివిగా వ్యవహరించాలి” అని భావించింది సింహం.
ఇంతలో నక్క తిరిగి ఏదో మాట్లాడింది. అందుకు సింహం బదులిస్తూ “అదేంకాదు మిత్రమా! నీకంటే నాకు ఎక్కువ ఎవరు? గుహలోపలికిరా?” అని సింహం అన్నది. సింహం మాటలు విన్న నక్క గుహలోపల తనకు హాని చేసే వారుఉన్నారని తెలుసుకుంది. లోపలికి వెళితే ఆ క్రూరమృగానికి తాను బలికాక తప్పదని భావించిన నక్క, వెనుతిరగకుండా పరుగులుతీసి సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలను రక్షించుకుంది. అడవికి రాజును అనుకున్న సింహం సైతం తన తెలివి తక్కువతనంతో నోటి వద్దకు వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకుంది. నక్క తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది.
నీతి కథలు : మనం ఏదైనా ప్రమాదా స్థితిలో ఉన్నప్పుడు కంగారు పడకుండా, తెలివిగా ఆలోచించి ఆ ప్రమాదం నుండి మనకు మనం రక్షించుకోవాలి.