మతిమరుపు అల్లుడు



ఒక ఊరిలో ఒకతను ఉండేవాడు. అతనికి మతిమరుపు ఎక్కువ. ఒకసారి అత్తవారింటికి వెళ్ళాడు. అల్లుడు వచ్చినందుకు అత్త చాలా సంతోషపడి అతనికి పూరీలు చేసి పెట్టింది. అవి చాలా రుచిగా ఉండడంతో అల్లుడు పది పదిహేను తిన్నాడు. తన భార్య చేత కూడా అవి తయారు చేయించాలనుకున్నాడు. ఐతే ఇంతకుముందెప్పుడూ అతడు వాటిని తినలేదు.

అల్లుడు అత్తతో “అత్తా! ఇవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక మీ కూతురుని చేయమని అడుగుతాను. వీటి పేరేమిటో చెప్పు” అని అడిగాడు. అందుకు అత్త “వీటిని పూరీలు అంటారు.” అని చెప్పింది. తనకు మతిమరుపు కాబట్టి ఎక్కడ మరిచిపోతానో అనుకుని అల్లుడు “పూరీలు” అనుకుంటూ దారివెంట నడవసాగాడు. అలా చాలా దూరం నడిచాడు. అతను ఎందుకలా అంటున్నాడో అర్థంకాక వింతగా చూసారు దారిలోని జనం.

కొంతదూరం వెళ్ళాక ఒక కాలువ అడ్డం వచ్చింది. అప్పటిదాకా అల్లుడు “పూరీలు” అనుకుంటూనే ఉన్నాడు. ఐతే కాలువ ఇక మీదట దూకుతూ “అద్దిరబన్నా!” అన్నాడు. అలా ఇవతలికి రాగానే పూరీల పేరు మరిచిపోయి “అద్దిరబన్నా, అద్దిరబన్నా” అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.

ఇంటికి వెళ్ళగానే భార్యను పిలిచి "ఇవాళ మీ అమ్మ నాకు అద్దిరబన్నాలు చేసి పెట్టింది. చాలా బాగున్నాయవి. నువ్వు కూడా వెంటనే అవి తయారు చెయ్యి” అన్నాడు. అందుకు అతని భార్య వింతగా "అద్దిరబన్నాలు ఏమిటీ? అలాంటి వంటకం గురించి నేనెప్పుడూ వినలేదు. నేను చేయలేను” అంది. దాంతో అల్లునికి కోపం వచ్చింది. “మర్యాదగా అద్దిరబన్నాలు చేయలేదంటే బాగుండదు మరి” అని బెదిరించాడు. దానికి భార్య “మీరేమైన చెప్పండి అద్దిరబన్నాలు నేను చేయలేను” అంది. అల్లునికి బాగా కోపం వచ్చింది. భార్యను ఆ చెంపా ఈ చెంపా వాయించాడు. ఆమె లబోదిబోమని అరవడం మొదలుపెట్టింది. చుట్టుప్రక్కల మహిళలు ఏం జరిగిందోనని పరుగెత్తుకుంటూ వచ్చారు. అల్లుడిని కొట్టవద్దని వారించారు. వారిలో ఒకావిడ “నీకేం పోయేకాలం వచ్చిందయ్యా. అమ్మాయిని గొడ్డును బాదినట్లు బాదావు. బుగ్గలు చూడు పూరీల్లా ఎలా పొంగి పోయాయో” అంది.

ఆ మాటలు వినగానే అల్లుడు ఆనందంగా “ఆఁ అవును అవే! అవే! పూరీలు, పూరీలు” అని అరవసాగాడు. కాసేపటికి అందరికీ విషయం అర్థమయ్యింది. అంతా కలిపి అల్లుని మతిమరుపుకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

Responsive Footer with Logo and Social Media