మతి మరుపు
సూర్యోదయంతోనే చెరువుకు స్నానానికి పోతున్న సూరయ్య అనే ఆయన్ని అతడి పొరుగూరి, దూరపు బంధువైన సోమయ్య దారిలో కలుసుకుని "ఈ మాట నిజమేనా? మీ ఇంట్లో ఆ మధ్య వరుసగా మూడుసార్లు దొంగలుపడి దోచుకున్నారట!" అని అడిగాడు.
"ఆ మాట నిజమే!" అన్నాడు సూరయ్య విచారంగా.. "మరి అలుమార అంతదాన్ని దొంగలు బ్రద్దలు కొడుతున్నప్పుడు నీకు మెలకువ రాలేదా? అని అడిగాడు సోమయ్య .
"ఎక్కడి మెలకువ! దొంగలు నా తలగడ క్రిందనుండి భోషాణం తాళపుచెవులు తీసుకుని చప్పుడు కాకుండా తలుపులు తెరిచి దోచుకెళ్ళారు" అన్నాడు సూరయ్య ప్రతీసారి తాళపు చెవుల్ని తలగడ క్రింద దాచటానికి బదులు మరెక్కడైనా దాయొచ్చ కదా!" అని అడిగాడు సోమయ్య.
"అదీ చేశాను!" అన్నాడు సూరయ్య నిట్టూరుస్తూ "ఎక్కడ దాచావేమిటి?" అన్నాడు సోమయ్య. "ఎప్పటిలాగ తలగడ క్రిందకాకుండా, వాటిని అటకమీద దాచాను" అన్నాడు సూరయ్య "అయితే దొంగలకు ఆ తాళం చెవులెలా దొరికాయి?" అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా "నా మతిమరుపు కొంపముంచింది! దాచిన తాళం చెవుల్ని మర్చిపోతానేమో అన్న అనుమానంతో ఒక చీటీమీద అలుమార తాళం చెవులు అటక మీద వున్నవి. అని వ్రాసి, ఆ చీటీని తలగడ క్రింద పెట్టుకుని పడుకున్నాను" అని జవాబిచ్చాడు సూరయ్య దానితో వరసగా అన్నిసార్లు దొంగతనం ఎలా జరిగిందో సోమయ్యకి అర్థమైంది.