మంచితనం
తన కూతురి పెళ్లికి అవసరమైన పదివేల వరహాలు తన అన్నగారైన రాము వద్ద అప్పు తీసుకుని ఇంటిదారి పట్టాడు సోము.
మధ్యదార్లో కొంత అడవి మార్గం: బందిపోటు దొంగల భయం. అయినా తోడెవరూ దొరక్కపోవడంతో ఒంటరిగానే బయల్దేరాడు.
అకస్మాత్తుగా అతడు భయపడిందంతా జరిగింది. అడవి మధ్యకి రాగానే దొంగలు చుట్టుముట్టి మర్యాదగా నీ దగ్గరున్న డబ్బు మొత్తం ఇటివ్వు అన్నారు.
వెంటనే సోము పదివేల వరహాల మూటవిప్పి వారిముందు పెట్టాడు "అయ్యా! ఆడపిల్ల కన్యాదానం విడిపించడానికి అప్పుగా తీసుకెళ్తున్నాను. వీటిని కొల్లగొట్టి ఆ పెళ్ళి పాడు చేసేటంత దుర్మార్గులు కాదనుకుంటాను మీరు మీకూ ఆడపిల్లలున్నారు కదా..! కాదంటారా. ఈ డబ్బు తీసుకుని నన్ను చంపేయండి ఆ తర్వాత నా కూతురి జీవితం ఏమైనా నేను చూడబోను" అన్నాడు విరక్తిగా.
వాళ్లమీద సోము మాటలు బాగా పనిచేశాయి కనీసం ఒక్కడితోనైనా నుంచివారు అన్పించుకోవాలని సరేవెళ్ళు ఆడపిల్ల పెళ్లి చెడగొట్టేంత దుర్మార్గులం కాదు. ఈ వంద వరహాలు కూడా పట్టుకెళ్ళి అన్నల బహుమతి అని చెల్లాయికివ్వు " అని వంద వరహాలు ఇచ్చారు.
తన లౌక్యం పనిచేసినందుకు సంతోషపడుతూ సోము వారిచ్చిన వరహాలు కూడా తీసుకుని ఊరు దారి పట్టాడు.
మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది.