మానవత్వం
ఒకసారి ఓ వ్యక్తి అడవిలో ప్రయాణిస్తున్నాడు. దార్లో ముగ్గురు దొంగలు అతడిమీద పడి, అతడి వద్ద వున్నవన్నీ దోచుకున్నారు. దొంగల్లో ఒకతను ఇలా అన్నాడు వీడ్ని ప్రాణాలతో వదిలేయడం మంచిదికాదు. రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అందకే వీడ్ని చంపేస్తే అని బాటసారిని చాకుతో పొడవ బోయాడు.
రెండవ దొంగ అతడ్ని ఆపాడు. మన పని దోచుకోవడమే కానీ చంపడం కాదు. అనవసరంగా వీడ్ని చంపిన పాపం మనకెందుకు? గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగిస్తారని భయపడి అందరిని చంపుతూ పోవడమేనా మన పని ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఈ అడవినుండి బయటపడేలోగా వీడు మనల్నిపట్టించుకోకుండా వుంటే చాలు అందుకని వీడి కాళ్లు, చేతులు కట్టిపడేద్దాం అన్నాడు. మొదటిదొంగ సరేనన్నాడు. ఇద్దరూ కలిసి అతడిని కట్టి పడేశారు.
మూడవ దొంగకు అదికూడా నచ్చలేదు. మిగిలిన ఇద్దరితో కలిసి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. బాటసారిని చూచి "అయ్యో..! నిన్నెంతగా హింసించాము. సరే.. నీ కట్లు విప్పేస్తాను.. నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్ళిపోవచ్చు" అని కట్లు విప్పాడు అంతటితో ఆగకుండా ఈ అడవిలో ఇంకా దొంగలుండవచ్చు. నీ వద్ద దోచుకునేటందుకు ఏమీ లేవు ఆ కోపంలో నిన్ను చంపినా చంపవచ్చు. అందుకని జనం తిరిగే రహదారికి వెళ్ళేవరకూ నేనూ నీతోనే వస్తాను. పదా. బయల్దేరు అన్నాడు
బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కొంతసేపటికి రహదారి చేరుకున్నారు. అప్పుడు బాటసారి దొంగతో అన్నాడు. "అయ్యా! మీరెంతో మంచివారిలా గున్నారు. మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను.
దయచేసి నా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్లండి" అంటూ ప్రాధేయపడి బలవంతంగా తనింటికి తీసుకెళ్ళాడు. దొంగ పాపం భోజనం చేస్తుండగా బాటసారి వెనకనుండి ఓ దుడ్డు కర్రతో తలమీద గట్టిగా బాదాడు. దొంగ తలపట్టుకుని "అబ్బా" అని క్రిందపడిపోగానే ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి.
దానవుల్లో మానవత్వం వున్నట్లే మానవుల్లో కూడా బాటసారిలాంటి దానవులు కూడా వుంటారు .