కుంతి మంత్రాన్ని పఠించుట



కుంతి మంత్రముల యొక్క బలాబలముల గురించి ఆలోచిస్తూ దుర్వాసుని మంత్రాన్ని పరీక్షించ దలచుకుంది. మేడపై తన శయ్యపై శయనించి తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుని చూసింది. వికసించిన పద్మంలా ప్రకాశిస్తున్న సూర్య భగవానుని చూసి ఆమెలో అనురాగం కలిగింది. కుతూహలంతో మంత్రంను పఠించి సూర్యదేవుడిని ఆహ్వానించింది. సూర్యుడు యోగ శక్తితో తనను రెండుగా చేసుకుని ఒక శరీరంతో గగనంలో తపిస్తూ వుండి రెండవ శరీరంతో మానవ రూపంలో కుంతి ముందు సాక్షాత్కరించి "కుమారీ! మంత్ర బలంచే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ వశంలోకి వచ్చాను. నేనేమి చేయాలో చెప్పు. నీ మనసుకు ప్రియమైంది చేస్తాను" అని అన్నాడు.

కుంతీ దేవి" ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు. ఏదో కుతూహలంచేత మంత్రం జపించాను. మీరు వెళ్ళండి" అన్నది. సూర్యుడు " కుంతీ! నేను తప్పక వెళతాను నీ మనస్సులో ఏమి కోరుకున్నావో చెప్పు. నా మాదిరి కవచకుండలాలతో ఉన్న తేజశ్శాలి అయిన కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు. నీ కోరిక నేను నెరవేర్చక తప్పదు. నేను మంత్రానికి బద్దుడను. నీవు నీ శరీరాన్ని సమర్పించుకో. నీవు కోరినట్లు తేజశ్శాలి అయిన కుమారుని ఇస్తాను.నీతో సంగమించి నా దారిన నేను పోతాను. నీవు నన్ను మంత్రాలతో ఆవాహనం చేశావు.

నీవు అంగీకరించని ఎడల నీ తల్లితండ్రులను దహించి వేస్తాను. అదియును కాక నీ శీలవృత్త నియమాలను ఎరుగక నీకు మంత్రం ఉపదేశించిన దుర్వాసుని దహిస్తాను. నీకు దివ్యదృష్టిని ప్రసాదించాను గదా! ఆ ద్రుష్టి తోనే నన్ను చూడ గలుగుతున్నావు. అలా చూడు మహేంద్రాది దేవతలంతా నన్ను చూసి నవ్వుతున్నారు " అని సూర్యుడు కోపంతో అన్నాడు. కుంతీ దేవి" అయ్యా! నన్ను నీకు సమర్పించుటకు నా తల్లి తండ్రులు సమ్మతించాలి. కాని నాకు నేను ఎలా అంగీకరించ గలను. నేను కేవలం బాల్య చాపల్యంచే మంత్ర మహిమను పరీక్షింప కోరి ఇలా చేసాను. నన్ను క్షమించు" అని బ్రతిమాలింది. కాని సూర్యుడు ఒప్పుకోలేదు. కుంతి శాపానికి భయపడుతూ పరిపరి విధములగా ఆలోచిస్తూన్నది. ఒక వైపు శాప భయం మరొక వైపు బంధువులను గూర్చిన భయం. తన

తెలివి తక్కువ తనానికి దుఃఖిచింది. చివరకు కుంతి సూర్యునితో " మహానుభావా! కన్యకు పెద్దల సమక్షంలో వివాహం జరిగిన తరువాత ఆమె తనభర్తను చేరవచ్చును. వివాహ పూర్వం ఇలా పర పురుషునితో చేరుట అధర్మం. ఈ విధంగా నన్ను అధర్మానికి పాల్పడ మనడం ధర్మమా! నీకు తెలియని ధర్మం ఏమున్నది. తల్లితండ్రుల అనుమతి లేకుండా నిన్ను చేరుట ధర్మమని నీకు తోచిన అట్లనే కానిమ్ము అందువలన వచ్చు అపనిందను నేనే భరిస్తాను " అన్నది. సూర్యుడు ఆమెను చూసి " కుమారీ! నీ తండ్రి గాని, తల్లిగాని, ఇతర గురువులు కానీ దీనిని అపలేరు నీ తల్లి తండ్రులు నీకు కన్యాదానం చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలివి. ఇది నీ అంతరంగిక విషయం. కన్య తనకుగా తన కోరికలను తీర్చుకోవడం అపరాధం కాదు. ఇది అధర్మం అయితే నేను ఎందుకు ప్రోత్సహిస్తాను. దీని వలన నీకు ఎలాంటి నింద రాదు. నీవు నాతో సమాగమించిన నీ కన్యాత్వానికి ఎలాంటి భంగం కలుగదు.

నా వలన నీకు కవచ కుండలాలతో కూడిని మహాతేజశ్శాలి అయిన కుమారుడు జన్మిస్తాడు " అని కుంతీదేవిని అంగీకరింపచేసాడు. తరువాత సూర్యుడు యోగరూపంతో కుంతిని స్పృశించగా ఆమె ఆ శయ్యపై స్పృహకోల్పోయినట్లు పడిపోయింది. కుంతి యొక్క కన్యాత్వమునకు భంగం కలగ కుండా సూర్యుడు యోగ శక్తి ద్వారా కుంతి నాభి ద్వారా ఆమె లోనికి ప్రవేశించి వీర్యస్థాపన చేసాడు. ఆమె కన్యాభావం కలుషితం కాలేదు. అప్పుడు కుంతి చైతన్యాన్ని పొంది లేచింది.

ఆమె దాల్చిన గర్భం దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది. కుంతీ దేవి గర్భందాల్చిన విషయం ఆమెకు ఒక దాదికి మాత్రమే తెలియును. బంధువుల భయం వల్ల కుంతి గర్భాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎప్పుడూ అంతఃపురంలోనే గడుపుతూ వచ్చింది. కొంతకాలానికి సూర్యదేవుడి అనుగ్రహం వలన ఓ రాత్రి వేళ కుంతీ దేవి ఒక కుమారుని ప్రసవించింది. ఆ కుమారునికి సహజ కవచ కుండలములు, పొడవైన చేతులు, దృఢమైన శరీరం ఉన్నాయి.

లోకోపవాదానికి భయపడి కుంతీ దేవి దాది సహాయంతో ఒక పెట్టెలోపల చక్కగా పక్క పరచి, నీరు లోపలి పోకుండా మైనాన్ని పూసి, సుఖాస్పదంగా తయారు చేసి, ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి, సున్నితమైన మూతను బిగించి ఏడుస్తూ "బిడ్డా! జలచర, భూచర, గగనచర, దివ్య ప్రాణులద్వారా నీకు శుభం కలుగుగాక! వరుణుడు నీటిలో నిన్ను కాపాడు గాక! వాయుదేవుడు నిన్ను సురక్షిత స్థానానికి చేర్చు గాక! దివ్య విధానంతో నిన్ను నాకిచ్చిన నీ తండ్రి సూర్య దేవుడు నిన్ను సర్వత్రా కాపాడుగాక! నీవు ఎక్కడున్నా నీ సహజ కవచ కుండలముల కారణంగా నేను నిన్ను గుర్తించగలను. నిన్ను పుత్రునిగా పొందబోవు నీ తల్లి ధన్యురాలు నీవు దప్పికతో ఆ తల్లి స్థనాన్నే గ్రోలుతావు" అంటూ పలురీతుల దీనంగా విలపిస్తూ, బిడ్డను పదేపదే ముద్దిడుకుంటూ ఆ పెట్టెను తన భవనం పక్కనే ప్రవహిస్తున్న అశ్వనదిలో వదిలి వేసింది.