కుందేలుకు గర్వభంగం
ఒక అడవిలో కుందేలు, తాబేలు నివసిస్తున్నాయి. తాబేలు అక్కడే ఉన్న చెరువులో నివసిస్తుంటే, కుందేలు దాని ఒడ్డునే ఉండేది. దాహం తీర్చుకోవడానికి కుందేలు ఆ చెరువులోకి వచ్చేది. ఆ సమయంలో తాబేలు నడకను చూసి కుందేలు వెక్కిరించేది. కుందేలు శరవేగంతో పరుగులు తీసేది, తాబేలు మెల్లిగా నడిచేది. ఇది చూసి కుందేలు ఎప్పుడూ హేళనగా మాట్లాడింది. తనలా ఎవరూ పరుగులు తీయలేరని, తానే ఎంతో గొప్పదాన్నని కుందేలు గర్వపడేది.
ఒకరోజు కుందేలు తాబేలు వద్దకు వెళ్ళింది. “మిత్రమా! మనిద్దరం పరుగుపందాలు పెట్టుకుందామా? నాతో నువ్వు పరుగు పందెంలో గెలవలేవు” అంటూ కుందేలు సవాలు విసిరింది. అందుకు తాబేలు అంగీకరించింది. సమీపాన ఉన్న కొండ వరకు పరుగెత్తాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాయి. పరుగు పందెం మొదలయ్యింది. ఈ వింతను చూడటానికి అడవిలోని జంతువులన్నీ వచ్చాయి. “సరిగా నడవలేని తాబేలు, శరవేగంతో పరుగులు తీసే కుందేలుకు పరుగు పందెం ఏమిటి?” అని వింతగా చెప్పుకున్నారు. పరుగు పందెం మొదలైంది, కుందేలు దూసుకుని వెళ్ళసాగింది. తాబేలు మెల్లిగా నడవసాగింది. కుందేలు చాలా దూరం పరుగెత్తి వెనక్కు తిరిగి చూసింది.
కనుచూపుమేరలో తాబేలు కనపడలేదు. “ఈ తాబేలు నాతో పోటీ పడి ఎప్పటికి నెగ్గేను?” అనుకున్నది. అక్కడ కుందేలుకు కొన్ని ఫలాలు కనపడినాయి, కుందేలు వాటిని ఆరగించింది. ఈ తాబేలు ఇప్పట్లో రాదులే అని భావించిన కుందేలు చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. మెల్లిగా అది నిద్రలోకి జారుకుని హాయిగా నిద్ర పోయింది.
తాబేలు మెల్లిగా నడచుకుంటూ తన గమ్యాన్ని చేరింది. నిద్ర నుండి మేల్కొన్న కుందేలు ఎంతో వేగంగా పరుగెత్తి తాము అనుకున్న గమ్యస్థానానికి చేరింది. పరుగు పోటీలలో విజేతగా నిలిచినందుకు తాబేలును అడవిలోని జంతువులన్నీ అభినందించాయి. తనకంటే ముందుగానే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి కుందేలు సిగ్గుపడింది. బద్దకంతోపాటు గర్వం ఉండటం వల్లనే పరుగు పోటీలలో కుందేలు అపజయం పాలైంది. నడుచుకుంటూ వెళ్ళిన తాబేలు విజయం సాధించింది. కుందేలుకు గర్వభంగం జరిగింది.
నీతి కథలు : నేనే గొప్ప అనుకోవడం అవివేకమే అవుతుంది.