కుందేలు- కోతులు



అనగనగా కర్పూరద్వీపం. ఆ ద్వీపంలో ఓ సరస్సు ఉంది. దాని పేరు పద్మకేళి. ఆ పద్మకేళిలో హిరణ్యగర్భుడు అనే హంస ఉంది. ఆ హంసే అక్కడి పక్షులన్నిటికీ రాజు. హిరణ్యగర్భుడు బుద్ధిమంతుడనీ, సజ్జనుడనీ చెప్పకుంటారంతా. ఒకరోజు హిరణ్యగర్భుడు దగ్గరకి ఓ కొంగ వచ్చింది. దాని పేరు దీర్ఘముఖుడు. ఈ కొంగ చాలా నెలలుగా అక్కడ లేదు. ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ రావడం ఇదే! దీర్ఘముఖుణ్ణి చూస్తూనే ఆనందంగాపలకరించాడు హిరణ్యగర్భుడు.‘‘క్షేమమేనా దీర్ఘముఖా’’ అడిగాడు.‘‘మీ ప్రజలుగా మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘నిన్ను చూసి చాలా రోజులయిందయ్యా! ఎక్కడికెళ్ళావు ఇన్నాళ్ళూ. విశేషాలేమిటి?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘విశేషం ఒకటే! నన్ను చూశారుగా, ఎలా చిక్కిపోయానో, అదే విశేషం. ఉన్న వూరినీ కన్నత ల్లినీ వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘అయితే విశేషాలేమీ లేవంటావు?’’‘‘లేకపోవడమేమి? ఉన్నాయి. కాని అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. సేదదీరి, బలం తెచ్చుకుని చెబుతానన్నీ. కాకపోతే చిన్న పొరపాటు చేశాను. ఏం జరిగిందంటే...’’ చెప్పసాగాడు దీర్ఘముఖుడు.‘‘జంబూద్వీపంలో వింధ్యపర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీద ఓ నెమలి ఉంది. దాని పేరు చిత్రవర్ణుడు. ఆ చిత్రవర్ణుడే అక్కడి పక్షులకు రాజు. పెద్దపెద్ద చెట్లూ, సెలయేళ్ళూ ఓయమ్మో, పర్వతం మీద పెద్ద అడవే ఉంది. ఆ అడవిలో నన్ను చూశాయి పక్షులు.

కొత్తగా కనిపించానేమో! ‘ఎవరు నువ్వు? ఏ దేశం నీది? ఇక్కడికి ఎందుకొచ్చావు? మీ రాజు ఎవరు?’ అంటూ ఒకటే గోల చేశాయి. చెప్పాలి కదా, మీ గురించి గట్టిగానే చెప్పాను. నా గురించి కూడా తప్పనిసరై చెప్పుకున్నాను.నా పేర దీర్ఘముఖడు అన్నాను. పద్మకేళి నుండి వచ్చానన్నాను. మా రాజు హిరణ్యగర్భుడు అని చెప్పి, మా రాజు గొప్ప పుణ్యాత్ముడన్నాను. దేశదేశాలు చూడాలని బయల్దేరాను. చూస్తూ ఇక్కడ వాలాను. మీరూ, మీ దేశం బాగుంది. ఈ రోజు మీతో గడిపి, రేపు వెళ్ళిపోతాను. మీకు అభ్యంతరం అయితే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాను.‘అతిథుల రాకపోకల మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి. బలేవారే, ఉండండి.’ అన్నాయి పక్షులు. బాగా ఆదరించాయి. ప్రేమగా అడవిలోని వింతలూ-విశేషాలూ చూపించాయి. అప్పుడే చిత్రవర్ణుణ్ణి కలిశాను. అయిందా, ఆ తర్వాత అక్కడి పక్షులు నన్నిలా అడిగాయి.‘మీకు మీ రాజ్యం బాగుందా? మా రాజ్యం బాగుందా?’‘మీ రాజు గొప్పవాడా? మా రాజు గొప్పవాడా?’‘కాకామాటలు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. నిజం చెప్పండి’అప్పుడిక చెప్పక తప్పలేదు. చెప్పానిలా.

‘మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు. బావిలో కప్పలు కూడా మీలాగే ఉంటాయి. మా రాజ్యానికీ మీ రాజ్యానికీ పోలికా? కుదరదు. మా రాజ్యం ఏనుగయితే, మీ రాజ్యం దోమ. ఏనుగుకీ, దోమకీ పోలిక కుదురుతుందా? మీరే చెప్పండి. మా దేశం అద్భుతం. అందంగా ఉంటుంది. మీది? కీకారణ్యం. చూడ్డానికే చిరాకు పుడుతోంది. మా రాజు ఇంద్రుడు. ఇంద్రవైభవం మా రాజుది. ఏది తిన్నా రాజాలా తింటాడు. మీది అడవి కదా, మీరూ మీ రాజూ కాయలూ దుంపలూ తింటూ బతకాలి. మీరసలు చెప్పుకోదగిన పక్షులే కాదు, కాకిమూకలు మీరు. మీకో రాజు. నెమలిరాజుని పట్టుకుని మీరు

వేలాడ్డం. ఛఛ! బాగాలేదు. అయినా తప్పు మీది కాదు, మిమ్మల్నలాపుట్టించాడు భగవంతుడు అన్నాను.’’‘‘అంతంత మాటలంటుంటే వింటూ ఊరుకున్నాయవీ?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఊరుకున్నాయి కాబట్టే రెచ్చిపోయాను. తర్వాత ఇంకా వినండి, ఏవన్నానో.’’‘‘ఏవన్నావు?’’‘‘ఎంతయినా సాటి జీవాలు కాబట్టి, సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం కోరి మీకో మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిజంగా మీరు బాగుపడదలచుకుంటే, ఇంతకంటే అద్భుతంగా బతకదలచుకుంటే స్వర్గంలాంటి మా దేశానికి పారిపోదాం, రండి. రేప్పొద్దున నేను బయల్దేరుతాను కదా, అప్పుడు నాతో పాటు వచ్చేయండి. ఇంకో ఆలోచన పెట్టుకోకండి. పదండి, పోదాం అన్నాను’’‘‘వస్తామన్నాయా?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.

‘‘అలా అంటే కథే లేదు. వస్తామనలేదు. పైగా మిమ్మల్నీ, మన రాజ్యాన్నీ పొగిడి, వాళ్ళ రాజునీ, రాజ్యాన్నీ తెగిడినందుకు కోపం తెచ్చుకున్నాయి. తెచ్చుకుని, నన్నూ, మిమ్మల్నీ అనరాని మాటలన్నాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి. అవి చెప్పడానికి నోరు రావడం లేదు.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘అనవసరంగా నన్నెందుకు ఇరికించావయ్యా ఇందులో’’ బాధపడ్డాడు హిరణ్యగర్భుడు.‘‘ఇరికించడం ఏముంది మహారాజా! రాజభక్తి అది. నా చేత రాజభక్తే అలా మాట్లాడించింది. అయినా ఊరూ పేరూ లేనివాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి? పిచ్చిప్రజ! వాళ్ళ బుద్ధే బయటపడింది. బుద్ధిలేని వారికి బుద్ధి చెప్పకూడదు. చెబితే మనకే ప్రమాదం. సలహా చెప్పినా, మంచి చెప్పినా, బుద్ధి చెప్పినా తెలివైనవారికే చెప్పాలి. మంచివారికే చెప్పాలి. అంతేకాని, తెలివితక్కువ వారికీ, బుద్ధిహీనులకీ చెప్పకూడదు. చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాం.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘ఏంటా కుందేలు కథ?’’ అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడిలా దీర్ఘముఖుడు.

‘‘అనగనగా ఓ పర్వతం. దాని పేరు మాల్యవంతం. దాని మీదో అడవి. ఆ అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులున్నాయి. ఆ కోతులకోసారి దాహం వేసింది. దాహంతో అల్లాడిపోయాయి. నీళ్ళ కోసం పరుగులు పెట్టాయి. ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు. పైగా ఎండమావుల్ని నమ్ముకుని తిరిగి తిరిగి అలసిపోయాయి. ప్రాణాలు పోతున్నట్టనిపించి, మరి తిరగలేక అన్నీ ఓ మర్రిచెట్టు కింద కూలబడ్డాయి. వాటిలో పెద్దది కొండముచ్చు బాధపడుతూ ఇలా అంది.‘తప్పు చేశాం. పొర్లుతున్నట్టుగా నీరు కనిపిస్తూంటే పరిగెత్తుకుని వచ్చాం. తీరా చూస్తే నీరెక్కడా కనిపించలేదు. ఎక్కడి వాళ్ళం ఎక్కడికొచ్చాం! సుమారుగా ఏడెనిమిది మైళ్ళ దూరం పరిగెత్తుకొచ్చాం. ఎండకి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. దాహానికి నాలుక పిడచకట్టుకుపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కాకుండా ఉంది.’ఆ మాటలు మర్రిచెట్టు తొర్రలో ఉన్న కుందేలు వింది. పాపం అని కోతులు మీద జాలి పడింది. తొర్రలోంచి బయటికొచ్చి ఇలా అంది.

‘పిచ్చికోతుల్లారా, పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా, దానికి పరిగెత్తుకుని వచ్చారా? ఏమంటారో తెలుసా వాటిని? ఎండమావులంటారు. ఎండమావుల్లో నీరుండదు. ఉన్నట్టు కనిపిస్తుందంతే! పరుగెత్తి అలిసిపోవడం మీదే తప్పు.’అంత అలుపులోనూ కోతులికి కోపం వచ్చింది. కుందేలుని ఎర్రగా చూశాయి. పట్టించుకోలేదది కుందేలు. ఉపకారానికి పోయింది.

‘ఇప్పుడు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే అదిగో, అక్కడ వాలులో ఓ చెరువు ఉంది. అక్కడిపోయి దాహం తీర్చుకోండి.’ అంది. మంచిమాట చెప్పాననుకుంది. గుంపుగా పరుగుదీస్తాయనుకుంది. అయితే ఏదీ కదల్లేదు. తనని కొరకొరా చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు. అదలా చూస్తూండగానే వెనుక నుంచి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుందో కోతి.‘ఎంత ధైర్యమే నీకు, మమ్మల్ని పిచ్చికోతులంటావా? ఎండమావుల్లో నీరుంటుందా? అని ఎగతాళి చేస్తావా? చూడు నిన్నేం చేస్తానో’ అంది.

వద్దు వద్దని బతిమలాడుకుంటున్నా కుందేల్ని నేలకేసి కొట్టి కొట్టి చంపింది.‘చచ్చింది వదిలేయ్‌’ అంది కొండముచ్చు. కోపం చల్లారిని కోతులు చెరువు వేపు పరుగుదీశాయి. అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి. ఎంచక్కా వచ్చిన వైపునకు నడకసాగించాయి.’’ కథ ముగించాడు దీర్ఘముఖుడు.‘‘మంచికథే’’ మెచ్చుకున్నాడు హిరణ్యగర్భుడు.‘‘ఇందులో నీతి గ్రహించారా మహారాజా, పొరపాటున కూడా మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు. అవునంటారా? కాదంటారా?’’‘‘కాదని ఎందుకంటాను. అవుననే అంటాను.’’ అన్నాడు హిరణ్యగర్భుడు.

Responsive Footer with Logo and Social Media