కుందేలు - ఏనుగు



‘‘పక్షుల మీద తిరగబడ్డానన్నావు. ఎదురుదాడి చేశానన్నావు. తర్వాతేం జరిగింది?’’ అడిగాడు హిరణ్యగర్భుడు.‘‘ఏం జరిగిందంటే...తలచుకుంటేనే బాధగా ఉంది. ‘కృతఘ్నడా! తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతావా? మా దేశం వచ్చి, మా రాజునే తిడతావా? మమ్మల్ని ఏమనుకున్నావు? ఎవరనుకున్నావు మమ్మల్ని? మేం చిత్రవర్ణుడి సైనికులం. నిన్ను చీల్చి చెండాడుతాం.’ అన్నాయి పక్షులు. అన్నట్టుగానే మీద పడి ముక్కులతో పొడిచాయి. తప్పించుకుందామంటే వీలుకాలేదు. గాయాలపాలై నిల్చున్నాను. అప్పుడన్నాయి ఇలా.‘హంస రాజేమిటి? మెత్తదనానికి మారుపేరు హంస. దానికెవరు భయపడతారు? రాజంటే భయపడాలి. భయం లేదంటే, రాజు మాట వినేదెవరు? మాట విననప్పుడు, పరిపాలన ఎలా సాధ్యం?’ అన్నాయి. అవునవును అనుకున్నాను నేను. అంతలోనే ఇలా అన్నాయి.‘రాజన్నవాడు ఒకప్పుడు శాంతంగా, మృదువుగా ఉండాలి. మరొకప్పుడు కరకుగా క్రూరంగా ఉండాలి. హంసకి ఇవేవీ తెలియవు. తెలియనప్పుడు రాజ్యపాలన ఏ విధంగా ఏడుస్తుందో అందరికీ తెలిసిందే! నిలబడితే పెద్ద పళ్ళ చెట్టు కింద నిలబడాలి. పళ్ళయినా దొరుకుతాయి. లేదంటే నీడయినా దొరుకుతుంది. అలాగే బలవంతుడయిన రాజుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే ప్రాణాలు నిలబడతాయి. పదవులు లభిస్తాయి. బలహీనుణ్ణి నమ్ముకుంటే ఏం ఉంటుంది? బతుక్కోసం బలహీనుడయిన రాజుని నమ్ముకుని, అతన్ని సేవించే కంటే ఆకులూ అలమూ తింటూ అడవిలో పడి ఉండడం మేలు. రాజన్న వాడు, మనకి కష్టం కలిగితే, తీర్చగలగాలి. నష్టం కలిగితే పూడ్చగలగాలి. అంతేకాని, ప్రజల్ని పట్టించుకోని రాజు ఒక రాజా? అలాంటి రాజు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే!’ అన్నాయి. నిజమేననిపించింది.

‘తెలివితక్కువ రాజులు ఎంతమంది ఉండి ఏం లాభం? తెలివయిన రాజు ఒక్కడుంటే చాలు. వెనకటికి ఏనుగుని మోసం చేసి కుందేళ్ళు కులాసాగా ఎలా బతికాయో తెలుసా? కథగా చెబుతాం, విను.’ అన్నాయి. వినసాగాను.‘పెద్ద అడవి. ఆ అడవికి తగినట్టుగానే ఏనుగులు ఉన్నాయక్కడ. చలి, ఎండా, వానా కాలాలు మూడూ ముచ్చటగా జరుగుతున్న కాలం ఇబ్బందులు లేకపోయాయి. ఒక ఏడాది వానలు పడలేదు. చెట్టూ చేమా అన్నీ ఎండిపోయాయి. అడవిలో కొలను కూడా ఎండిపోయింది. తినడానికి తిండి లేదు, దాహం తీర్చుకునేందుకు నీరు లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు ఏనుగులకి. రాజుని ఆశ్రయించాయి.‘రాజా! అడవిలో కొలను ఎండిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. ఏం చెయ్యాలో అంతుచిక్కట్లేదు. నువ్వే కాపాడాలి.’ మొరపెట్టుకున్నాయి.ఆలోచనలో పడ్డాడు రాజు.‘అన్నిటికీ నువ్వే దిక్కు. నువ్వే గట్టెక్కించాలి మమ్మల్ని.’ మోకరిల్లాయి.‘ఓ పని చేద్దాం’ అన్నాడు రాజు.

సేవకుణ్ణి ఒకణ్ణి పిలిచి, చుట్టు పక్కల ప్రాంతాల్లో నీరున్న చెరువు ఎక్కడున్నదీ చూసి రమ్మన్నాడు. చూసొచ్చాడు సేవకుడు. కొద్ది దూరంలో పెద్ద చెరువు ఉన్నదనీ, అందులో నీరు ఉన్నదనీ చెప్పాడు. ఇంకేం ఉంది? వెళ్ళి హాయిగా నీరు తాగి రండన్నాడు రాజు. ఏనుగులు పరుగున వెళ్ళాయక్కడికి. చెరువులో నీరు తాగడమే కాదు, ఎంచక్కా స్నానాలు కూడా చేశాయి. ఏనుగులు పరుగున రావడం, చెరువులో గుంపుగా దిగడం, సరదాగా స్నానాలు చేసే హడావుడిలో చుట్టుపక్కల ఉన్న కుందేళ్ళు భయపడి పరుగులంకించుకున్నాయి. ఆ పరుగులాటలో కొన్ని కుందేళ్ళు ఏనుగుల కాళ్ళ కింద పడి నలిగిపోతే, కొన్ని పాపం చచ్చిపోయాయి. చచ్చిపోయిన కుందేళ్ళను చూసి మంత్రి రోమకర్ణుడు బాధపడ్డాడు. రాజు శిలీముఖుణ్ణి కలిశాడు.‘అనుకోని ఆపద వచ్చి పడింది మహారాజా! మన చెరువు మీదికి, మన మీదికి ఏనుగులు దాడి చేయడం హర్షించరానిది. వందలాది కుందేళ్ళు గాయాలపాలయ్యాయి. పదుల సంఖ్యలో పాపం! చచ్చిపోయాయి. ఈ ఏనుగుల్ని అడ్డుకోవాలి. ఈ దాడిని నిలుపు చెయ్యాలి. ఆలోచించండి మహారాజా! మంచి ఆలోచన చేసి, మన కుందేళ్ళను కాపాడండి.’ అన్నాడు.

రోమకర్ణునితో పాటుగా మంత్రులందర్నీ సమావేశపరిచాడు శిలీముఖుడు. చెప్పాడిలా.‘అక్కడ ఆ అడవిలో కొలను ఎండిపోవడం కాదుగాని, ఏనుగులు నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి. పరుగులు దీస్తున్నాయి. ఆ పరుగుల్లో మన కుందేళ్ళు నలిగిపోతున్నాయి. చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. దీన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటే బాగుంటుందో చెప్పండి. లేకపోతే ఏదేని ఉపాయాన్ని ఆలోచించండి. ఆ ఉపాయంతో ఏనుగుల్ని తరిమేయాలి.’బలహీనమయిన కుందేళ్ళు, బలవంతులయిన ఏనుగుల్ని ఎదుర్కోవడమా? వాటిని తరిమేయడమా? అదెలా సాధ్యం? ముఖముఖాలు చూసుకున్నాయి కుందేళ్ళు. మాటలు లేవు. మౌనం వహించాయి.‘ఏంటి, అలా మవునంగా కూర్చుంటే ఎలా? చెప్పండి, ఏం చేద్దాం?’ రెట్టించాడు శిలీముఖుడు. అప్పుడు ఓ ముసలి కుందేలు ముందుకొచ్చింది. దాని పేరు విజయుడు

.‘మహారాజా! ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను, నాకు అప్పగించండి. ఇదేం పెద్ద పని కాదు. బలంతో ఎదుర్కోలేనప్పుడు, తెలివితేటలతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మనదే’ అన్నాడు విజయుడు.‘అయితే ఎదుర్కో! ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే’ అన్నాడు శిలీముఖుడు.‘ఆజ్ఞ’ అన్నాడు విజయుడు. అక్కణ్ణుంచి బయల్దేరాడు. చెరువు దగ్గరకి చేరుకున్నాడు. అక్కడో కొండ ఉంది. ఆ కొండనెక్కి కూర్చున్నాడు. వేళయింది. దాహం తీర్చుకునేందుకు ఏనుగులు రావాలి. రానీ చెబుతాను అనుకున్నాడు. అనుకున్నంతనే ఏనుగులు వచ్చాయి. చెరువులో నీరు తాగి, స్నానాలాడి వెళ్ళిపోతోంటే కేకేశాడు విజయుడు.‘ఇదిగో’ అన్నాడు. వెనక్కి తిరిగి చూశాయి ఏనుగులు.‘ఏనుగుల రాజా, నీకో చిన్నమాట’ అన్నాడు విజయుడు.‘ఎవరు నువ్వు. నాకు నువ్వేం చెబుతావు? అసలేంటి సంగతి’ అడిగాడు ఏనుగుల రాజు. కొండ మీది కుందేలుని తక్కువ చేస్తూ చూశాడు.‘నేను మామూలు కుందేల్ని కాదు. ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా మీకు. ఆ చంద్రుడిలో కొలువుండే కుందేల్ని. మా రాజు ఆ చంద్రుడే! ఆ రాజుదూతగా చెబుతున్నాను, వినండి. ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది. ఈ చెరువులో నీళ్ళు తాగాలన్నా, ఇందులో స్నానం చెయ్యాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి. తీసుకోలేదు మీరు. పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ, స్నానాలాడుతూ మా కుందే ళ్ళని తొక్కి చంపేస్తున్నారు.

అది తప్పు. ఇలా చెబుతున్నానని, పిచ్చికూతలని నా మాటలు కొట్టి పారేయకండి. మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కణ్ణుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడూ ఇటు రాకండి. ఇన్నాళ్ళూ జరిగిందేదో జరిగింది. వచ్చారు, చెరువు నీరు తాగారు, వెళ్ళారు. అయిపోయింది. దీన్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించేదేమిటి? మా సంగతి నీకు తెలీదంటారా, మా రాజు సంగతి మీకు తెలీదు. ఆయనకి మీరు చేసిందంతా తెలుసు. తెలిసే నన్ను హెచ్చరించి రమ్మన్నాడు. వినలేదూ, ఫలితాన్ని అనుభవిస్తారు. ఒకొక్కర్నీ తోక పట్టి విసిరేస్తాడు. ఛస్తారు మీరు దాంతో భయపడ్డాయి ఏనుగులు. తొండాల్ని ముడిచేశాయి. రాజు ఏనుగు వెనుక దాగున్నాయి కొన్ని. అంతా గమనించాడు విజయుడు. మళ్ళీ ఇలా అన్నాడు.‘మీకోసమే చెబుతున్నాను. చాలా కోపంగా ఉన్నాడు చంద్రుడు. ఎందుకయినా మంచిది, ఏనుగులరాజువి నువ్వే కదా, నువ్వోసారి మా రాజుకి కనిపించి, క్షమించమని అడుగు. గొడవ ఉండదు.’‘అడగండి మహారాజా, అడగండి’ ముక్తకంఠంతో చెప్పాయి ఏనుగులు. బాగా భయపడిపోయాయవి. నక్కలతోనూ, కుక్కలతోనూ గొడవలంటే పర్వాలేదు. కాళ్ళ కింద తొక్కి తొక్కి చంపేయొచ్చు. తొండాలతో విసిరేయొచ్చు వాటిని. దైవస్వరూపులు సూర్యచంద్రులు. వారితో గొడలుపడితే అంతే సంగతులు అనుకున్నాయి.‘విజయా! తప్పయిపోయింది. తెలియక చేసిన అపరాధం ఇది. ఇంకెప్పుడూ ఈ చెరువు దగ్గరకి రాము. రామని మాటిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పు.’ అన్నాయి ఏనుగులు.

‘చెబుతాను. చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతాడు. అనుమానం లేదు. అయితే ఇప్పడాయన దగ్గరలో లేడు. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలీదు. అప్పుడప్పడూ ఈ చెరువు దగ్గరకి వస్తాడు. మూడొంతులు ఈ రాత్రి రావచ్చు. వచ్చినప్పుడు చెబుతాను. మీరేం కంగారు పడకండి.’ అన్నాడు విజయుడు.‘వెళ్ళొస్తాం’ అని ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఆలోచించి, మళ్ళీ కేకేసింది కుందేలు. ఆగాయి ఏనుగులు. ఏమిటని అడిగాయి.‘మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదు, మీ రాజు, మా రాజుకి చెప్పడం బాగుంటుంది. పద్ధతి కూడా. అప్పుడు ఎలాంటి గొడవలుండవు. అందుకని...’‘ఆఁ! అందుకని...’ అడిగాడు ఏనుగుల రాజు.

‘ఈ సాయంత్రం చీకటి పడుతూండగానే ఈ చెరువు దగ్గరకి నువ్వోసారి రా! మా రాజుని కలిసి, క్షమించమను. హాయిగా ఉందామందరం.’‘వస్తాడొస్తాడు’ అరిచాయి ఏనుగులు. రాజుని చంద్రుని కలవాల్సిందిగా చెప్పకనే చెప్పాయి.‘సరే’ నన్నాడు ఏనుగుల రాజు. వస్తానన్నాడు. అన్నట్టుగానే చీకటిపడుతూండగానే చెరువు దగ్గరకి వచ్చాడు.‘ఎక్కడ మీ రాజు?’ అడిగాడు.‘అడిగో’ అంటూ చెరువులో కదులుతున్న చంద్రబింబాన్ని చూపించాడు విజయుడు. చీకటి ఇంకా చిక్కబడలేదు. దాంతో చంద్రుడు ఎర్రెర్రగా కనిపించాడు. ఏనుగుల రాజు చంద్రుడు ఎర్రగా ఉండడాన్ని చూసి, ఎందుకలా ఉన్నాడన్నట్టుగా విజయుణ్ణి చూశాడు. చెబుతానుండు అన్నట్టుగా సైగ చేసి, ఏనుగుతో ఇలా అంది కుందేలు.

Responsive Footer with Logo and Social Media