కుందేలు, పావురము మరియు పిల్లి
ఒక అడవిలో కుందేలు నివాసముంటుంది. ఒకసారి కుందేలు కొంతకాలం సుదూర ప్రాంతానికి వెళ్ళింది. ఆ సమయంలో ఒక పావురం దాని నివాసాన్ని ఆక్రమించుకుంది. సుదూర ప్రాంతానికి వెళ్ళిన కుందేలు కొద్ది రోజుల తరువాత తిరిగి వచ్చి, పావురం తన నివాసాన్ని ఆక్రమించుకోవడం చూసింది. “ఇది నా నివాసాన్ని నువ్వు ఆక్రమించుకోవడం సరికాదు. నేను ఎంతో శ్రమతో ఈ నివాసాన్ని నిర్మించుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో” అన్నది కుందేలు. “ఈ అరణ్యంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. ఇదేదో నీ సొంత స్థలం అన్నట్లు కేకలు వేస్తున్నావు. నువ్వు చాలా కాలంగా ఇక్కడ నివాసం లేవు, కాబట్టి ఈ నివాసంపై నువ్వు హక్కును కోల్పోయావు. నువ్వే వేరొకచోటికి నీ నివాసాన్ని మార్చుకో” అని పావురం చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. “ఎవరినైనా న్యాయం అడుగుదాము” అన్నది కుందేలు. “సరే పద” అన్నది పావురం.
ఇద్దరూ కలసి వెళుతుండగా, దారిలో ఒక చెట్టు క్రింద జపమాలతో తపస్సు చేసుకున్నట్లు నటిస్తూ, ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఒక వృద్ధ పిల్లి కనిపించింది. ఆహారం కోసం పరుగులు తీయలేక వృద్ధాప్యంలో ఈ వేషం వేసుకుని తనవైపు వచ్చిన అమాయకపు అల్పప్రాణుల్ని చంపి తినడానికి ఆ పిల్లి అలవాటు పడింది. ఈ విషయం తెలియక కుందేలు, పావురం తీర్పు చెప్పమని దారిలో కనిపించిన పిల్లి వద్దకు వెళ్ళాయి. పిల్లిని చూడగానే కుందేలుకు భయం వేసింది. “ఈ పిల్లిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మనం దాన్ని సమీపిస్తే ప్రాణహాని కలుగుతుందని భయంగా ఉంది” అన్నది కుందేలు. “అంత భయంగా ఉంటే నేను ఉన్నచోటు ఖాళీచేయమని అడగకు, నీ దారి నువ్వు చూసుకో, ఏ సమస్యా ఉండదు” అన్నది పావురం.
“అదెలా కుదురుతుంది, అది నా నివాసం, జరగాల్సింది జరుగుతుంది. పిల్లివద్దకే వెళ్దాము” అన్నది కుందేలు. పిల్లి జపం చేస్తున్నట్లు నటిస్తుంది. వృద్ధాప్యం వల్ల అది చాలా కాలంగా ఆహారాన్ని సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు ఆహారమే వెతుక్కుంటూ తనవద్దకు వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పిల్లి అమాంతం కుందేలు, పావురం మీదకు దూకి చేతులతో పట్టుకున్నది. పిల్లి ఏదో ఉపకారం చేస్తుందని భ్రమపడి దాని దగ్గరకు వెళ్ళిన కుందేలు, పావురం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాయి.
నీతి కథలు : సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. మనకుహాని చేసే వారని తెలిసిన కూడా వారిని సహాయం అర్థిస్తే మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.