కుక్కపాట్లు
ఒక నగరంలో కొన్ని ఊరకుక్కలు ఉన్నాయి. అవి దొరికింది తింటూ తిరుగుతూ హాయిగా ఉన్నాయి. ఒకసారి ఆ నగరంలో కరువు వచ్చింది. తినడానికి ఏమీ దొరకలేదు, కొన్ని కుక్కలు జబ్బుపడ్డాయి. మరి కొన్ని కుక్కలు చనిపోయాయి. ఒక ఊరకుక్క ఆకలి బాధ భరించలేక మరో నగరానికి వెళ్ళింది. ఆ నగరంలో ఇళ్ళ తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఇళ్ళల్లో ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి.
గృహిణులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కుక్క ఇళ్ళల్లో ప్రవేశించి దొరికింది తింటూ ఉల్లాసంగా గడపసాగింది. ఒకరోజు కుక్క ఒక ఇంట్లో రుచికరమైన ఆహార పదార్థాలు తిని నెమరు వేసుకుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఆ నగరానికి చెందిన కొన్ని ఊరకుక్కలు దీన్ని చూశాయి. “ఇది మన నగరానికి చెందిన కుక్క కాదు. అయినప్పటికీ ఇళ్ళల్లో దూరి కడుపునిండా తిని వస్తుంది” అని అక్కసు వెళ్ళగక్కుతూ మూకుమ్మడిగా ఆ కుక్కపై దాడిచేశాయి.
ఆ దాడిలో కుక్క తీవ్ర గాయాలపాలైంది. “నా నగరమే నయం. దొరికింది ఏది తిన్నా నా జాతివారెవరూ దాడి చేసేవారు కాదు. కరువు కాటకాలు వచ్చినప్పటికీ కొంత మనశాంతిగా బతికాను. పుట్టిన ఊళ్ళోనే కొంత రక్షణ ఉంది” అని భావించి వెంటనే తన నగరానికి తిరిగి వచ్చింది. నగరానికి చేరగానే తన పాత మిత్రులైన కొన్ని ఊరకుక్కలు చుట్టూ చేరాయి. “మిత్రమా! నువ్వు వెళ్ళిన నగరం విశేషాలేమిటి? అక్కడ ఆహారం బాగా దొరుకుతుందా?” ఇలా ప్రశ్నల వర్షం కురిపించాయి. అందుకు ఊరకుక్క బదులిస్తూ “ఆ నగరంలో ఆహారం బాగానే దొరుకుతుంది, మనం తృప్తిగా తినవచ్చు.
అలా తినడం చూస్తే మన జాతి ఊరకుక్కలే ఓర్చుకోలేవు. మనపై దాడి చేసి గాయపరుస్తాయి. మనం ఇతర ప్రాంతాల వాళ్ళమని వివక్షత చూపిస్తాయి. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తిరిగి మన నగరానికే తిరిగి వచ్చేశాను. ఏది ఏమైనా జన్మభూమిని మించిన స్వర్గం లేదు” అన్నది ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన ఊరకుక్క. సుదూర ప్రాంతాలకు వెళ్ళి కుక్క పడిన కష్టాలను విని తోటి కుక్కలు నీరసంతో చతికిలపడ్డాయి.