కుక్క- గాడిద కథ
అనగనగా ఓ రజకుడు. అతని పేరు ధావకమల్లుడు. కాశీనగరంలో ఉంటున్నాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరచి నిద్రపోయాడు. అర్థరాత్రి అయింది. అదే అదనుగా ఓ దొంగ అతని ఇంటిలోకి చొరబడ్డాడు. దొంగ ఇంటిలోకి చొరబడడాన్ని ధావకమల్లుడి గాడిద, కుక్క చూశాయి. కట్టి ఉండడం వల్ల గాడిద, దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టి లేదు. అది ప్రయత్నించవచ్చు. అయితే అది ఆ ధ్యాసలోనే ఉన్నట్టు లేదు. ఆ విషయాన్నే కుక్కను అడిగింది గాడిద.్చ‘‘ఏంటలా చూస్తూ కూర్చున్నావు. దొంగని చూశావు కదా! మొరుగు. యజమానిని లేపు.’’‘‘నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం నాకు చెప్పక్కర్లే.’’ అంది కుక ్క.‘‘అయ్యయ్యో! ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే’’‘‘దోచుకుపోనీ.’’‘‘యజమాని నష్టపోతాడే.’’‘‘నష్టపోనీ.’’ అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది.‘‘రోజు రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంత అన్నం పెడతారెవరయినా. మన యజమానీ ఉన్నాడు. దండం పెట్టడు సరికదా, ఇంత అన్నం కూడా పెట్టడు. ఇలాంటి వాణ్ణి లేపమంటున్నావు నువ్వు. చచ్చినా నేను లేపను. అరవను.’’
‘‘తప్పే! అతను ఎంతయినా మన యాజమానే! అతనికి అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు చెప్పు? కృతఘ్నత మహాపాపం.’’ అంది గాడిద.‘చాల్లే చెప్పొచ్చావు’ అన్నట్టుగా అటుగా ముఖం తిప్పుకుంది కుక్క.‘‘ఇదిగో నువ్వు అరవకపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. నేను అరుస్తాను. యజమానిని నేను నిద్రలేపుతాను. చూడు.’’ అంటూ గాడిద పెద్దగా ఓండ్రపెట్టింది. గాడిద అలా అరవడంతో దొంగ భయపడ్డాడు. పారిపోయాడు అక్కణ్ణుంచి. దొంగ పారిపోవడాన్ని గాడిద గమనించలేదు. అరుస్తూనే ఉంది. మెలకువ వచ్చింది ధావకమల్లుడికి. అరిచి నిద్ర చెడగొట్టిందని గాడిదపై కోపం వచ్చింది. అంతే! దుడ్డు కర్ర తీసుకుని అరుస్తూన్న గాడిద దగ్గరకు ఒక్క ఉదుటన వచ్చాడు ధావకమల్లుడు. కొట్టిన చోట కొట్టకుండా గాడిదను చావ బాదాడు. ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది.’’ కథ ముగించాడు కరటకుడు.‘‘పాపం’’ అన్నాడు దమనకుడు.‘‘జాలి పడడం తర్వాత. ముందు ఈ కథలో నీతి ఏమిటో తెల్సిందా? ఎవరి పని వారే చెయ్యాలి. కుక్క పని కుక్క చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి. అంతేకాని, ఒకరి పని ఒకరు చేస్తే లాభం లేదు సరికదా, ప్రాణానికే పెనుముప్పు.’’ అన్నాడు కరటకుడు.‘‘అందుకని, దాని మానాన సింహాన్ని వదిలేసి మనం ఎంచక్కా అడవిలోకి పోదాం. ఆహారాన్ని వెదుక్కుందాం.’’ అన్నాడు మళ్ళీ.
‘‘అదే తప్పు. ఎవరి దారి వారు చూసుకుంటారంటూ మన దారి మనం చూసుకోవడం పద్ధతి కాదు. మనం బతకాలి. మనతో పాటు నలుగురూ బతకాలి. అదీ పద్ధతి. ఇదిగో! తిండీ, నిద్రా, భయమూ అందరికీ ఉండేవే! అందులో తేడాల్లేవు. తేడా అంతా మన ఆలోచనల్లో ఉంది. కుక్కకి చిన్న ఎముక ముక్క దొరికితే చాలు, ఆనందమనిపిస్తుంది దానికి. అదే సింహాన్ని తీసుకో! ఏనుగు కుంభస్థలాన్ని కొడితేనేగాని దానికి ఆనందం అనిపించదు. కుక్క ఎంతగా తోక వూపుతూ కాళ్ళ దగ్గర పడి ఉన్నా, దానికి ఇంత ముద్ద పెట్టడం కష్టం. అదే ఏనుగుని తీసుకో! వీధిలో అది వెళ్తూంటే చాలు, కావాల్సిన న్ని, పళ్ళూ పలహారాలూ పెడతారు. దీన్ని బట్టి అర్థం అయింది ఏమిటి? సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి. ఉంటేనే హోదా! లేకపోతే హీనంగా బతకాలి. హోదా కావాలంటే బలం ఉండాలి. చదువు ఉండాలి. లేదంటే రాజుగారి ఆశ్రయం సంపాదించాలి. రాజుగారు చేరదీశారంటే ఆ లెక్కే వేరు. ఆ గౌరవమే వేరు.’’ అన్నాడు దమనకుడు.‘‘మనకి అంత రాసిపెట్టి లేదులే’’ అన్నాడు కరటకుడు.
‘‘ఎందుకలా అనుకోవాలి? రాసిపెట్టి ఉందనుకుందాం. అలా అనుకుంటేనే తెలివితేటలు పుట్టుకొస్తాయి. తెలివితేటలు ఉంటేనే రాజాశ్రయం కలుగుతుంది. రాజాశ్రయం దొరికిందనుకో! మన తెలివి మరింత రాణించి, వ్యవహారాలు నెరపగలిగే సమర్థత సాధిస్తాం. దాంతో రాజాస్థానంలో పదవిలో కూర్చుంటాం. నీకో సంగతి తెలుసా? రత్నం విలువయినదే కావచ్చు. దాన్ని పెట్టెలో దాచేస్తే విలువేముంది చెప్పు? దాని మెరుపులు ఎవరికి కనిపిస్తాయి? అలాగే మనం రత్నాల్లాంటివారం. మనం ఉన్న చోట ఉండిపోతే విలువ ఉండదు. రాజాశ్రయం సంపాదించాలి.’’ అన్నాడు దమనకుడు.‘‘రాజాశ్రయం సంపాదించాలి అని నాకూ ఉంది. కాకపోతే ఆ పింగళకుడు మనల్ని దగ్గరకు రానివ్వడు. మరిచిపోయావేమో! ఇంతకు ముందు, ఈ మహారాజే మనల్ని వద్దని గెంటేశాడు. అది తలచుకుంటేనే బాధగా ఉంది. ఆ బాధతోనే మాట్లాడుతున్నాను. ఒకటి తెలుసా నీకు? బుద్ధిలేని రాజుని ఆశ్రయించి కష్టాలపాలయ్యేకంటే ఉన్న చోట ఉండడమే మేలనిపిస్తోంది. సరే, నా భయాలు నావి. నువ్వు చెప్పు, నువ్వెలా అంటే అలాగే’’ అన్నాడు కరటకుడు.‘‘ఎద్దు వేసిన రంకెకి రాజుగారు భయపడిపోయాడు. నువ్వూ చూశావు కదా! ఇప్పుడా భయం నుంచి రాజుని గట్టెక్కించాలి. గట్టెక్కించి నాలుగు మంచి మాటలు చెప్పాననుకో! రాజుగారి అభిమానాన్ని ఇట్టే సంపాదించేస్తాను. తర్వాత సంగతి తర్వాత’’ అన్నాడు దమనకుడు.‘‘రాజు భయపడ్డాడంటావా?’’ అనుమానంగా అడిగాడు కరటకుడు.‘‘భయపడ్డాడు. గమనించలేదా నువ్వు? నేను గమనించాను. అవతలి వారు ఏ భావంతో ఉన్నదీ చూసీ చూడగానే కనిపెట్టాలి. అలా కనిపెట్టినవారినే పండితులు అంటారు. కనిపెట్టలేకపోతే పండితుడికీ, పశువుకీ తేడా లేదు.’’ అన్నాడు దమనకుడు.
‘‘రాజు దగ్గర కొలువు చెయ్యాలంటే రాజు మనసు ఎరిగి మరీ ప్రవర్తించాలి. నీకా విద్య బాగా వచ్చు. మరికనేం, వెళ్ళు’’ అన్నాడు కరటకుడు.‘‘ఉద్యోగికి దూరభూమి ఉండదు. విద్వాంసుడికి పరదేశం ఉండదు. మంచిగా, మనసుకి నచ్చినట్టుగా మాట్లాడేవారికి శత్రువులు ఉండరు. అలాగే ధైర్యశాలికీ, బుద్ధిమంతుడికీ అసాధ్యమనేది ఉండదు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే రాజు దగ్గర భయం ఉండదు. రాజు మనసెరిగి, అతను కోపంగా ఉన్నాడా? శాంతంగా ఉన్నాడా? అన్నది తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే రాజుగారి అభిమానాన్ని ఇట్టే దోచేయొచ్చు.’’ అన్నాడు దమనకుడు.‘‘ఇదంతా దేనికి గాని, ఇప్పుడు రాజుతో నువ్వేం మాట్లాడబోతున్నావు?’’ అడిగాడు కరటకుడు.‘‘ ఇది మాట్లాడతానని లేదు, ఏదో ఒకటి మాట్లాడతాను. రాజు నా మొహం చూసినప్పుడల్లా సమాయానుగుణంగా ఏదో ఒకటి, అతనికి ఆసక్తి కలిగించేలా, కొలువులో మిగిలిన వారికి నా మీద కోపం రాకుండేలా మాట్లాడతాను. మాట్లాడే ముందు, అన్నీ ఆలోచించుకుని మరీ మాట్లాడతాను.’’‘‘అలాంటప్పుడు ఇక ఆలస్యం దేనికి? వెళ్ళు. అదిగో, రాజు బయల్దేరాడు. ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. పరిగెత్తు.’’ అన్నాడు కరటకుడు.నిజమే! పింగళకుడు ఇంటిదారి పట్టాడు. పరుగుదీశాడు దమనకుడు. ఎదురుపడి, నమస్కరించాడు రాజుకి.‘‘కూర్చో కూర్చో’’ అన్నాడు పింగళకుడు. కూర్చున్నాడు దమనకుడు.‘‘ఏంటి సంగతులు?’’ అడిగాడు.‘‘అంతా క్షేమమే మహారాజా! మీ రాజ్యంలో జంతువులన్నీ సుఖంగా ఉన్నాయి. ముప్పూటలా తింటున్నాయి.’’‘బాగుంది’ అన్నట్టుగా త లూపాడు పింగళకుడు.‘‘మీరు వద్దన్నా, కాదన్నా మిమ్మల్ని ఓ సేవకుడిగా నేను దర్శించుకోవడం నా బాధ్యత. దర్శించుకోకపోతే స్వామిద్రోహం అవుతుంది.’’‘‘బాగా చెప్పావు.’’
‘‘ఒకమాట చెబుతాను మహాప్రభో! మనిషి బుద్ధి వికసించాలంటే నాలుగు పనులు చెయ్యాలి.’’‘‘ఏంటవి?’’ ప్రశ్నించాడు పింగళకుడు.‘‘ఒకటి: అనేక దేశాలు తిరగాలి. అంటే ఇంటిని కాదనుకుని, చూసిన ఊరు చూడకుండా చూసి రావాలి. రెండు: విద్వాంసులతోనూ, పండితులతోనూ స్నేహం చెయ్యాలి. మూడు: కావ్యాలను చదువుకోవాలి. నాలుగు: రాజాస్థానంలో చాలా కాలం పాటు పని చెయ్యాలి. అంటే మీలాంటి వారి దగ్గర పది కాలాలపాటు ఉద్యోగం చెయ్యాలి. చేస్తే లోకజ్ఞానం కలుగుతుంది. లేకపోతే ఇంత మనిషి కూడా బావిలో కప్పలా బతకాల్సిందే! నివసిస్తూన్న బావే లోకం అనుకుంటుంది కప్ప.’’‘‘నీకు చాలా విషయాలు తెలుసు.’’ మెచ్చుకున్నాడు పింగళకుడు.‘‘ఈ విషయాలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే! మిమ్మల్ని అప్పుడప్పుడూ కలుస్తూండడం వల్ల ఇవన్నీ తెలిశాయి. లేకపోతే నా మొహం! నాకేం తెలుసు?’’ అన్నాడు దమనకుడు.‘‘నిజం చెప్పావు’’ అన్నాడు పింగళకుడు. తనని దమనకుడు పొగుడుతూంటే బహు బాగుందనిపించింది. మత్తుగా కళ్ళు మూసుకున్నాడు పింగళకుడు.