కోతి డప్పు



ఒక కోతి ఉండేది. ఒక రోజు దానికి ఐదు పైసలు దొరికాయి. ఆ ఐదు పైసలతో కోమటి దుకాణానికి వెళ్లింది. బటానిలు కొనుక్కుంది. ఒక చెట్టుమీద కూర్చుని తినసాగింది. అప్పుడు ఆ బరాణీ గింజల్లోంచి ఒక గింజ జారి కింద ఉన్న ముండ్ల కంపలో పడింది. కోతి దానికోసం కంపలోకి వెళ్లింది. దానితో ఒక ముల్లు గుచ్చింది.

అదే సమయంలో ఆ దారి వెంట ఒక మనిషి వెళ్తుంటే అతన్ని పిలిచి ముల్లు తీయమని అడిగింది. మంగలి ముల్లు గుచ్చినంత వరకు దాని తోకను కాసాడు.

అప్పుడు కోతి "నా తోకను కోసివేశావు కదూ! మరీనా నా తోక నాకు తిరిగి ఇవ్వు!" అని గొడవ చేసింది. మంగలి చేసేది లేక కత్తిని ఇచ్చి వెళ్ళిపోయాడు. కత్తితో కోతి ముందుకు వెళ్ళసాగింది. ఒక ఆవిడ చేతితో కట్టెలు విరుస్తూ కనిపించింది. కోతి ఆమెతో "చేతితో కట్టెలు విరిచే బదులు ఈ కత్తితో నరుకు బాగుంటుంది" అంది. ఆమె సరేనని కత్తితో కట్టెలు నరకసాగింది. కొన్ని కట్టెలు నరకగానే కత్తి విరిగిపోయింది. అప్పుడు కోతి "నా కత్తి నాకివ్వు లేకపోతే కట్టెలు ఇవ్వు" అని గోల చేసింది. ఆమె కొన్ని కట్టెల్ని ఇచ్చింది. కోతి ఆ కట్టెలతో బయలుదేరింది. కొద్దీ దూరం వెళ్లాక ఒక ఆవిడ పొయ్యిలో కాళ్ళు పెట్టి నూనె తయారు చేస్తూ కనిపించింది. కోతి ఆమెతో "పొయ్యిలో కాళ్ళు ఎందుకు పెట్టావు? ఇదిగో ఈ కట్టెలు పెట్టు!" అంటూ కట్టెలను ఇచ్చింది. కట్టెలు పూర్తిగా కాలిపోగానే "నా కట్టెలైనా ఇవ్వు లేకపోతే నూనె అయినా ఇవ్వు" అని ఆమెతో గొడవ చేసింది. అప్పుడు ఆమె నూనె ఇచ్చింది.

మరికొంత దూరం వెళ్ళేసరికి కోతికి "మూకుడులో నీళ్ళు పోసి పూరీలు చేస్తున్న ఒక ఆవిడ కనిపించింది. ఆవిడతో "ఎవరైనా నూనెతో పూరీలు చేస్తారు గానీ, నీళ్ళతో చేస్తారా?" అంటూ నూనె ఇచ్చింది. నూనె ఐపోగానే "నా నూనె అయినా ఇవ్వు లేక పూరీలైనా ఇవ్వు" అని గొడవ చేసింది. ఆమె పూరీ ఇచ్చింది. కోతి ముందుకు వెళ్ళింది.

ఒక చోట చిన్నపిల్ల ఏడుస్తూ కనిపించింది. ప్రక్కన వాళ్ళ అమ్మమ్మ ఉంది. కోతి ఆ పిల్లకు పూరీ ఇచ్చింది. ఆమె ఏడుపు ఆపి పూరీ తిన్నది. తర్వాత కోతి అమ్మమ్మతో "నా పూరీ అయినా ఇవ్వు లేక ఈ పిల్లనైనా ఇవ్వు" అని అడిగింది. ఆమె పిల్లను ఇచ్చింది.

ఒక చోట ఒక రైతు పొలం దున్నాలనుకున్నాడు. అతని దగ్గర ఎడ్లు లేవు. కోతి అతనితో "ఈ పిల్లను కట్టి దున్ను" అంది. రైతు అలాగే చేశాడు. పిల్ల చనిపోయింది. అప్పుడు కోతి "పిల్లనైనా ఇవ్వు లేక నీ దగ్గరున్న డప్పు అయినా ఇవ్వు" అని గొడవ చేసింది. రైతు డప్పు ఇచ్చాడు.

కోతి ఆ డప్పు తీసుకుని ఒక చెట్టు మీద కూర్చుని వాయించడం మొదలుపెట్టింది. "తోక పోయి కత్తి వచ్చే ఢాం! ఢాం! ఢాం! కత్తిపోయి కట్టెలు వచ్చే ఢాం! ఢాం! ఢాం! కట్టెలు పోయి నూనె వచ్చే ఢాం! ఢాం! ఢాం! నూనె పోయి పూరీ వచ్చే ఢాం! ఢాం! ఢాం! పూరీ పోయి పిల్లా వచ్చే ఢాం! ఢాం! ఢాం! పిల్లా పోయి డప్పు వచ్చే ఢాం! ఢాం! ఢాం!" అని పాడుకుంది.

Responsive Footer with Logo and Social Media