కొంగ మరియు ఎండ్రకాయ



ఒక అడవిలోని కొండ ప్రాంతంలో ఒక చెరువు ఉండేది. దానిలోని చాలా చాపలు మరియు ఇతర ప్రాణజీవులు ఉండేవి. అందులో ఒక ఎండ్రకాయ కూడా ఉంది. ఎక్కడి నుండో ఒక మోసకారి కొంగ అక్కడికి వచ్చి చేపలను చూసింది. ఎలాగైనా ఈ చేపల్ని తినాలి అని ఒక ఉపాయం వేసింది. ప్రతిరోజూ కొంగ చెరువు వద్దకు వచ్చి, ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటించేది. కొత్తలో చేపలు భయపడి కొంగ సమీపానికి వెళ్ళలేదు. కొన్ని రోజులకు ఒక్కో చేప దొంగ తపస్సు చేస్తున్న కొంగ దగ్గరకు వచ్చాయి.



చేతికందేంత దూరంలో చేపలు ఉన్నప్పటికీ కొంగ వాటికి ఎటువంటి హాని చేసేది కాదు. దొంగ తపస్సు చేస్తూ కదలకుండా ఒంటి కాలిపై నిలబడేది. అదే చెరువులో ఉంటున్న ఒక ఎండ్రకాయ కొంగ వద్దకు వచ్చింది. “కొంగ! నీకు చేతికందేత దూరంలో ఇన్ని చేపలు ఉన్నాయి కదా? వాటిని ఎందుకు తినడం లేదు?” అని ఎండ్రకాయ ప్రశ్నించింది. “నేను మాంసాహారాన్ని మానేశాను, జీవహింస చేయడం పాపమని తెలుసుకుని అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నాను” అని అబద్ధపు మాటలు కొంగ చెప్పింది.

ఆ చెరువులోని చేపలతోపాటు ఇతర జలచరాలు కూడా కొంగమాటలు నమ్మి, ప్రతిరోజు నిర్భయంగా కొంగకు అతి సమీపాన వచ్చి నీళ్ళల్లో ఈద సాగాయి. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి, ఒకరోజు కొంగ ఏడూస్తూ కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూసిన చేపలు “ఎందుకు ఏడుస్తున్నావు?” అని ప్రశ్నించాయి. “ఈ ఏడుపు నా గురించి కాదు, మీ గురించే” అన్నది కొంగ. “మా గురించి నువ్వు ఏడవడమేమిటి?” ప్రశ్నించాయి చేపలు. “ఎండాకాలం రాబోతోంది, ఈ చెరువులో నీళ్ళు చాలా వరకు ఇంకిపోయిన తర్వాత జాలర్లు వచ్చి వలలు వేసి మిమ్మల్ని పట్టుకుంటారు.

అప్పుడు మీ ప్రాణాలకు అపాయం వస్తుంది. నా రెక్కలతో నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను” అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ కొంగ కన్నీరు కార్చింది. “నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా ప్రాణాలు రక్షించు” అని చేపలు ప్రాధేయపడ్డాయి. “ఒక ఉపాయం నా వద్ద ఉంది, ప్రతిరోజూ మీలో కొందరిని నా నోట కరచుకుని కొండకు అవతల ఉన్న పెద్ద సరస్సులో వదులుతాను, ఆ సరస్సు ఎప్పటికీ ఇంకిపోదు. మీరు జీవితాంతం హాయిగా, ఎటువంటి ప్రాణభయం లేకుండా జీవింవచ్చు” అని కొంగ అబద్ధపు మాటలు చెప్పింది.

కొంగ చెప్పిన మాయమాటలను నమ్మిన చేపలు అందుకు అంగీకరించాయి. దాంతో ప్రతిరోజూ కొన్ని చేపల్ని ముక్కున కరచుకుని, ఎగిరిపోయి సరస్సు వైపు కాకుండా కొండపై ఉన్న పెద్ద బండపైకి వెళ్ళి అక్కడ చేపల్ని తినేసేది. మరుసటిరోజు మరి కొన్ని చేపల్ని తీసుకువెళ్ళేది. స్నేహితుల్ని సరస్సులో వదలి కొంగ రక్షిస్తుందని చేపలు భ్రమలో బ్రతికేవి. కొద్ది రోజులకు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి. ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది. “కొంగ! నా మిత్రులైన చేపలన్నింటినీ సరస్సులో వదిలావు, అదే విధంగా నన్ను కూడా మోసుకెళ్ళి ఆ సరస్సులో వదలి పుణ్యం కట్టుకో” అని ఎండ్రకాయ ప్రాధేయపడింది. “అదెంత పని, నువ్వు నా మెడ చుట్టూ గట్టిగా పట్టుకో. నేను విడవమనే వరకు నా మెడనే పట్టుకుని ఉండు. నిన్ను సునాయాసంగా కొండకు అవతల ఉన్న సరస్సులో వదిలేస్తాను” అన్నది కొంగ.

కొంగ చెప్పినట్లే ఎండ్రకాయ చేసింది, ఇక కొంగ ఆకాశంలో ఎగిరిపోయింది. తీరా చూస్తే అది పెద్ద సరస్సువైపు వెళ్ళకుండా కొండపై ఉన్న పెద్ద బండవైపుకు వెళ్ళడం ఎండ్రకాయ గమనించింది. అక్కడ చేపల ఎముకలు, పొలుసులు దానికి కనిపించాయి. కొంగ తన ప్రాణానికి హాని తలపెట్టబోతుందని ఎండ్రకాయ గ్రహించింది. ఇక ఆలస్యం చేయకుండా పదునుగా ఉన్న తన చేతులతో కొంగ మెడను బలంగా కొరికింది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు పోయినట్టు, చెరువులోని చేపలన్నింటినీ తిన్న కొంగ చివరకు ఎండ్రకాయ చేతిలో బలైపోయింది. మోసాన్ని మోసంతోనే జయించిన ఎండ్రకాయ, మెల్లిగా అక్కడి సరస్సులోకి చేరి ప్రాణాలను కాపాడుకుంది.

నీతి కథలు : కాబట్టి మోసబుద్ధిగలవారు చెప్పే తీయని మాటల మాయలో పడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. అపాయం వచ్చినప్పుడు మంచి ఉపాయం ఆలోచించి, మనకు ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Responsive Footer with Logo and Social Media