కర్ణుని సహజ కవచకుండలములు
పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసారు. ఆఖరు సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చేయ దలిచాడు. కర్ణుని కవచ కుండలాలు మాయో పాయముచే గ్రహించాలనుకున్నాడు. ఈ విషయం సూర్యునికి తెలిసింది.కర్ణుడు తన భవనంలో నిద్రిస్తుండగా సూర్యుడు బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడికి కలలో కనిపించి " కర్ణా! నేను నీ మేలు కోరి ఒక విషయం చెప్పటానికి వచ్చాను. దేవేంద్రుడు కపటో పాయంతో నీ కవచకుండలాలను సంగ్రహించటానికి వస్తున్నాడు.
నీవు బ్రాహ్మణులు ఏది అడిగినా లేదనకుండా ఇస్తావని బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచకుండలాలు దానంగా గ్రహించి నిన్ను నిర్వీర్యుని చేయాలనుకుంటున్నాడు. నీ కవచకుండలములు అమృతమయములు. అవి నీ వంటి మీద ఉన్నంత కాలం నిన్ను ఎవరూ చంపలేరు. నీవు బ్రతకాలనుకుంటే నీ కవచకుండలములను ఇవ్వకు" అన్నాడు. కర్ణుడు సూర్యునితో " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు. దయచేసి మీరెవరో నాకు చెప్పండి " అని అడిగాడు. సూర్యుడు " కర్ణా! నేను సూర్యుడను. నా మనసులో నీ మీద మమకారం ఎక్కువ. అందుకే వచ్చాను. నా మాటను పాటించు ఇది నీకు గొప్ప మేలును చేస్తుంది " అన్నాడు.
కర్ణుడు సూర్యునితో " ఓ సూర్యదేవా! నేను బ్రాహ్మణులు ఏది అడిగినా ఇస్తానన్న వ్రతము గల వాడిని. దేవేంద్రుడే దేహీ అడిగితే నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అలాంటిది కవచ కుండలములు ఒక లెక్కా. అదియును కాక ముల్లోకాలను ఏలే ఇంద్రుడు ధర్మం తప్పి మారు వేషంలో నా వద్దకు రావడమా. అది అతని కీర్తికి హాని కదా. ఏది ఏమైనే నేను ధన్యుడను. ఈ లోకంలో కీర్తికి మించినది లేదు. కీర్తి తల్లి వలె నన్ను కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని కీడులు ఆవహిస్తాయి.
బ్రాహ్మణులు కోరితే ఉన్నంతలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణు వేడిన వారిని కాపాడటం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలురను, స్త్రీలను చంపక పోవడం నా వ్రతం. కనుక ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచ కుండలాలను సంతోషంగా ఇస్తాను " అని కర్ణుడు చెప్పాడు. సూర్యుడు " కర్ణా! నీ హితులు చెప్పే మాటలు నీవు వినవు. తన వారికి మేలుకలిగే కార్యములు చేసి కీర్తి గడించడం మంచిదే కాని నీకు అపకారం కలిగించే కీర్తి ఎందుకు. నీవు జీవించి ఉన్న మరింత కీర్తి గడించ వచ్చును. నీవు జీవించి ఉన్న నీ భార్యా బిడ్డలు మరింత సౌఖ్యములు అనుభవించగలరు.
మరణించిన పిదప మనిషి బూడిద అవుతాడు. తన కీర్తి తాను చూడ లేడు. మృత్యునికి వచ్చే కీర్తి శవానికి చేసే అలంకారం వంటిది. నీవు నా భక్తుడవు భక్త రక్షణ నా కర్తవ్యం. ఇందులో ఒక దేవ రహస్యం ఉంది. కాలక్రమేణ అది నీకు తెలియగలదు. నీకు కవచ కుండలములు ఉన్నచో నీ శత్రువు అర్జునుడు నిన్ను చంపలేడు. యుద్దంలో అర్జునుని ఓడించాలనుకుంటే ఈ కవచ కుండలాలను ఇంద్రునికి ఇవ్వకు " అని సూర్యుడు నచ్చ చెప్పాడు. కర్ణుడు " సూర్యదేవా! నీకు నా మీద ఉన్న దయతో చెప్పావు కాని నేను చెప్పేది విను.
నేను అసత్యానికి భయపడినట్లు యమునికి కూడా భయపడను. నా వ్రతము వీడను. అర్జునుని నేను గెలవలేను అని తలప వద్దు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియును. పరశు రాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సాయంతో నేను అర్జునిని సంహరించ గలను. మీరు వేరు విధంగా తలపక నా వ్రతాన్ని కొనసాగించడానికి అనుమతి నివ్వండి. ఇంద్రుడు యాచిస్తే నా జీవితాన్ని అయిన ఇస్తాను. నన్ను ఆశీర్వదించండి " అన్నాడు. సూర్యుడు " కర్ణా! నీవు నిశ్చయంగా నీ కవచ కుండలములు ఇంద్రునికి దానం చేయాలనుకుంటే ఇంద్రుని వద్ద నుండి అత్యంత శక్తి వంతమైన శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా తీసుకో " అని సూర్యుడు అదృశ్యమయ్యాడు.
కర్ణుడు కల చెదరి పోగానే పలవరిస్తూ మేల్కొని తనకు వచ్చిన కలను గురించే ఆలోచిస్తూ "ఇంద్రుడు నా కవచ కుండలములను కోరివస్తే శక్తికి బదులుగానే కుండలములను, కవచమును ఇస్తాను" అని నిర్ణయించుకుని ప్రాతఃకాల కృత్యాలను ముగించుకొని శాస్త్రోత్రంగా రెండు ఘడియలు జపమాచరించి తన కలను గురించి సూర్యుడికి తెలుపగా సూర్యుడు " అదంతా సత్యమేనని" అన్నాడు. తన కల సత్యమని గ్రహించి కర్ణుడు దేవేంద్రుని రాకకై ఎదురు చూడసాగాడు.