కర్ణుని జననం
శూరసేనుడు యాదవరాజు. అతని పెద్ద కూతురు పేరు పృధ. ఈ శూరసేనుని మేనత్త కొడుకు కుంతిభోజుడు. అతనికి పిల్లలు లేనందువల్ల తన పెద్ద కుమార్తె అయిన పృధను పెంచుకోవడానికి దత్తత ఇచ్చాడు. పృధ కుంతిభోజుని ఇంట కుంతి అనే పేరుతో పెరుగుతూ వుంది.
ఒకరోజు దూర్వాసుడు కుంతి భోజుని భవనానికి వచ్చారు. కుంతి చేసిన సత్కార్యాలకు సంతృప్తి చెంది ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావం వల్ల ఆమె ఏ దేవత ఆరాధిస్తే ఆ దేవతలు ఆమెకు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు.
ఒకరోజు కుంతి ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్ళింది. స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం విడిచింది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది మహర్షి వరాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యుని తలుచుకుంటూ మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు సూర్యుని చూసి వణికిపోయింది.
అప్పుడు సూర్యుడు ఆమెతో భయపడవద్దని, ఆమె కోరిన వరం తీర్చడానికే వచ్చానని, తన దర్శనం వృధా కాకూడదని చెప్పి ఆమెను ఆవహించే సరికి, సహజ కవచకుండలాలతో ఒక బాలుడు. జన్మించాడు సూర్యుడు వెళ్ళిపోయాడు. కుంతికి ఏం చేయాలో పాలుపోలేదు.
ఇంతలో నదిలో ఒక పెట్టె తేలుతూ వచ్చింది. వెంటనే ఆమె ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో వదిలింది. ఆ పెట్టె నదిలో తేలుతూ పోతూ ఒక సూతుడికి దొరికింది. అతను ఆ బిడ్డను తీసుకువెళ్లి తన భార్యకు అప్పగించాడు. బిడ్డలు లేని వాళ్ళు ఆ బిడ్డకు వసుషేణుడు అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ బిడ్డే కర్ణుడు