కరటక దమనకులు



అనగనగా రక్షావతి అని ఒక ఊరు. ఆ ఊరిలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఓ రోజు ఇలా ఆలోచించాడు.అన్నిటికీ డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏదయినా సాధించవచ్చు. డ బ్బు సంపాదించాలి. ఎంత వీలయితే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి. అప్పుడు డబ్బు వస్తుంది అనుకున్నాడు వర్ధమానుడు. బండ్ల మీదా, గుర్రాల మీదా, కంచరగాడిదల మీదా బోలెడన్ని సరుకులు ఉంచుకుని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకి బయల్దేరాడు. సేవకుల్ని కూడా వెంట పెట్టుకున్నాడు. ప్రయాణం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాగుతోంది. అడవిలోకి ప్రవేశించారు. దారి సరిగా లేదక్కడ. అడ్డదిడ్డంగా ఉంది. కొండలు ఎక్కి దిగాలి. బండ్లు దిగుతున్నాయి. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు.అయ్యయ్యో! ఎంత పని జరిగింది. బలమైన ఎద్దు ఇది. దీనికే ఇలా జరిగిందంటే ఏం చె య్యాలిప్పుడు? కాలికి కట్టుకట్టి, మందురాద్దామంటే మందూ లేదు. కట్టూ లేదు. దగ్గరలో పశువైద్యులు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా! పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలిపడుతూ, దీన్ని చూసుకుంటూ ఇక్కడ కూర్చోవడం అవివేకం. దీనితో పాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఏం చేస్తే బాగుంటుందిప్పుడు? ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు. కాస్సేపటికి తేరుకున్నాడు. కాలు విరిగిన ఎద్దునీ, దాన్ని కట్టిన బండినీ అడవిలో ఉంచి, మిగిలిన బండ్లను ముందుకు పోనిమ్మన్నాడు. సేవకుల్ని కూడా ఒకరిద్దర్ని ఉండమని చెప్పి, మిగిలిన వారిని వెళ్ళిపొమ్మన్నాడు. వ్యాపారి మాటను కాదనలేదు వారు. వెళ్ళిపోయారు. వర్ధమానుడు దగ్గరలోని పల్లెకు వెళ్ళాడు. సంజీవకుడులాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి వచ్చాడు. దాన్ని సంజీవకుని స్థానంలో కట్టి, బండిని ముందుకు పోనిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు దిక్కులేని వాడైపోయాడు.ఆయుష్షు గట్టిదయితే ఏం జరిగినా ప్రాణం పోదు. ఎక్కడ ఉన్నా ప్రాణం పోదు. అదే జరిగింది సంజీవకుడి విషయంలో. అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్నా దానికి ప్రాణాపాయం లేకుండా పోయింది. కుంటికాలుతోనే కొద్ది రోజులు గడిపింది. తర్వాత ఏ మాయ జరిగిందో విరిగిన కాలు అతుక్కుంది. నొప్పి లేకపోయింది. మామూలు అయిపోయింది. దాంతో దొరికింది తింటూ, తిరుగుతూ మరింత బలంగా తయారయ్యాడు సంజీవకుడు. కండబట్టి బలిశాడు.

ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వాడు. ఖంగుమని రంకె వేశాడు. ఆ రంకె అడవిలో పెద్దగా ప్రతిధ్వనించింది. దాంతో చెట్ల మీది పిట్టలు భయంగా ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ మూల రంకె వేస్తే అది అడవిలో ఆ మూల కూడా వినవచ్చింది. ఆ మూల యమునానదిలో నీళ్ళు తాగుతున్న సింహం గుండెలో కూడా ప్రతిధ్వనించింది. సింహం ఒక్కడుగు వెనక్కి వేసి చూసింది. భయపడ్డదది. పింగళకుడు దాని పేరు.ఆ శబ్దం ఏమిటి? ఎవరు చేశారది? ఎక్కణ్ణుంచి వచ్చింది? ఎవర్ని బెదిరించడానికి, లేదంటే ఎవర్ని హెచ్చరించడానికా శబ్దం?అంతుచిక్కలేదు పింగళకుడికి. చేష్టలుడిగిపోయాడు.చెట్ల చాటుగా ఉండి, పింగళకుడు అలా చేష్టలుడిగిపోవడాన్ని రెండు నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు-దమనకుడు. రంకె శబ్దం వాటికి కూడా వినిపించింది. గుండెలు గుభేల్‌మన్నాయి. అసలందుకే చెట్ల చాటుగా నక్కాయవి. ఇప్పుడు తేరుకున్నాయి. కబుర్లలో పడ్డాయి.‘‘ఎప్పటి నుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పడయినా విన్నామా? ఏంటా శబ్దం? అంత భయంకరంగా ఉంది’’ అన్నాడు కరటకుడు.‘‘మనమే కాదు, ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతకు ముందు విని ఉండడు.వింటే అలా చేష్టలుడిగిపోయి ఉండడు. చూడటు, ఎలా ఉన్నాడో పింగళకుడు. బొమ్మయి పోయాడు’’ అన్నాడు దమనకుడు.‘‘పాతజంతువుల కూతకాదిది. ఇదేదో కొత్తజంతువు కూత. అందులో అనుమానం లేదు. ఏదో కొత్త జంతువు వచ్చిందీ అడవిలోకి. అరచి భయపెడుతోంది. ఇక మనం ఇక్కడ ఉండలేం’’ అన్నాడు కరటకుడు. భయపడ్డాడు.

దమనకుడు అంత భయపడలేదు. ముందు నుంచీ కొంచె ం ధైర్యం ఎక్కువ. తలెగరేసి ఇలా అన్నాడు.‘‘ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవి ఏమయినా మన సొంత ఇల్లా? కాదు కదా? అయినా ఇంతగా భయపడడం అనవసరం. ముందు కూతపెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి. దాని రంగూ, ఎత్తూ, బలం తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు. కొన్ని జంతువులు ఉంటాయి. మన చెవి అంత పొడవు ఉండవు. కాని, కూతేమో అడవి దాటిపోయేట్టుగా పెడతాయి. ఇప్పుడు కూత పెట్టింది కూడా అలాంటిదే కావచ్చు.’’‘‘ఏమో’’ ఇంకా భయం వీడలేదు కరటకుణ్ణి.‘‘కూత వినిపించింది సరే, ఆ కూతకి భయపడి అటు నుంచి చిన్నా చితక జంతువులు పరిగెత్తి రావాలి కదా! రాలేదంటే, నువ్వు ఊహిస్తున్నట్టుగా ఆ జంతువేదో అంత ప్రమాదకారి కాదు. ఏమంటావు?’’జవాబు లేదు కరటకుడి నుంచి. ఏదో ఆలోచనలో పడ్డాడు.‘‘ఏంటాలోచిస్తున్నావు’’ అడిగాడు దమనకుడు.‘‘గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. మనకే ప్రమాదమూ లేదు. ఏం జరిగిందంటే...కొన్నాళ్ళ కిందట ఓ ఎద్దు కాలు విరిగిపోయింది. విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వర్తకుడు. అది అక్కడా ఇక్కడా తిరగడం నేను చూశాను. తర్వాత బాగా బలిసింది. అదీ చూశాను. ఇప్పుడు వినిపించిందే కూత, అది కూత కాదు, రంకె. ఎద్దు రంకె. దానికి మనం బెదిరిపోయాం.’’ చెప్పుకొచ్చాడు కరటకుడు.

‘‘మనం బెదిరిపోయామంటే అర్థం ఉంది. మనం నక్కలం. మృగరాజు సింహంగారు, పింగళకుడు బెదిరిపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు మళ్ళీ.‘‘ష్‌ష్‌ష్‌’’ పెద్దగా మాట్లాడకన్నట్టుగా హెచ్చరించాడు దమనకుడు.‘‘ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? రాజు...మనరాజు...సింహం గురించి మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు.’’‘‘ఇప్పుడు తప్పేం మాట్లాడాను’’‘‘తప్పు మాట్లాడలేదుగాని, తక్కువ చేస్తూ మాట్లాడావు. అదే ప్రమాదం. పింగళకుడు మన రాజు. మనం మంత్రులం. మంత్రులుగా మనం రాజుగారి భయం పోగొట్టాలి. పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు. మనం రాజుగారికి దగ్గరవుతాం.’’ అన్నాడు దమనకుడు.‘‘చాల్లే చెప్పొచ్చావు. ఈ రాజుకా మనం దగ్గరయ్యేది. ఏం వద్దు. ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే! ఏనాడూ ఓ తీరులో ఉన్న పాపాన పోలేదు. క్షణక్షణానికీ ఈయనగారి మనసు మారిపోతూ ఉంటుంది.

కష్టపడేవాళ్ళంటే కనికరమే లేదు ఈ రాజుకి. ఎప్పుడూ తిట్టడమే! పొట్ట పోషించుకునేందుకు పడరాని పాట్లుపడుతున్నాం. ఎన్నడయినా పట్టించుకున్నాడా? నానా సేవలూ చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకునే గంజి మేలు అన్నారు. గంజి తాగి బతుకుదాం కాని, ఈ రాజుకి మంచి చెప్పి, మంత్రులుగా బతకొద్దు. అయినా మన అవసరమేమీ ఇప్పుడు ఈ రాజుకి లేదు. మనలాంటి మంత్రులు చాలా మంది ఉన్నారాయనకి. వాళ్ళు చెప్పుకుంటార్లే! ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. తగుదునమ్మా అని తలకెత్తుకుంటే గాడిదలాగ తన్నులు తింటాం. నీకా కథ తెలుసు కదా’’ అడిగాడు కరటకుడు.‘‘తెలియదు’’ అన్నాడు దమనకుడు.‘‘అయితే చెబుతాను, విను’’ అని చెప్పసాగాడు కరటకుడు.