కమలాక్షి కథ
విక్రమార్క భూపాలా: పూర్వం మగధదేశంలో గల ఒక ధనికునకు కమలాక్షి అను కూతురు ఉండేది. ఆమె చాల అందగతై. ఆమె అందచందములు విని, కృపాకరుడను యువకుడు వచ్చి, ఆ ధనికునిజూచి "అయ్యా! నేనును నీ సంపదకు సరిపడు ధనవంతుడనే. సాటి కులస్థుడను కూడ, మీ అమ్మాయిని గురించి వింటిని; స్వయంగా వచ్చి చూచితిని, ఆమెపై నా మనస్సు పోయినది. ఆమె లేకపోయిన నేను బ్రతుకజాలను. ఆమెను దయతో నా కిచ్చి పెండ్లి గావింపుడు. లేనిచో మీ యెదుటనే ఇక్కడనే మరణింతును" అని వేడుకున్నాడు
ఆ ధనికుని పేరు విశాలహృదయుడు. అతడు అలోచించి "కృపాకరా! తొందరపడకు. నేను అమ్మాయితో ఆలోచించి రెండు రోజులలో నీ కోరిక తీరుస్తాను" అని వాగ్దానం చేశాడు.
కృపాకరుడు వెళ్ళిన మరునాడే ధనగుప్తుడను ఒక ధనవంతుని కుమారుడు వచ్చి, కృపాకరుని రీతిగనే విశాల హృదయుని "ని పుత్రికను నా కొసంగనిచో నీ కండ్ల యెదుటనే మరణింతును" అని ఖచ్చితముగా తెలియజేసెను.
విశాల హృదయుడు-- కృపాకరునికి చెప్పినట్లుగనే చెప్పి ధనగుప్తని పంపివేసెను.
ఆ మరునాడు జీవసిద్ధి అను సుందరాంగుడు వచ్చి విశాల హృదయుని మీ కుమార్తె కమలాక్షిని యిచ్చి పెండ్లి చేయమని ప్రార్ధించెను,
విశాల హృదయుడు వానికి గూడ- కృపాకరునికి, ధనగుప్తనికి చెప్పినట్లుగనే తెలియజెప్పి పంపించెను.
తరువాత విశాలహృదయుడు పుత్రికయైన కమలాక్షినిజూచి "అమ్మా రేపటి దినము ముగ్గురు అందమైన యువకులు, ధనవంతుల పుత్రులు వస్తారు. వారు నిన్ను పెండ్లాడవలయుననిము, లేనిచో మరణింతుమనియు పలుకుచున్నారు. వారలు రాగానే, వారిన జూచి నీ యొక్క ఉద్దేశము చెప్పుము" అని తెలియజెసెను.
కాని, ఆ రాత్రియే కమలాక్షి ఆకస్మాత్తుగా మరణించినది. ఆమెకై మరునాడు వచ్చిన ముగ్గురు ధనవంతుల పుత్రులు- ఆమె శవమును చూసి మిక్కిలి దుఃఖించిరి.
తరువాత కృపాకరుడు కమలాక్షికి దహన సంస్కారలు చేశాడు. ఆ స్మశానమందే, ఆమె చితికి దగ్గరగానే ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసికొని అందే నివసింపసాగెను.
ధనగుప్తుడు- కమలాక్షియొక్క అస్థికలను తీసికొని, పుణ్యనదులలో కలుపుటకు వెళ్ళిపోయాడు.
జీవసిద్ది జీవితంపై విరక్తిచెంది సన్యాసియై బయలుదేరాడు. మధ్య మార్గంలో ఒక సిద్ధ పురుషుని దయవలన, జీవసిద్ధికి కొంచెం విభూతి లభించింది. ఆ విభూతిని మరణించిన వారి చితిపై వేసినచో, తిరిగి బ్రతుకుదురని ఆ సిద్ధపురుషుడు చెప్పాడు.
జీవసిద్ధి వెంటనే ఆ విభూతితో కమలాక్షికి దహన సంస్కారలు చేసిన చోటుకు వచ్చాడు. కృపాకరుడు అక్కడనే ఉన్నాడుగదా: అస్థికలను కలపడానికి వెళ్ళిన ధనగుప్తుడు కూడ అదే సమయానికి అక్కడకు చేరుకున్నాడు.
ముగ్గురు కలిసి చితాభస్మాన్ని పోగుచేశారు: విభూతిని మంత్రించి ఆ భస్మంపై వేశాడు జీవసిద్ధి. వెంటనే కమలాక్షి నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుంది. మరల వారు ముగ్గురు "కమలాక్షి" నా భార్య అని జగడానికి దిగారు.
"మహారాజా! విన్నావు గదా కథః ఆమె యెవరికి భార్య అయితే ధర్మముగా ఉంటుంది?" అని ప్రశ్నించాడు భేతాళుడు.
విక్రమార్కుడు ఆలోచించి "కృపాకరునికి భార్య అయితేనే బాగుంటుంది" అన్నాడు.
"అవును; కమలాక్షి ఆలోచించి అదే చేసింది. బ్రతికించిన జీవసిద్ధిని తండ్రిగా భావించింది. ఆస్థికలు పుణ్యనదులలో కలిపివచ్చిన ధనగుప్తుని పుత్రునిగా అంగీకరించింది. తనకొరకు అహోరాత్రులు ఆ స్మశానమందే కాపురంఉన్న కృపాకరున్ని భర్తగా స్వీకరించింది" అన్నాడు. భేతాళుడు.
ఈ విధముగా విక్రమార్కుడి మౌనభంగం కావడంవల్ల భేతాళుడు ఎగిరిపోయాడు. విక్రమార్కుడు తిరిగి వృక్షము వైపు బయలుదేరాడు.
మరల విక్రమార్కుడు భేతాళుని బంధించి, భుజములపై వేసికొని సన్యాసివద్దకు బయలుదేరాడు, కానీ, బేతాళుడు ఊరుకోలేదు, ఇంకొక కథ యిలా ప్రారంభించినాడు.