కలవర మనసు
ఉగాది పండక్కి చీరకొనటానికి సంతకెల్లింది వీరమ్మ, ఎర్ర చీర ఎంచుకుని బేరమాడింది. అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట, ఆ మాట చెప్పి చివరకు ఆ చీరను నలభై రూపాయలకు ఒప్పించడానికి చల్లబడ్డాడు ఎండకు చీరలవ్యాపారి చిన్నయ్య.
ఆమె ఇంటికి చేరుకునేసరికి ప్రక్కింటి శాంతమ్మ అలాంటి చీరనే తీసుకొచ్చి తను ముప్టై ఐదు రూపాయలకే కొన్నట్లు చెప్పింది. వీరమ్మకు ఆ మాట చెవిన పడగానే మనసులో ఒకటే కలవరింత మొదలైంది. చీర పోలికలో ఎటువంటి మార్చు లేదు. పొడవు వెడల్పులో తేడాలు లేవు దారం నేత అంతా ఒకటే రెండూ ఎరుపే . చీరలోని డిజైన్ కూడా అంతా ఒకటే ఐదు రూపాయలు నష్టపోయానని బేరమాడడంలో పారపాటుపడ్డానని అనుక్షణం మధన పడసాగింది.
ఆ చీరను కట్టిన ప్రతీసారి ఆమెలో ఒకే బాధ అనవసరంగా ఐదురూపాయిలు ఎక్కువ పెట్టి కొన్నానని. మూడు నెలలు తర్వాత వీరమ్మకు మనసు తేలిక పడింది. కారణమేమిటంటే శాంతమ్మ కట్టిన చీర రంగు వెలిసిపోయింది.