కలసి వుంటే కలదు సుఖం
రామయ్యకు నలుగురు కొడుకులు. ఆస్తిపాస్తులున్న రామయ్య కొడుకులు ఒకరినొకరు అస్తమానూ వాదులాడుకుంటుండేవారు. తను మరణిస్తే తన ఆస్తిపాస్తులను కాపాడే వారుండదని, రామయ్య విపరీతంగా బాధపడేవాడు.
ఒకసారి రామయ్య మిత్రుడు వీరయ్య అతని వద్దకు రాగా, తన కొడుకుల గురించి వివరంగా చెప్పాడు. దానికి వీరయ్య, రామయ్య చెవిలో ఓ ఉపాయాన్ని చెప్పి వెళ్ళి పోయాడు.
ఆ మర్నాడే రామయ్య తీవ్రంగా జబ్బుపడ్డాడు. తండ్రి అవసాన దశకు చేరుకున్నాడని అతని కొడుకులంతా రామయ్య వద్దకు వచ్చారు. అప్పుడు రామయ్య "అబ్బాయిలు, నేను జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాను. రేపో మాపో 'హరీ' మనే నాకు మీరో పనిచేయాలి" అంటూ నలుగురికీ నాలుగు పుల్లలు ఇచ్చి విరవమని చెప్పాడు. నలుగురు కొడుకులూ పుల్లలు తీసుకుని అతి సునాయాసంగా విరిచేశారు. ఈసారి రామయ్య ఒక్కొక్క కొడుకుకి రెండేసి పుల్లలు చొప్పన ఇచ్చి వీరవమన్నాడు..
ఈసారి పుల్లలు విరవడానికి కాస్త కష్టపడ్డారు కొడుకులుఈసారి తలో కొడుక్కి మూడుపుల్లలు చొప్పన ఇచ్చి విరవమన్నాడు. మూడు పుల్లలు విరవడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి ఒక్కొక్క కొడుక్కి నాలుగు పుల్లలు ఇచ్చి విరవమన్నాడు. పుల్లలు తీసుకుని విరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు కొడుకులు. అప్పుడు రామయ్య చిరుమందహాసం చేస్తూ, 'చూశారా అబ్బాయిలూ మీరు ఒక పుల్లను అతి సునాయాసంగా విరిచేశారు.
నాలుగు పుల్లలను అస్సలు విరవలేకపోయారు. అంటే మీరు ఒకరిమీద ఒకరు వాదులాడుకుంటూ ఎవరిమట్టుకు వారు బతికితే మిమ్మల్ని మన శత్రువులు అతి సునాయాసంగా మట్టుపెట్టగలరు. అందరూ కలిసి కట్టుగా వుంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న విషయాన్ని మీరు గమనించారా. కనుక ఇప్పటికైనా మీరు ఒకరిమీద ఒకరు వాదులాడుకోవడం మానేసి కలిసికట్టుగా వుండి మన ఆస్తిపాస్తుల్ని కాపాడండి' అంటూ వివరించాడు. అంతే ఆనాటినుంచి రామయ్య కొడుకులు కలసిమెలసి జీవించడం మొదలుపెట్టారు..
తన కొడుకుల్ని ఎలా కలపాలనే సమయంలో తన మిత్రుడు వీరయ్య ఇచ్చిన సలహాకు మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య.