కాకి- పాము కథ



‘‘ఎందుకో కాకి-పాము కథ గుర్తుకొస్తోంది.’’‘‘ఏంటా కథ? చెప్పవూ’’ అడిగాడు కరటకుడు. దమనకుడు చెప్పసాగాడిలా.‘‘పూర్వం యమునానదీతీరంలో ఓ పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఓ మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఓ కాకుల జంట నివసిస్తూ ఉండేది. చెట్టు మొదట్లో ఓ పాముపుట్ట ఉండేది. అందులో ఓ పాము ఉండేది. చెట్టు మీద కాకులు లేనప్పుడు, ఈ పాముంది చూశావూ, ఇది చెట్టెక్కి కాకిగూటిలోని గుడ్లన్నీ తినేస్తూ ఉండేది. తమ గుడ్లను పాము తినేస్తున్నదని కాకులకు తెలుసు. అయినా ఏమీ చేయలేక బాధపడుతూ ఉండేవి. ఒకనాడు ఆ కాకుల జంట, తమకు బాగా పరిచయం ఉన్న నక్క దగ్గరకు వెళ్ళాయి. బాధను వెళ్ళబోసుకున్నాయి. పాము పీడ వదలిపోవాలి. ఉపాయాన్ని చెప్పమని వేడుకున్నాయి. కాకుల బాధనంతా విని వినీ సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నక్క. తర్వాత ఓ కథ చెప్పసాగిందిలా.‘పూర్వం బదరికావనంలో ఓ కొంగ ఉండేది. ముసలి కొంగ అది. ముసలితనం వల్ల ఓపిక లేదు దానికి. దాంతో ఆహారం సంపాదించుకోవడం కష్టమయింది. ఆ కష్టంలో ఓ మాయోపాయాన్ని ఆలోచించి, రోజూ చెరువులో నిల్చొని కళ్ళు మూసుకుని ఉండేదది. తపస్సు చేస్తున్నట్టు నటించేది. ఇదంతా ఓ ఎండ్రకాయ గమనించింది.

నాలుగయిదు రోజులుగా గమనించి గమనించి ఆఖరికి కొంగను ఇలా ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది.‘ఏంటిది కొంగబావా? కళ్ళు మూసుకుని ఈ తపస్సేంటి, చుట్టూ తిరుగుతున్న చేపల్ని పట్టించుకోకపోవడమేమిటి? చాలా చిత్రంగా ఉందే నీ పద్ధతి! తిండిలేక చూడూ, ఎలా చిక్కిపోయావో’‘చిక్కపోనీ! నాకిది కావాల్సిందే! పుట్టినప్పటి నుంచీ చాలా చేపలు తిన్నాను. మహాపాపానికి ఒడిగట్టాను.’ అంది బాధగా కొంగ. ఎండ్రకాయకి అంతుచిక్కలేదేదీ.‘ఘోరపాపానికి ఒడిగట్టానని నాకెప్పుడు తెలిసిందో తెలుసా? ఓసారి కాశీలో ఓ పండితుడు, తన శిష్యులకు మంచి చెడులు బోధిస్తూంటే అప్పుడు తెలుసుకున్నాను. తట్టుకోలేకపోయాను. అంతే! అప్పణ్ణుంచీ జీవహింస మానేశాను. చేపల్ని తినడం మానేశాను. ఈ నీరూ, నాచూ ఇదే నా ఆహారం అనుకున్నాను. ఈ నాచు తింటూ ఈ నీరు తాగుతూ చేసిన పాపాలు పోవాలని తపస్సు చేసుకుంటున్నాను.’’ అంది కొంగ.ఎండ్రకాయ కొంగ మాటలు నమ్మేసింది. ఎండ్రకాయేకాదు, కొంగకు ద గ్గర దగ్గరగా అందీ అందక తిరుగుతూన్న చేపలు కూడా నమ్మేశాయి ఆ మాటల్ని. ఇక తమకు భయం లేదనుకున్నాయి. కొంగను సమీపించి ఇలా అన్నాయి.‘ఎంతమంచివాడివి కొంగబావా నువ్వు? నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. మూర్ఖులం మేము. మమ్మల్ని క్షమించు.’నాటి నుంచి కొంగను గౌరవించసాగాయి చేపలు. ప్రాణభయం లేకపోవడంతో కొంగకు మరింత దగ్గరగా మసలసాగాయి. స్నేహాన్ని పెంచుకున్నాయి కొంగతో.

ఒకరోజు కొంగ ఏడుస్తూ కనిపించింది.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ కొంగలు అడిగాయి.‘ఈ ఏడుపు నా గురించి కాదు, మీ గురించి.’’ అంది కొంగ. ఆశ్చర్యపోయాయి చేపలు.‘ఇప్పుడే కొందరు జాలర్లు వచ్చి వెళ్ళారు. చెరువుని చూసి ఆనందపడ్డారు. కొద్దిరోజుల్లో చెరువు ఎండిపోతుందట! పెద్దగా లోతుండదట! అప్పుడు వలలు వేసి చేపలు పట్టడం సులువనుకున్నారు. ఆ మాటలు విన్నప్పటి నుంచీ నా మనసు మనసులో లేదు. ఒకప్పుడంటే మీరు నా ఆహారం. ఇప్పుడు కాదు, పైగా స్నేహితులు. మిమ్మల్ని ఎలా కాపాడుకోవడమా? అని ఆలోచిస్తున్నాను. అంతుచిక్కక ఏడుపు వ స్తోంది’చేపలు భయపడిపోయాయి. కొంగ చెప్పింది నిజమని నమ్మేశాయి. ప్రాణభయంతో విలవిల్లాడిపోయాయి.‘నువ్వే మమ్మల్ని ఎలాగయినా కాపాడాలి. నువ్వే దిక్కు’’ అన్నాయి కొంగతో. ఆలోచించాలోచించి ఇలా అన్నది కొంగ.‘అయితే ఓ పని చేస్తాను. ఇక్కడికి కొద్దిదూరంలో ఇంకొక చెరువు ఉంది. పెద్దచెరువది. అక్కడకి మిమ్మల్ని వీలయినంత తొందరగా చేరుస్తాను.’‘నీమేలు మరిచిపోలేం.’ అన్నాయి చేపలు.

‘అందర్నీ ఒక్కసారిగా చేర్చలేను. రోజుకి కొందర్ని చొప్పున మిమ్మల్ని నా ముక్కన కరుచుకుని చేరవేస్తాను. నన్ను ముందు నన్ను ముందంటూ మీలో మీరు కొట్టుకోవద్దు. ముసలిదాన్ని కదా, నన్ను అర్థం చేసుకోండి.’ అన్నది కొంగ.‘నీ ఇష్టమే! నువ్వు ఎలా చేప్తే అలాగే!’ అన్నాయి చేపలు.కావాల్సిందే! చేపలు తన మాట వినాలి. తనని నమ్మాలి, నమ్మితేనే మోసం చేయడం సులభం అనుకుంది కొంగ. ఆ క్షణం నుంచి ఆకలి తీర్చేటన్ని చేపల్ని ముక్కున కరుచుకుని తీసుకుని వెళ్ళి, చెరువూ లేదు పాడూ లేదు, ఓ కొండ మీదకి చేర్చి తినసాగింది కొంగ. రోజులు గడుస్తున్నాయి. కొంగ కడుపు నింపుకుంటోంది. కొన్నాళ్ళకి చెరువులో చేపలన్నీ ఆహారమయిపోయాయి. ఒక్క చేపకూడా మిగల్లేదు. ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది.‘అన్ని చేపల్నీ అనుకున్నట్టుగా అక్కడి చెరువులోకి చేర్చేశాను. మిగిలింది నువ్వొక్కదానివే! రా, నిన్నూ చేర్చేస్తాను.’ అన్నది కొంగ.‘ఆలస్యం దేనికి? తీసుకెళ్ళు.’ అన్నది ఎండ్రకాయ. కొంగ దాన్ని ముక్కున కరుచుకుని పైకెగిరింది. కిందకు చూడసాగింది ఎండ్రకాయ. ఎంత చూసినా చెరువన్నదే కనిపించలేదు దానికి. ఎంతసేపూ కొండలూ, గుట్టలే కనిపిస్తున్నాయి. ఎక్కడో ఏదో మోసం ఉందనుకుంది ఎండ్రకాయ. ఆ మోసం నుంచి బయటపడాలనుకున్నది. తెలివిగా అడిగింది ఇలా.‘ఏంటిది కొంగబావా? నా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూంది. కిందపడిపోతానేమో అనిపిస్తూంది. భయంగా ఉంది కొంగబావా’‘ఏం చేద్దామయితే’ అని కొంగ అడగలేదు. ఎండ్రకాయ ముక్కన ఉండడంతో మాట్లాడలేకపోయింది. ఎండ్రకాయే మళ్ళీ అన్నదిలా.‘ఇలా నీ ముక్కన నన్ను కరిచిపెట్టడం కాదు, నేనే నీ మెడను కరచిపెట్టుకుంటాను. గట్టిగా పట్టుకుంటాను. అలా వెళ్దాం. ఓసారి దించు.’’

దించింది కొంగ. ఎండ్రకాయ కొంగ గొంతు గట్టిగా కరచిపట్టుకుంది. ఆకాశంలోకి ఎగిరింది కొంగ. చేపల్ని చంపి ఏ కొండమీదయితే తను తిన్నదో ఆ కొండ మీదికి వచ్చి వాలింది కొంగ. చల్లని నీటిలో గాక, ఎర్రని ఎండలో కొండ మీదికి తను చే ర్చిందంటే...అర్థమయిపోయింది ఎండ్రకాయకి. చేపల్ని తిన్నట్టుగానే తననీ చంపి తినాలనుకుంటున్నదీ కొంగ అనుకున్నది. మోసం గ్రహించిన మరుక్షణం తన గిట్టలతో కొంగమెడను కటుక్కున విరిచేసింది ఎండ్రకాయ. కొంగ ప్రాణం పోయింది. రెక్కలు వాలిపోయాయి. కింద పడిపోయింది కొంగ. జాగ్రత్తగా వ్యవహరించడంతో ఎండ్రకాయకి ప్రాణాపాయం తప్పింది. కొండ మీద పడీ పడగానే పక్కకు తప్పుకుంది.’ ముగించింది నక్క.పాముపీడ వదిలించుకోవడం ఎలా అని అడిగితే కథ చెబుతుందేమిటీ నక్క అనుకున్న కాకి జంటతో అంతలోనే ఇలా అంది నక్క.‘ఈ కథను ఎందుకు చెప్పానంటే శత్రువుని మట్టుబెట్టాలంటే సమయం, సందర్భం కావాలి. ఆలోచించి ఆలోచించి తెలివిగా శత్రువుని అణచేయాలి. మళ్ళీ తలెత్తకూడదు.’’కాకి జంట గూటికి చేరింది. ఆలోచనలో పడింది. అవకాశం కోసం కాచుకుని కూర్చుంది. వచ్చింది అవకాశం. కాకులు నివసిస్తూన్న చెట్టుకి దగ్గరగా ఓ చెరువు ఉంది. ఆ చెరువులో సరదాగా స్నానం చేసేందుకు రాజధానినగరం నుండి రాకుమర్తె, ఆమె చెలికత్తెలూ వచ్చారు. రథాలను చెరువు గట్టున నిలిపి, ఆ రథాల్లో తమ నగలనూ, దుస్తులనూ జాగ్రత్త చేశారు. చెరువులో దిగి జలక్రీడలు ప్రారంభించారు. అదే అదనుగా రాకుమార్తె నగనొకదానిని ముక్కున కరిచి, గాలిలోకి రివ్వున ఎగిరింది కాకి. చెలికత్తెలు చూశారు దాన్ని.‘అయ్యయ్యో! రాకుమార్తె నగ కాకెత్తుకుపోతోంది.’ అంటూ గోల చేశారు.

జలక్రీడలు మానుకుని, గట్టుకు చేరారంతా. దూరంగా నిల్చుని ఉన్న భటులను కేకేశారు. ముక్కున నగతో ఎగిరిపోతున్న కాకిని వారికి చూపించారు.‘పట్టుకోండి దాన్ని. రాకుమార్తె నగను అందుకోండి’ ఆజ్ఞాపించారు.కాకిని అనుసరించి పరుగుదీశారు భటులు. అలసిపోయేట్టుగా వాళ్ళని పరుగుదీయించి అటు తిప్పి, ఇటు తిప్పి, మర్రిచెట్టు దగ్గరకు తీసుకువచ్చింది కాకి. వారు చూస్తూండగా ముక్కున ఉన్న రాకుమార్తె నగను చెట్టు మొదలు నున్న పాము పుట్టలో జారవిడిచింది. జరిగింది చూసేందుకు చెట్టుకొమ్మ పట్టుకుని నిలుచుంది. ఎప్పుడయితే రాకుమార్తె నగ పాముపుట్టలో పడగా చూశారో అప్పుడు ఆ పుట్టను తవ్వసాగారు భటులు. ఆయుధాలతో పుట్టను పెళ్ళగించసాగారు. తప్పనిసరి పరిస్థితిలో పుట్టలో పాము బయటికి వచ్చింది. ప్రాణభయంతో తప్పించుకోజూసింది. వీలుకాలేదు. భటులను కాటేసేందుకు ప్రయత్నించింది. చూస్తూ వూరుకుంటారా భటులు? చేతిలోని ఆయుధాలతో పాముని ముక్కలు ముక్కలు చేశారు. చంపేశారు దాన్ని. తర్వాత పుట్టలోని హారాన్ని చేజిక్కించుకుని వెళ్ళిపోయారు అక్కణ్ణుంచి. ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పాముని ఆనందంగా చూసింది కాకి జంట. పీడ వదిలిపోయిందని సంతోషించింది.’’ కథ ముగించాడు దమనకుడు. కరటకుడు కళ్ళు పెద్దవి చేసుకుని దమనకుణ్ణి గొప్ప చూడసాగాడు.‘‘శారీరకంగా బలవంతులం కానప్పుడు బుద్ధిబ,లాన్ని ఉపయోగించాలి. ఉపయోగించి కష్టాల నుంచి గటె ్టక్కాలి. బుద్ధిబలం ఉన్నవాడికి తిరుగులేదు.’’ అన్నాడు దమనకుడు.

Responsive Footer with Logo and Social Media