కాకి కుట్ర



నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు. దగ్గరకు చేరదీయకూడదు. చేరదీస్తే కష్టాలు తప్పవు. అన్నాడు కరటకుడు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే! శిక్షించకపోతే మనకే ప్రమాదం. అని సలహా కూడా ఇచ్చాడు పింగళకుడికి. జవాబు కోసం చూడసాగాడు. దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం వళ్ళంతా చెవులు చేసుకున్నాడు.‘‘సంజీవకుడు నా మంత్రి. మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా?’’ అడిగాడు పింగళకుడు. జవాబు ఆశిస్తే, రాజు దగ్గర నుంచి ప్రశ్న వచ్చిపడింది. సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడూ, దమనకుడూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.‘‘ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు. జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినయినా శిక్షించడం తగదు. శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప, వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు గౌరవం పోతుంది. తర్వాత నాశనం అయిపోతాం.’’ అన్నాడు పింగళకుడు.

నిజమే! రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక, దమనకులు.‘‘అందుకని ఓ పని చేద్దాం. సంజీవకుని దగ్గరకి దమనకుణ్ణి పంపుదాం. పంపించి, చేసిన రాజద్రోహం అతని ద్వారా సంజీవకునికి తెలియజేద్దాం. రాజు కాదనకున్నవారిని చేరదీయడం తప్పు, పాపం అని హెచ్చరిద్దాం. రాజుగారు కోపంగా ఉన్నారని, మండిపడు తున్నారని, అయినా తప్పు ఒప్పుకుని, రాజుగారి కాళ్ళ మీద పడితే క్షమిస్తారని చెప్పి చూద్దాం. తప్పొప్పు కున్నాడూ, క్షమించమని అడిగాడూ తొలితప్పుగా క్షమించి వదిలేద్దాం. ఒప్పుకోలేదూ అప్పుడు శిక్షిద్దాం.’’ అన్నాడు పింగళకుడు.‘‘బాగుంది మహారాజా! మీరు చెప్పినట్టుగానే చేద్దాం.’’ అన్నాడు కరటకుడు. సంజీవకుని దగ్గరకి దమనకుణ్ణి బయల్దేరమన్నాడు. బయల్దేరాడు దమన కుడు. సంజీకుణ్ణి చేరుకున్నాడు. వస్తోన్న దమనకుణ్ణి అల్లంత దూరం నుంచి చూసి, ఆనందపడ్డాడు సంజీవకుడు. ‘రా రా’ అంటూ ఆహ్వానించాడు.‘‘విషయాలేంటి మిత్రమా’’ అడిగాడు. దమనకుడు మాట్లాడలేదు. బాధగా చూడసాగాడు.‘‘ఏమయింది మిత్రమా? ఎందుకలా ఉన్నావు?’’‘‘ఏం చెప్పమంటావు? అన్నీ బాధలే! రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కాని, కాదు. దుఃఖం. పెను దుఃఖం.’’ అన్నాడు దమనకుడు.

రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడడంతో బెదిరిపోయి, రాజుగారి అనుచరులు అక్కడెవరయినా ఉన్నారేమోనని, ఉంటే ప్రమాదమని అటూ ఇటూ చూశాడు సంజీవకుడు. అనుచరులు ఎవరూ లేరుగాని, రాజుగారికి ఇష్టంలేని కాటక పాటకులు ఉన్నారక్కడ. వారిని ఎర్రగా చూశాడు సంజీవకుడు. అంతే! కాటక పాటకాలు దూరంగా వెళ్ళి నిలుచున్నారు.‘‘అవెందుకు ఇక్కడ తిష్ట వేశాయి?’’ అడిగాడు దమనకుడు.‘‘నాకేం తెలీదు. ఇప్పుడే చూశాను వాటిని.’’ అన్నాడు సంజీవకుడు.

‘‘నువ్వేమో ఇప్పుడే చూశానంటున్నావు. రాజుగారేమో, వాళ్ళతో నీకెప్పటినుంచో స్నేహం అంటున్నాడు.’’‘‘అవునా!’’ ఆశ్చర్యపోయాడు సంజీవకుడు.‘‘నువ్వు ఆ కాటక పాటకాల్ని చేరదీశావని, వాటిని అంటిపెట్టుకుని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరు చెప్పారో చెప్పారు. నమ్మేశాడతను.’’లేదు లేదన్నట్టుగా చూశాడు సంజీవకుడు.‘‘పనిమాలా రాజుగారి శత్రువుల్ని చేరదీస్తావా? ఏమయింది నీకు? దీనికిప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా?’’‘‘ఏమంటున్నారు?’’‘‘నిన్ను బాగా అసహ్యించుకుంటున్నారు. నీతో ఎవ రూ మాట్లాడకూడదంటున్నారు. మాట్లాడితే చంపేస్తానంటున్నారు.’’‘‘అయ్యబాబోయ్‌’’‘‘నిజం. నీకీ విషయాలన్నీ చెప్పి, నిన్ను వెంట పెట్టుకుని రమ్మని రాజుగారి ఆజ్ఞ. వస్తావా మరి’’ అడిగాడు దమనకుడు.ఏం మాట్లాడాలో తెలియడం లేదు సంజీవకుడికి. జ్వరం వచ్చినట్టుగా ఉందతనికి. భయపడిపోయాడు. గొంతు తడారిపోయింది.‘‘దేవుడా’’ అంటూ కళ్ళు మూసుకున్నాడు.

కాస్సేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు.‘‘నేనెప్పుడూ అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను. శత్రువుకి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. అలాంటిది నాకెందుకు చెడు జరుగుతోంది? నాకు శత్రువులు ఎవరున్నారు? నేనేం అపకారం చేశాను వారికి.’’క ళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు.‘‘రాజుకి ఎంత సేవ చేశాను. ఎన్ని సలహాలూ సూచనలూ చేశాను. చేసిన సేవంతా వృధాయేనా? ఎవరో ఏదో చెప్పారు. నమ్మేయడమేనా? సొంత ఆలోచనలంటూ రాజుకి ఉండవా?’’ బాధపడ్డాడు సంజీవకుడు.‘‘ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువుచేయకూడదు. చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న. ఎందుకు ప్రమాదమో సింహం-ఒంటె కథ చెప్పేవాడు. ఆ కథలో కాకి, నక్క, పులి కలిసి, కుట్ర చేసి, ఒంటెను సింహం చేత చంపిస్తాయి. బాధాకరం ఆ కథ.’’‘‘అవునా? ఏంటా కథ ? చెప్పవూ’’ అడిగాడు దమనకుడు. చెప్పసాగాడు సంజీవకుడు.

‘‘మలయపర్వతాన్ని ఆనుకుని ఓ అడవి ఉంది. ఆ అడవికి దర్పసారం అనే పేరు గల సింహం, రాజుగా ఉండేది. ఆ రాజుకి ఓ కాకి, ఓ నక్క, ఓ పులి మంత్రులుగా ఉండేవి. ఈ మంత్రులు అడవిలో తిరుగుతూంటే ఓ రోజు ఓ ఒంటె వాటి కంటబడింది.‘‘ఎక్కణ్ణుంచి ఇక్కడికి వచ్చావు?’’ అడిగాయి.‘‘నేనొక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని. అతను నా చేత ఇంతా అంతా కాదు, చెప్పలేనంత బరువు మోయించేవాడు. బరువు మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను. ఇక నా వల్ల కాదనిపించింది. అక్కణ్ణుంచి పారి పోయాను. ఇక్కడికి వచ్చాను.’’ అంది ఒంటె.‘‘మంచి పని చేశావు. లేకపోతే అంతలేసి బరువులు మోయిస్తాడా?’’ సమర్థించాయి.‘‘చూస్తూంటే మీ ముగ్గురూ మంచివాళ్ళలా ఉన్నారు. దయచేసి, మీతో పాటుగా ఈ అడవిలో నన్నూ తిరగనీయండి.’’

‘‘తిరగనివ్వడానికి మేమెవరం? మేమేం రాజులం కాదు. మంత్రులం.’’ అంది నక్క.‘‘నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడి మారాజు దర్పసారం, అదే మా సింహం నీకు అనుమతినివ్వాలి. ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం. నీ గురించి నాలుగు మంచిమాటలు కూడా చెబుతాం. తర్వాత నీ అదృష్టం. అనుమతి లభించిందీ కలిసి తిరుగుదాం. లేదూ, అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం.’’ అన్నది పులి.‘‘నువ్వేం భయపడకు. నీకు మేమున్నాం. మాతో రా’’ అంది కాకి.ఒంటె ఆనందానికి హద్దులు లేకపోయాయి. వాటి వెంట రాజు దగ్గరకు చేరుకుంది. నమస్కరించి నిలుచుంది.‘‘ఎవరు నువ్వు?’’ అడిగాడు రాజు. ఒంటె ఎవర న్నదీ వివరంగా చెప్పింది పులి.‘‘అలాగా! నీకేం భయం లేదు. ఈ రోజు నుంచీ ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే! ఈ అడవి మనది. నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ తిరుగు.’’ అన్నాడు రాజు. అభయమిచ్చాడు. ఒంటెకు పట్ట పగ్గాలు లేకపోయాయి. తెగ ఆనందించిందది.కొంతకాలం గడిచింది.ఒకరోజు తన మంత్రులు నలుగుర్నీ పిలిచి ఇలా అంది సింహం.‘‘ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. నీరసంగా ఉంటూంది. అడుగు తీసి అడుగు వేయలేక పోతున్నాను. వేటాడడం నా వల్ల కాదు. అందుకని...’’‘‘చెప్పండి మహారాజా! ఏం చెయ్యమంటారు?’’‘‘నా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి. ఏం చేస్తారో...ఎలా చేస్తారో చెయ్యండి.’’అమ్మో! ఇదేంటిది? ఇదెలా సాధ్యం? కంగారు పడ్డారు మంత్రులంతా.

‘‘మహారాజా! మా గురించి మీకు తెలియనిదేముంది? చిన్నప్రాణులం. ఉన్నామంటే ఉన్నాం. లేదంటే లేదు. మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే, మీరు తినగా వదిలేస్తే, ఆ వదిలేసిన దానిని తిని బతికేవాళ్ళం. మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా? అంత శక్తి మాకుందా?’’ అంది కాకి.‘‘లేదు, తెలుసు. కాని ఏం చేస్తాను. లేచి తిరగలేను. అందుకనే చెబుతున్నాను. నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది, మీకు దొరికిన మాంసం తీసుకుని రండి. అదే సర్దుకుంటాను. అర్థం చేసుకోండి.’’ అంది సింహం.

తప్పదిక. రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందేననుకున్నది మంత్రివర్గం. అడవిలోకి బయల్దేరింది. తలా ఓ దిక్కును ఎంచుకుని గాలించాయి. ఎక్కడా ఎవరికీ మాంసం దొరకలేదు.మధ్యాహ్నం అయింది. ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం.‘‘నీక్కూడా చిన్న మాంసం ముక్క దొరకలేదా?’’ కాకిని అడిగింది నక్క.‘‘మీకే దొరకనప్పుడు నాకు ఎలా దొరుకుతుంది? బాగుంది నువ్వడగడం.’’ అంది కాకి. కోపం తెచ్చుకుంది.‘‘వూరుకో’’ సముదాయించింది ఒంటె.‘‘పాపం! ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు. మనమేదో తెస్తామని, పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలా వెళ్ళగలం? వట్టి చేతుల్తో వెళ్ళడం...నేను తట్టుకోలేను.’’ బాధపడింది నక్క.

‘‘ఇన్నాళ్ళూ రాజు వేటాడి తెస్తే మనం హాయిగా తిన్నాం. కడుపు నింపుకున్నాం. ఇప్పుడు రాజుకి అనారోగ్యం. లేవలేని పరిస్థితి. అడగక అడగక అడిగాడు, ఇంత మాంసం తెచ్చి పెట్టమని. తీసుకు రాలేకపోయాం. మనమేం మంత్రులం. సిగ్గు సిగ్గు.’’ అంది కాకి.పులి, ఒంటె నిస్సహాయంగా చూస్తూ నిలుచున్నాయి.‘‘మీరేమీ మాట్లాడరేంటి?’’ అడిగింది నక్క.‘‘ఏం మాట్లాడమంటావు? ఏం చేయలేని పరిస్థితి. బాధపడుతున్నాం.’’ అన్నది పులి. ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది. చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి. తినడానికి వెళ్ళింది దానిని. అదే అవకాశంగా కాకి, నక్క-పులితో రహస్యంగా ఇలా అంది.‘‘మనం చేస్తున్నది తప్పూ, పాపం అనుకోకపోతే అదిగో...ఆ ఒంటెను చంపితే ఈరోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే! రాజుగారు ఆరారా తినగా మిగిలింది మనం ముగ్గురం ఓ నాలుగు రోజులు తినొచ్చు. ఏమంటారు?’’కాకి ఆలోచనకి నక్క-పులి భయపడ్డంతగా వణికిపోయాయి.