కాకి - హంస
చెరువులో చంద్రబింబం ఎర్రగా కనిపించింది. చంద్రుడు ఎర్రగా ఉండడాన్ని చూసి, ఎందుకలా ఉన్నాడన్నట్టుగా విజయుణ్ణి చూశాడు ఏనుగుల రాజు. చెబుతానుండు అన్నట్టుగా సైగ చేసి, ఏనుగుతో ఇలా అంది కుందేలు.‘రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు పలకరించడం కూడా ప్రమాదమే! చంపేసినా చంపేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ. నీ మానాన నువ్వు వెళ్ళిపో’‘మరి క్షమించమని అడగలేదు.’‘ఓ నమస్కారం పెట్టు, చాలు! నమస్కారం పెట్టి వెళ్ళిపో! తర్వాత సంగతి నేను చూసుకుంటాను. తప్పయిపోయిందని, క్షమించమన్నారని చెబుతాను. వింటాడు. నేనున్నాను కదా, నాకు ఎలా చెప్పాలో తెలుసు. అన్నట్టు అసలు సంగతి, మీరు మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకండి. వచ్చారో, ప్రాణాలు పోతాయి. తర్వాత మీ ఇష్టం.’ అన్నాడు విజయుడు.‘రాము, మాటిస్తున్నాను.’ అన్నాడు ఏనుగుల రాజు. చెరువులోని చంద్రబింబానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత తన మందను తీసుకుని, ఆ ప్రాంతాన్నే వదిలేశాడు.’ కథను ముగించాయి పక్షులు.
‘దాహంగా ఉంది’ అన్నాను.‘దాహం సంగతి తర్వాత. ముందు ఈ కథలో నీతి ఏమిటో తెలిసిందా?’ అడిగాయి. తెలియదని తలూపాను. ఇలా చెప్పాయి.‘మీ రాజులాంటి, హంసలాంటి మెత్తని వాణ్ణీ, బలహీనుణ్ణీ కొలిచే కంటే బుద్ధిబలంతో యుక్తితో జీవించడం మేలు, తెలుసుకో’‘సరే’నన్నట్టుగా తలూపాను. అయినా వదల్లేదు. మిమ్మల్ని తెగ తిట్టాయి. తిట్ల వర్షం కురిపించాయి. గాయాలయినా, దాహంగా ఉన్నా మిమ్మల్ని తిడుతోంటే తట్టుకోలేకపోయాను.‘మా రాజేమీ పిరికివాడు కాదు. శత్రువుల్ని చీల్చి చెండాడడంలో అతన్ని మించిన వారు లేరు. మా రాజు సంగతి మీకు తెలియదు. తెలియనప్పుడు ఆయన్ని గురించి ఇలా మాట్లాడడం తప్పు. మాట్లాడొద్దు.’ అన్నాను. వింటాయా? నన్ను కట్టి పడేసి, కొట్టి, బాగా హింసించాయి. వళ్ళంతా పచ్చి పుండయిపోయింది. దాహం. అయిపోయాను. చచ్చిపోయాను అనుకున్నాను. కొన వూపిరితో ఉన్నాను. అలాంటి నన్ను తీసుకుని వెళ్ళి చిత్రవర్ణుడి ముందు పడేశాయి. నెమలిరాజు నన్ను ఎగాదిగా చూశాడు. తర్వాత ‘ఎవడు వీడు’ అన్నట్టుగా సైనికుల్ని చూసాడు.
‘పాపాత్ముడు మహారాజా! మనదేశానికి వచ్చి మనల్ని, ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలన్నాడు. ఎవడి పాపాన వాడే పోతాడని మీరంటారేమో! అలా అనవద్దు. వీణ్ణి క్షమించకూడదు. చంపేద్దాం అనుకున్నాం. కాని, పద్ధతి ప్రకారం మీకో మాట చెబుదామని తీసుకొచ్చాం. చెప్పండి మహారాజా, చంపేయమంటారా?’అడిగాయి పక్షులు. అంతంత ముక్కులతో మీద పడబోయాయి.‘ఆగండాగండి’ వారించాడు చిత్రవర్ణుడు.‘ఎవడు వీడు? ఎక్కణ్ణుంచి వచ్చాడు?’ అడిగాడు.‘వీడి పేరు దీర్ఘముఖుడు. కర్పూరద్వీపం నుంచి వచ్చాడు. వీళ్ళ రాజు హిరణ్యగర్భుడు.’ చెప్పాయి.‘మీ మంత్రి పేరు?’ నన్ను అడిగిందో కొంగ. దాని పేరు దూరదర్శి. అది ఆ రాజ్యానికి మంత్రిట!
‘మా మంత్రి పేరు సర్వజ్ఞుడు. చక్రవాకపక్షి. మంచి అనుభవం కలవాడు. ధర్మజ్ఞుడు. వీరుడు, ప్రతిభాశాలి.’ చెప్పాను. ఇంతలో ఓ చిలుక కల్పించుకుంది. దాని పేరు అరుణముఖుడు. ఆ రాజ్యానికి అది సైన్యాధ్యక్షుడట!ఇలా అంది చిత్రవర్ణుడితో.‘రాజా, ఆ కర్పూరద్వీపం మన జంబూద్వీపంలోని భాగమే! అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి మన రాజ్యంలో. మీకు తెలుసో తెలియదో ఆ రాజ్యం మనదే! హిరణ్యగర్భుడు మన సామంతుడు. కప్పం కట్టాలి. ముందు ఓ దూతని పంపించి, కప్పం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించండి.’‘అవును మహారాజా, ఆజ్ఞాపించండి.’ అన్నాడు దూరదర్శి.‘పన్నులు వసూలు చేయడంలోనూ, పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రాహ్మణుడికి అసంతృప్తీ, రాజుకి తృప్తీ పనికిరావు. ఏదో రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. శత్రువుల్ని కాలి కింద పెట్టి అణగదొక్కాలి.’ అన్నాడు అరుణముఖుడు.
‘అవును మహారాజా! సైన్యసమేతంగా వెంటనే వెళ్ళి కర్పూరద్వీపాన్ని ఆక్రమించండి.’ అని అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు దూరదర్శి.‘ముందు దూతను పంపించండి. మను గురించి తెలియజేయండి. హిరణ్యగర్భుడు మాట విన్నాడా సరేసరి.వినలేదూ యుద్ధం తప్పదు. మరణమూ తప్పదు.’‘అలాగే’ అన్నాడు చిత్రవర్ణుడు. మెచ్చుకోలుగా దూరదర్శిని చూశాడు.‘‘దూత బయల్దేరి వస్తున్నాడా?’’ అడిగాడు హిరణ్యగర్భుడు. ఆ అడగడంలో కోపంగాని, ఆవేశంగాని లేదు. మామూలుగా అడిగాడంతే!‘‘ఆ సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందీ సంగతి చూడండి మహారాజా! ఎంత మదం, ఎంత దుర్మార్గం, ఎంత దురాశ వాళ్ళది. అనర్థాలన్నిటికీ ఆశే మూలం. అవునా? కాదా? నాకు తెలిసి ఆశను జయించిన వాడే మనిషి. అదృష్టవంతుడంటే అతనే’’ అన్నాడు దీర్ఘముఖుడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు.‘‘దూతను పంపుదాం, మాట విన్నాడా సరే, లేదంటే యుద్ధం అంటూ దూరదర్శి అన్నాడు చూశారా, అప్పుడు నాకు బలే కోపం వచ్చింది. వచ్చి, చిత్రవర్ణుడితో ఇలా అన్నాను.
‘ చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు. వినే వాడికి ఓపిక ఉండాలి. అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు. వివేకంగా అందులో నిజానిజాలు ఆలోచించాలి. దున్న ఈనిందంటే దూడని కట్టేయమన్నాట్ట మునుపటికి ఎవరో! విషయం ఏమిటంటే యుద్ధం అంటూ చంకలు గుద్దుకోకండి. మా రాజు హిరణ్యగర్భుడు ఆషామాషీ కాడు. మహావీరుడు. అతన్ని గెలవడం చాలా కష్టం. మంత్రులకేం పోయింది. ఎన్నయినా చెబుతారు. రాజు మెప్పు కోసం మంత్రి అన్నవాడు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నోటికొచ్చింది వాగుతాడు. రాజు సాధ్యాసాధ్యాలు గుర్తించాలి. యుద్ధం అని ముందుకు తోస్తారు. పరిగెత్తావా, పోయేది నీ రాజ్యమే! ఈ మంత్రులదేముంది? కొత్తరాజు ఎదుట కొలువుదీరుతారు. మళ్ళీ మామూలే’ అన్నాను. నా మాటలకు చిత్రవర్ణుడు సన్నగా నవ్వాడు. నవ్వి ఇలా అన్నాడు.
‘పోయేది ఎవరి రాజ్యమో తేలిపోతుంది. ముందు నువ్వు మీ రాజ్యానికి వెళ్ళి, మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమను. నీతో పాటు మా దూతగా ఈ చిలుక, అరుణముఖుడు వస్తాడు.’‘మహారాజా’ గొల్లుమంది చిలుక.‘నేనీ మూర్ఖుడితో ప్రయాణం చెయ్యను. వాణ్ణి ముందు వెళ్ళమనండి. తర్వాత నేను వెళ్తాను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి.’ అంది అంతలోనే!‘ఎందుకలా అంటున్నావు?’ అడిగాడు చిత్రవర్ణుడు.‘ఎందుకంటున్నానంటే...శత్రువుతో ఎన్నడూ ప్రయాణం చెయ్యకూడదు. చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే! మంచివాడితో కలిస్తే పువ్వులతో పాటుగా దారమూ సువాసన అనిపించినట్టుగా మంచి గుర్తింపును పొందుతాం. అదే చెడ్డవాడితో కలిస్తే, ఇనుముతో కలిసిన నిప్పుకి కూడా సమ్మెట దెబ్బలు తప్పవన్నట్టుగా కష్టాల పాలవుతాం. ఇలాంటి వాడితో సాంగత్యం చేజేతులా చావుని తెచ్చుకోవడ మే! కాకి-హంస అని ఓ కథ ఉంది. ఆ కథలో హంసలా ముగిసిపోతాన్నేను.’ అన్నాడు అరుణముఖుడు.
‘ఏంటా కథ’ అడిగాడు చిత్రవర్ణుడు. అరుణముఖుడు చెప్పసాగాడిలా.ఉజ్జయినీనగర శివార్లలో ఓ రావిచెట్టు ఉండేది. ఆ చె ట్టు మీద ఓ కాకి, ఒక హంస గూడుకట్టుకుని ఉండేవి. ఒకరోజు ఓ బాటసారి వచ్చాడక్కడికి. ఎండన పడి వచ్చాడేమో, చెట్టు కింద చల్లగా ఉండడంతో నీడ పట్టున పడుకున్నాడు. అలసిపోయాడేమో, వెంటనే నిద్రపోయాడు. కాస్సేపటికి, నీడ తొలగిపోయింది. ఎండ చుర్రున అతని కళ్ళల్లో పడుతోంది. అది చూసింది హంస. మంచి నిద్రలో ఉన్నాడు. పాపం అనుకుంది. జాలి పడింది. ఎండ బాటసారి మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టింది హంస. పై కొమ్మ మీద కూర్చున్న కాకి, వళ్ళెరుగక నిద్రపోతున్న బాటసారిని చూసింది. కన్ను కుట్టింది దానికి. హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోనిస్తానా? చెడగొట్టనూ అనుకుంది. సరిగ్గా బాటసారి మొహాన పడేట్టుగా రెట్ట వేసింది. వెంటనే ఎగిరిపోయింది అక్కణ్ణుంచి.
దాని వల్ల కాకికి వచ్చే లాభమేమీ లేదు. కాకపోతే సరదా. దుర్మార్గుల ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి.మెలకువ వచ్చింది బాటసారికి. మొహాన వెచ్చగా పడ్డ రెట్ట తుడుచుకుంటూ పైకి చూశాడు. రెక్కలు సాచి కూర్చున్న హంస కనిపించింది. తన మీద రెట్ట వేసింది హంసేనని భావించాడు బాటసారి. కోపం కట్టలు తెంచుకుందతనికి. పక్కన ఉన్న విల్లు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడు. గురి చూసి కొట్టాడు. దెబ్బకి విలవిల్లాడుతూ హంస కింద పడింది. చచ్చిపోయింది. అయితే పాపిష్ఠి కాకి మాత్రం ‘పాపి చిరాయువు’ అన్నట్టుగా బతికిపోయింది.’’ కథ ముగించాడు అరుణముఖుడు.‘‘బాగుంది’’ నవ్వాడు చిత్రవర్ణుడు.‘‘ఈ కథలో కాకిలాంటి వాడు ఈ దీర్ఘముఖుడు. వీడితో ప్రయాణం అందుకే ప్రమాదం అంటున్నాను.’’ అన్నాడు అరుణముఖుడు.