కాకి- గుడ్లగూబ
కర్పూరద్వీపం, జంబూద్వీపంలో ఓ భాగం. అలాగే హిరణ్యగర్భుడు, చిత్రవర్ణుడికి సామంత రాజు. చక్రవర్తి చిత్రవర్ణుడికి, హిరణ్యగర్భుడు కప్పం కట్టాలి. కట్టకపోతే కయ్యానికి కాలు దువ్వినట్టేనని దూతగా వచ్చిన అరుణముఖుడు చెప్పాడు. తానెంత మాత్రం సామంత రాజుని కాదని, కప్పం కట్టనన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధానికి సిద్ధమన్నాడు. ఆవేశపడ్డాడు. అతని ఆవేశంలో ఆజ్యం పోశాడు నీలవర్ణుడు. దూత మీద కూడా విరుచుకు పడ్డాడు. మంత్రి సర్వజ్ఞుడు అది గమనించి, అతన్ని వారించాడు.మంట రగులుకుంది. నీలవర్ణుడు దానిని ఎగదోశాడు. ఇంకేం ఉంది? హిరణ్యగర్భుడు ఇలా అన్నాడు అరుణముఖుడితో.‘‘నన్ను చెప్పమన్నావు కదా, చెబుతున్నాను, విను. నేను చెప్పిన మాటలు, నిండు కొలువులో మీ రాజుకి గట్టిగా చెప్పు.’’‘‘తప్పకుండా మహారాజా! మీ మాట మీరు చెప్పండి.’’‘‘చిత్రవర్ణా! ఒళ్ళు కొవ్వెక్కి, మదించి నా రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు, కలలు కంటున్నావు. అవి కల్లలని తెలుసుకో! నీలాంటి చిత్రవర్ణులు కోటి మందయినా నా ముందు నిలవలేరు. కావాలనే కయ్యానికి కాలు దువ్వావు. కాలు విరిగిపోతుంది, జాగ్రత్త! బలాబలాలు చూసుకోకుండా, బరితెగించి మాట్లాడడం గొప్పకాదు. నీలాంటి అల్పులు మాటలకే పరిమితం, రేపు చేతలకొచ్చేసరికి, తోక ముడుస్తారు. నాతో యుద్ధంలో నీకు చావు తప్పదు. ఇది నిజం. ఇవే నా మాటలు. ఇలాగే చెప్పు’’ అన్నాడు హిరణ్యగర్భుడు.
‘‘అలాగే మహారాజా’’ అన్నాడు అరుణముఖుడు.‘‘ఇంకొక్క మాట! తప్పయిపోయిందని, క్షమాపణ చెప్పి, శరణు కోరితే కథే వేర ని చెప్పు. వెళ్ళు’’ అన్నాడు హిరణ్యగర్భుడు. అరుణముఖుడు వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. అతనికి కానుకలూ, పళ్ళూ, ఫలాలూ ఇచ్చి పంపాడు సర్వజ్ఞుడు. దూతని మంచి చేసుకోవడం, మచ్చిక చేసుకోవడం చాలా అవసరమని అతని తలచాడు.చిత్రవర్ణుణ్ణి చేరుకున్నాడు అరుణముఖుడు.‘‘చెప్పు, కర్పూరద్వీపం కబుర్లేమిటి?’’ అడిగాడు చిత్రవర్ణుడు.‘‘కబుర్లేమిటంటే..అదొక అద్భుతద్వీపం మహారాజా! దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఆ విషయాలు తర్వాత చెబుతాను. ముందు అసలు సంగతి చెబుతాను, వినండి. హిరణ్యగర్భుడు మీతో యుద్ధానికి సిద్ధమన్నాడు.’’ అన్నాడు అరుణముఖుడు.‘‘అవునా’’ ఆశ్చర్యపోయాడు చిత్రవర్ణుడు.
‘‘అవును మహారాజా! అయితే అతన్ని మనం యుద్ధంలో గెలవడం అతి కష్టం.’’‘నిజమా’ అన్నట్టుగా చూశాడు చిత్రవర్ణుడు.‘‘కష్టం అంటే కష్టమే కాని, గెలిచేందుకు అవకాశాలు లేకపోలేదు. మన మేఘవర్ణుడు, నీలవర్ణుడన్న పేరుతో హిరణ్యగర్భుడికి బాగా దగ్గరవుతున్నాడు. గెలిస్తే వాడి సాయంతోనే మనం గెలవాలి. దేవుణ్ణి తలచుకుని ఇక యుద్ధానికి సిద్ధం కావడమే తరువాయి. తర్వాత మీ ఇష్టం.’’ అన్నాడు అరుణముఖుడు.‘‘హిరణ్యగర్భుడు ఏమన్నాడింతకీ. ఆ మాటలు చెప్పు.’’ అడిగాడు చిత్రవర్ణుడు. తనతో హిరణ్యగర్భుడు అన్న మాటలు అక్షరం పొల్లుపోకుండా చెప్పుకొచ్చాడు అరుణముఖుడు. మంత్రి సామంతులందరూ వినేట్టుగా గట్టిగా చెప్పాడు. అంతే! చిత్రవర్ణుడు అంతెత్తున లేచాడు.
‘‘ఒక సామంత రాజుని, చక్రవర్తి శరణు కోరాలా? బాగా బలిసి మాట్లాడుతున్నాడు. యుద్ధం తప్పదిక. హిరణ్యగర్భుడి రాజ్యం నాకక్కర్లేదు. కాకపోతే వాడి మీద విజయం నాకు కావాలి. వాడి చావు నేను కళ్ళారా చూడాలి.’’‘‘శాంతించండి మహారాజా’’ మంత్రి దూరదర్శి కలుగజేసుకున్నాడు.‘‘శత్రువుని చంపేదాకా రాజన్నవాడు నిద్రపోలేడు. పైగా పౌరుష ప్రతాపాలతో ఉడికిపోతున్నాను. మీకు తెలీదు మంత్రిగారూ, పొంచి ఉన్న శత్రువును చంపే దాకా రాజుకి అన్నం కూడా రుచించదు.’’ అన్నాడు చిత్రవ ర్ణుడు. మంత్రి సామంతుల్ని ఓ కంట గమనించాడు. అంతా మవునంగా ఉన్నారు. ఎవరి కళ్ళల్లోనూ ఎరుపు జీర లు లేవు. ఎవరూ ఆవేశపడుతున్నట్టుగా కూడా లేరు. రాజుకది అశుభ సూచికం అనిపించింది. యుద్ధానికి సేవకుల్ని ప్రోత్సహించాలి. లేకపోతే మొదటికే మోసం అనుకున్నాడు చిత్రవర్ణుడు. ఇలా అన్నాడు.
‘‘యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనాలు, పోరు నష్టం, పొందు లాభం లాంటి మాటలు పట్టించుకోవద్దు. ఎప్పటికయినా చావు తప్పదు. ఆ చావుని మనం యుద్ధంలో ఆహ్వానిద్దాం. వీరస్వర్గాన్ని అలంకరిద్దాం. ఈ శరీరాలు నీటిబుడగలు. ఆశాశ్వితం. వీటి మీద మోజు పెంచుకోవద్దు. ముసలితనంలో మూలుగుతూ ఇంట్లో చావడం కంటే యుద్ధంలో చనిపోవడం మంచిది. యుద్ధానికి సిద్ధం కండి.’’‘‘అవును మహారాజా! విజయమో, వీరస్వర్గమో తేల్చుకుందాం. పదండి మహారాజా, పదండి.’’ ఒక్కపెట్టుగా సేవకులంతా అరిచారు.‘‘ఇదీ వీరత్వం అంటే’’ అనుకుని చల్లబడ్డాడు చిత్రవర్ణుడు. సన్నగా నవ్వుతూ అతన్ని సమీపించాడు దూరదర్శి. ఇలా అన్నాడతనితో.‘‘ఇలా అంటున్నాని మీరేమీ అనుకోకపోతే తొందరపడొద్దు మహారాజా! అన్ని వేళలా ఆవేశం పనికి రాదు. మనం శత్రువుల కంటే బలవంతులం అనుకున్నప్పుడే యుద్ధానికి సిద్ధమవ్వాలి. హిరణ్యగర్భుడేమీ సామాన్యుడు కాదు మహారాజా, అతనంటే ప్రజలు ప్రాణం పెడతారు. అతని కోసం ఎంతకయినా తెగిస్తారు. అలాంటి వాడితో యుద్ధం అంటే ఆలోచించుకోవాలి మనం. శత్రువు బలాన్ని అంచనా కట్టకుండా యుద్ధానికి దిగితే సింహం చేతికి చిక్కిన లేడిలా ఉంటుంది పరిస్థితి. ముందు వెనుకులు ఆలోచించుకుని మరీ అడుగు వెయ్యాలి. అంతేకాని...’’దూరదర్శి మాట పూర్తి కానేలేదు, భగ్గుమన్నాడు చిత్రవర్ణుడు.
‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మంత్రివి? నీకు తల పండింది కాని, బుద్ధి పండలేదు. యుద్ధానికి సిద్ధంకండని నేను చెబుతూంటే నువ్వేం చెబుతున్నావో నీకర్థం అవుతోందా? నిప్పుల మీద నీళ్ళు జల్లుతున్నావు నువ్వు. పిరికి మాటలు మాట్లాడుతున్నావు.’’‘‘మీ మేలుకోరే మాట్లాడుతున్నాను మహారాజా! మంత్రిగా ఇది నా ధర్మం. నా మాటలు మీకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. మీకు ఇష్టంగా ఉండే మాటలు మాట్లాడి, మిమ్మల్ని మోసం చెయ్యడం సులభం. కాని, అది నా వృత్తిధర్మం కాదు. మవునంగా ఉండడం కూడా స్వామి ద్రోహం అవుతుంది.’’ తల దించుకున్నాడు దూరదర్శి. అంతలోనే తలెత్తి ఇలా అన్నాడు మళ్ళీ.
‘‘మీరు ముమ్మాటికీ యుద్ధమే చేద్దామంటే కాదనేదెవరు మహారాజా! యుద్ధానికి అంతా సిద్ధమే! ఇదే సరయిన సమయం. శత్రువుని తక్కువ అంచనా వెయ్యకుండా, మన మొత్తం సైన్యాన్ని వెంటబెట్టుకుని, ఒక్కసారిగా దాడి చేద్దాం. చిన్నపామునయినా పెద్దకర్రతో కొట్టాలంటారు. అలా ఉన్న సైన్యాన్నంతా మనం వెంటబెట్టుకుని వెళ్ళడం మంచిది. శత్రువుకి సమయం ఇవ్వకూడదు. ఇస్తే బలగాల్ని బలోపేతం చేసుకుంటాడు. అందుకే వెంటనే దండెత్తడం మంచిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చెయ్యొద్దు, పదండి యుద్ధానికి.’’చిత్రవర్ణుడు ఆ మాటలకు పొంగిపోయాడు. మంత్రిని అభినందనగా దగ్గరకు తీసుకున్నాడు. యుద్ధసన్నాహాలు ప్రారంభించమన్నాడు. దూరదర్శి అందర్నీ యుద్ధోన్ముఖుల్ని చేశాడు. బలాలన్నీ బయల్దేరాయి. చిత్రవర్ణుడు సైన్యసమేతంగా మలయపర్వతం వరకూ ప్రయాణించి, అక్కడ విడిది చేశాడు.జంబూద్వీపానికి గూఢచారిగా వెళ్ళిన దీర్ఘముఖుడు, కర్పూరద్వీపానికి చేరుకున్నాడు. హిరణ్యగర్భుణ్ణి ఏకాంతంగా క లుసుకున్నాడు. విషయాలు చర్చించుకునే ముందు, మంత్రి సర్వజ్ఞుడు కూడా ఉండడం మంచిదనుకున్నారు. పిలిచారతన్ని. ముగ్గురూ సమాలోచనలు ప్రారంభించారు.
‘‘చిత్రవర్ణుని రహస్యాలు కొన్ని తెలిశాయి. చెబుతాను, వినండి.’’ అన్నాడు దీర్ఘముఖుడు. చెప్పసాగాడిలా.‘‘చిత్రవర్ణుడు మన రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నాడు. సైన్యసమేతంగా మలయపర్వతం దగ్గర విడిది చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మహారాజా మనం. ముఖ్యంగా మీరు కోటను విడిచి రావద్దు.’’‘‘ఇంకా’’ అడిగాడు సర్వజ్ఞుడు.‘‘జంబూద్వీపంలో చిత్రవర్ణుడంటే పడని ఓ పావురం ఉంది. దాన్ని మచ్చిక చేసుకుని, చాలా విషయాలు రాబట్టాను. మీకో తెలుసో లేదో మన ఆస్థానంలో చిత్రవర్ణుడి గూఢచారి ఒకడున్నాట్ట! ఎవరన్నదీ వివరాలు తెలియవు. మీరే తెలుసుకోవాలి. ఇకపోతే చిత్రవర్ణుడు యుద్ధానికి దిగడం అతని మంత్రి దూరదర్శికి ఇష్టం లేదు. అయితే రాజు చెప్పిన మీదట తప్పదు కాబట్టి, యుద్ధసన్నాహాల్లో పడ్డాడు. ఇది మనకు పనికొచ్చే ముక్క. దీని గురించి ఆలోచించండి.’’ అన్నాడు దీర్ఘముఖుడు.‘‘మళ్ళీ ప్రయాణం ఎప్పుడు?’’‘‘ఎక్కడికి?’’‘‘జంబూద్వీపానికి’’‘‘ఇక వెళ్ళే అవకాశం లేదు. మొన్ననో రోజు చిత్రవర్ణుని సేవకులు నన్ను గుర్తుపట్టి బంధించబోయారు. పారిపోయి వచ్చాను. ధవళాంగుడు అక్కడే ఉన్నాడు.’’ అన్నాడు దీర్ఘముఖుడు.సర్వజ్ఞుడు ఆలోచించసాగాడు. ఏం ఆలోచిస్తున్నదీ అంతుపట్టక, అతన్నే చూడసాగాడు హిరణ్యగర్భుడు.‘‘మహారాజా’’ అన్నాడు సర్వజ్ఞుడు.
‘‘చెప్పండి’’‘‘మన ఆస్థానంలో ఉన్న నీలవర్ణుడే చిత్రవర్ణుని గూఢచారి అని నా అనుమానం. వాణ్ణి చేరదీయడం ప్రమాదం. నాకు తెలిసీ, వాడు సింహళద్వీపం నుంచి రాలేదు. అన్నీ అబద్ధాలు చెప్పాడు. వాణ్ణి చూస్తోంటే వెనకటికి కాకిని నమ్మి, ప్రాణాలు పోగొట్టుకున్న గుడ్లగూబల కథ గుర్తుకొస్తోంది.’’ అన్నాడు సర్వజ్ఞుడు.‘‘ఏంటా కథ?’’ అడిగాడు హిరణ్యగర్భుడు. చెప్పసాగాడిలా సర్వజ్ఞుడు.‘‘దండకారుణ్యంలో ఓ పెద్ద మర్రిచెట్టుంది. ఆ చెట్టు కొమ్మల్లో కొన్ని వేల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కాకుల రాజు కూడా ఓ కొమ్మ మీద నివాసం ఉండేవాడు. అక్కడికి దగ్గరలోనే ఓ కొండ గుహలో ఓ గుడ్లగూబ ఉండేది. దాని పేరు ఉపమర్దనుడు. అది గుడ్లగూబలకు రాజు. ఈ ఇద్దరు రాజులకీ ఎప్పుడూ యుద్ధాలే! రెండు జాతులకీ పడి చచ్చేది కాదు.
ఒకనాటి రాత్రివేళ ఉపమర్దనుడు, మంత్రి సామంతులతో సమాలోచనలు జరిపి, హఠాత్తుగా మర్రిచెట్టు మీది కాకుల మీదికి దాడి చేశాడు. రాత్రికదా, పాపం! కాకులు మంచి నిద్రలో ఉన్నాయి. అదే అదనుగా గుడ్లగూబలన్నీ కాకిగూళ్ళను పడగొట్టి, కాకులను పొడిచి పొడిచి హింసించాయి. కొన్ని గాయాలపాలయి, పారిపోయాయి అక్కణ్ణుంచి. పారిపోయినవి పారిపోగా, కొన్ని వేల కాకులు ప్రాణాలు కోల్పోయాయి. అప్పటిక్కాని ఉపమర్దనుడు శాంతించలేదు.తెల్లారింది. గాయాలయి, పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయని అన్నానే కొన్ని కాకులు, ఆ కాకుల్లో కాకులరాజు కూడా ఉన్నాడు. ఆ రాజు కాకుల కోసం మర్రిచెట్టు దగ్గరకి వచ్చి చూశాడు. ఎక్కడ చూస్తే అక్కడ చెల్లాచెదురయిన గూళ్ళు, చచ్చి పడి ఉన్న కాకులూ కనిపించాయి. కన్నీళ్ళు ఆగలేదు రాజుకి. భోరున ఏడ్చాడు. పిల్లలు, పరివారం, మంత్రులు, సామంతులు వేలాదిగా గుడ్లగూబల దాడికి బలి అయిపోయాయి. దిక్కుతోచలేదు. ముక్కును నేలకు రాస్తూ తలొంచుకున్నాడు.