జింక-నక్క కథ



స్నేహితులంటే ఇలా ఉండాలి. చిత్రగ్రీవుడు, హిరణ్యకులే అసలు సిసలు స్నేహితులుఅనుకున్నాడు లఘు పతనకుడు. హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నాడు. చాటు నుండి తప్పుకుని, హిరణ్యకుని కలుగుదగ్గరకు చేరుకున్నాడు.‘‘హిరణ్యకా’’ పిలిచాడు.మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా? అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు.‘‘నువ్వు మామూలు వాడివి కాదు. మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలని ఉంది. నీతో తిరగాలని ఉంది. మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా! బయటికి రా! మాట్లాడుకుందాం’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అసలు ఎవరు నువ్వు’’ కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతడు.‘‘నువ్వెవరో తెలీదు. నీ రూపు రేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చేయడం ఎలా’’పాపం! భయపడుతున్నాడనుకుని, సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు.‘‘నేనో కాకిని. నా పేరు లఘుపతనకుడు’’కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాటనుకున్నాడతను.‘‘అమ్మో! నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి, చంపి తినడం. మీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే! వద్దు! నీకూ నాకూ స్నేహం కుదరదు. వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అది కాదు, నేను చెప్పేది విను.

ముందు బయటికి రా.’’‘‘చచ్చినా రాను. బయటికి వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వూ నేనూ ఏ రకంగానూ సమానులం కాము. అందుకని ఎందుకొచ్చిన గొడవ, మనిద్దరికీ స్నేహం కుదరదుగానీ వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు.‘‘తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక, నక్కతో స్నేహం చేసింది. చేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా’’‘‘తెలీదు’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అయితే విను, చెబుతాను’’ అంటూ కథ చెప్ప సాగాడు హిరణ్యకుడు.జింక-నక్క కథఅనగనగా మగధదేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింకా, ఓ కాకీ ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం. కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్ట పట్టాలేసుకుని తిరిగేవవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలిసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి. ఆరోగ్యంగా ఉంది. ఇకనేం! ఎక్కడ పడితే అక్కడికి చె ంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తోంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా! జింక అంటే ఇది కదా! ఎంత చక్కగా బలిసి ఉందో! తింటే మహా రుచిగా ఉంటుంది. తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని, జింక చెంతకు చేరిందది.

‘‘బాగున్నావా మిత్రమా’’ అడిగింది.ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.‘‘మిత్రమా! ఇదెక్కడి పిలుపు’’ అడిగింది.‘‘నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు’’ అంటూ పరుగెత్తబోయింది.‘‘ఆగాగు’’ అంది నక్క. ఆగింది జింక.‘‘నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. ‘నా’ అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను.’’ అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది. ‘అయ్యో పాపం’ అనిపించింది జింకకి.‘‘తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేనిఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు.’’ అంది నక్క.జింక పొంగిపోయింది.‘‘నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరి తనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం’’ అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.‘‘సరదాగా మా ఇంటికి రావచ్చుగా’’ అడిగింది జింక.‘‘రమ్మంటే ఎందుకు రాను? పద’’ అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.‘‘ఎ..ఎయ్‌...ఎవరది’’ అరిచింది.‘‘నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.’’ అంది జింక. నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.‘‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక.‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.గుడ్డిగద్ద కథవెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది.

దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి. జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు. నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది.

ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను పెదాలకు రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది. మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద. తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.