జమదగ్ని ఆగ్రహం



ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు.

ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి " నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు. రాముడు " తండ్రీ ! ముందు నా తల్లిని బ్రతికించండి. తరువాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు.