ఇంద్రపాలితుడు



తెల్లగా తెల్లారింది. మంత్రి సామంతులు, సేవకులతో రాజు మర్రిచెట్టుదగ్గరికి చేరుకున్నాడు. ఊరి జనం కూడా వింత చూసేందుకు ఎగబడ్డారు. గుంపులు గుంపులుగా పోగయ్యారు. బాధగా సుదర్శనగుప్తుడు రాజు ముందు వంగి నిల్చుని ఉంటే, ధైర్యంగా బోరవిరుచుకుని నిలబడి ఉన్నాడు నందిగుప్తుడు. అతనికి ఎలాంటి భయమూ లేదిప్పుడు. అనుకున్నది జరిగి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ఇలా అన్నాడు, ‘అడగండి మహారాజా! చెట్టుని సాక్ష్యం చెప్పమనండి.’

‘ముందు, జరిగిందంతా చెట్టుకి వివరించండి,’ ఆజ్ఞాపించాడు మహారాజు.

‘అక్కర్లేదు మహారాజా! టూకీగా చెబితే చాలు,’ అన్నాడు నందిగుప్తుడు. జరిగిందంతా టూకీగా చెప్పాడు చెట్టుకి. ‘ఇప్పుడు అడగండి మహారాజా’ అన్నాడు.

‘ఈ ఇద్దరు మిత్రులూ ఇక్కడ...నీ కింద దాచి పెట్టిన డబ్బు ఏమయింది? ఎవరు దొంగిలించారు? నిజం చెప్పు?’ చెట్టుని అడిగాడు మహారాజు. గాలికి ఆకులు గలగలలాడే కాని, సమాధానం లేదు.

‘చెట్టుతల్లీ నిజం చెప్పు’ రెట్టించాడు మహారాజు. అయినా సమాధానం లేదు. కోపం వచ్చింది నందిగుప్తుడికి. ‘నిన్నే! నిజం చెప్పు’ గట్టిగా గద్దించాడు నందిగుప్తుడు.

‘లేకపోతే...’ అని బెదిరించాడు. దాంతో అప్పుడు చెట్టుతొర్రలో దాగుని ఉన్న నందిగుప్తుని ముసలి తండ్రి ఇలా పలికాడు. ‘ఆ డబ్బంతా సుదర్శనుడు దోచుకుని పోయాడు. ఓ అర్థరాత్రి వచ్చి పట్టుకుని పోయాడు.’

వినవచ్చిన ఆ మాటకి, మంత్రి సామంతులు, సేవకులతో సహా మహారాజు ఆశ్చర్యపోయాడు. చెట్టే మాట్లాడిందని వింతపడ్డారు. సుదర్శనుడు నమ్మలేకపోయాడు. తప్పుని తన మీద నె డుతూన్న చెట్టుని సంశయంగా అనుమానంగా చూశాడు.

‘మోసం మహారాజా! చెట్టేమిటి? సాక్ష్యం చెప్పడం ఏమిటి? నమ్మకండి మహారాజా, ఈ సాక్ష్యాన్ని నమ్మకండి,’ గొల్లుమన్నాడు సుదర్శనుడు.

‘చెట్టు సాక్ష్యం చెప్పింది. అంతా విన్నాం కూడా. విన్నదాన్ని నమ్మవద్దంటావేమిటి?’

‘అదీ.. అది అబద్ధం మహారాజా! మీరు అనుమతి ఇస్తే ఈ సాక్ష్యం బండారం బయటపెడతాను.’ చేతులు జోడించాడు సుదర్శనుడు.

‘ఏం బయటపెడతావు? ఏమన్నారు? చెట్టు సాక్ష్యం చెప్పింది. నీకు శిక్ష తప్పదు,’ అన్నాడు నందిగుప్తుడు.

‘అవును. తప్పదు,’ అన్నారు మంత్రి సామంతులు.

‘మహారాజా,’ రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు సుదర్శనుడు. ‘నాకో అవకాశం ఇవ్వండి. ఈ చెట్టు సంగతి చెబుతాను. నాకెందుకో ఇదంతా నాటకం అనిపిస్తోంది,’ అన్నాడు.

‘సరే, తేల్చుకో’ అన్నాడు మహారాజు. అన్నదే ఆలస్యం, సుదర్శనుడు చకాచకా చెట్టెక్కాడు. ప్రతికొమ్మనీ, ఊడనీ నిశితంగా పరిశీలించాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. చేయని తప్పుకి శిక్ష తప్పదనిపించింది. బాధగా చెట్టు దిగాడు. చిన్న ఆశ. చెట్టు వెనుకగా నడిచాడు. తొర్ర కనిపించిందక్కడ. చీమలూ పురుగులూ తొర్రని అంటిపెట్టుకుని తిరుగుతున్నాయి. ఎవరూ ఉండే అవకాశం లేదు. ఉంటే? అనుకున్నాడు. తొర్రలో చేయి పెట్టి వెతికాడు. చేతి మీద చీమలు కుడుతున్నా, పురుగులు పాకుతున్నా పట్టించుకోలేదు. ఇంకా ఇంకా లోపలికి జొనిపి చేత్తో వెతుకుతూన్నే ఎవరిదో శరీరం తగిలింది. అంతే! గట్టిగా కేకేశాడు.

‘రా! బయటికి రా! లేకపోతే రాజుగారి సైన్యంశూలాలకి బలైపోతావు.’

‘మహాప్రభో,’ అంటూ రాలేక రాలేక తొర్రలోంచి తొంగి చూస్తోంటే, నందిగుప్తుడి ముసలి తండ్రిని సేవకులే గట్టిగా బయటికి లాగారు. తొర్రలో ఊపిరి ఆడక, చీమలు కుట్టికుట్టి చంపడంతో సగం చచ్చిన ఆ తండ్రి, అందరి ముందూ దోషిలా నిలబడలేక, ఆ బాధతో పూర్తిగా ప్రాణాలు కోల్పోయాడు.

‘నాన్నా’ అంటూ నందిగుప్తుడు, తండ్రి శవమ్మీద పడి రోదించసాగాడు. నిజం నిలకడ మీద తేలింది. సుదర్శనుడి తప్పు లేదని తేలిపోయింది. తప్పంతా నందిగుప్తుడిదేనని ఋజువయింది. దాంతో దాచిపెట్టిన ఇద్దరి ధనాన్నీ సుదర్శనుడికే ఇప్పించి, చేసిన తప్పునకు శిక్షగా నందిగుప్తుణ్ణి ఉరి తీశారు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడు పన్నెత్తి మాట్లాడలేదు. కరటకుడు ఇంకా ఏం చెబుతాడోనని చూస్తున్నాడు.

‘అయింది’ అన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇలా అడిగాడు. ‘ఇనుము ధర బాగా పెరిగిందని విన్నాను. వూరిలోకి వస్తోంటే మన వ్యాపారులంతా చెప్పారు. మన

సరుకు అమ్మేశావా?’

జవాబు లేదు ధనగుప్తుడు దగ్గర్నుంచి. పైగా విచారంగా ముఖం పెట్టాడు. ‘ఏమయింది మిత్రమా?’ ఆందోళన చెందాడు ఇంద్రపాలితుడు.

‘ఏం చెప్పమంటావు? నీ అరవై బారువుల ఇనుమూ, నా వంద బారువుల ఇనుమూ రెండూ కలిపి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్ననే, నిన్నంటే నిన్ననే నూట యాభై బారువుల ఇనుము కావంటూ వచ్చారు కొంతమంది. ధర బాగానే చెప్పాను. ఒప్పుకున్నారు. ఆనందంగా గిడ్డంగి తాళం తీశాను. తీరా చూస్తే అక్కడ ఇంత పిసరు ఇనుము కూడా లేదు.’

‘ఇంత ఇనుమూ ఏమయింది?’ ఊపిరి ఆడలేదు ఇంద్రపాలితుడికి. ‘తాళం తాళంగానే ఉంది. సరుకు మాయమయింది. ఏమయిందిని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది.’

‘ఏం తెలిసింది?’

‘గిడ్డంగిలో ఎలుకలు ఉన్నాయి. అవి నా ఇనుమునూ నీ ఇనుమూనూ తినేశాయి,’ అన్నాడు ధనగుప్తుడు.

ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. తర్వాత తేటగా ఆలోచించి, ధనగుప్తుడు తనని మోసం చేశాడని తెలుసుకున్నాడు. తగవు పడి లాభం లేదు. జాగ్రత్తగా తన సొమ్ము తాను సాధించాలి. అందుకు ఓర్పు అవసరం అనుకున్నాడు. ముఖంలో ఎలాంటి భావాన్నీ కనబరచలేదు. ‘బాధపడకు ధనగుప్తా! అలా జరగాల్సి ఉంది. జరిగిపోయింది. దాన్ని గురించి పదేపదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది అరవయ్యే, నీది వంద బారువుల ఇనుము పోయింది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. ధైర్యంగా ఉండాలి,’ అన్నాడు ఇంద్రపాలితుడు. తనను తాను సంబాళించుకుని, ధనగుప్తుణ్ణి ఓదార్చాడు. వెళ్ళిపోయాడక్కణ్ణుంచి. అప్పుడలా వెళ్ళిపోయినా అప్పుడప్పుడూ కలుస్తూ ధనగుప్తునితో స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు, ధనగుప్తునితో చదరంగం ఆడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో ‘మామిడిపళ్ళు! మామిడిపళ్ళు’ అంటూ వీధిలో నుంచి కేకలు వినవచ్చాయి.

మామిడిపళ్ళు అమ్ముతున్నారెవరో. ధనగుప్తుడు కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకా మామిడిపళ్ళు కావాలని మారాం చేసాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. ‘పద! నేను నీకు పళ్ళు కొనిపెడతాను’ అని ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకుని, వీధిలోనికి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే, వీధిలో పళ్ళు అమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చే లోపే మలుపు తిరిగి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు ఇంద్రపాలితుడు. తనూ మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచి, తర్వాత ఆ పిల్లాణ్ణి ఓ రహస్య ప్రదేశంలో దాచేసి తిరిగొచ్చాడు.

‘బాబు ఏడి?’ అడిగాడు ధనగుప్తుడు.

‘అదే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు,’ అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు.

‘ఏం జరిగిందయ్యా?’ ఆందోళన చెందాడు ధనగుప్తుడు.

‘ఏం జరిగిందంటే... బాబుని పట్టుకుని నేను పళ్ళు అమ్మేవాడి కోసం మలుపు తిరిగాను. పళ్ళవాడు కనిపించలేదుగాని, ఎక్కణ్ణుంచి వచ్చిందో ఓ పేద్ధ గెద్ద వచ్చింది. వచ్చి, నా చేయి పట్టుకుని ఉన్న బాబుని ఎత్తుకు పోయింది,’ అన్నాడు ఇంద్రపాలితుడు. కన్నీరు పెటు టకున్నాడు.

‘నా బాబుని ఎత్తుకుపోయినా బాగుండేది. నీ బాబుని ఎత్తుకుపోయింది. తట్టుకోలేని బాధ ఇది,’ అన్నాడు మళ్ళీ. కాళ్ళూ చేతులూ ఆడక రాయిలా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెబుతున్నదేదీ అతనికి వినిపించడం లేదు.