ఐదుగురు మిత్రులు



ఒక పేను ఎంతో కష్టపడి కంది చేను వేసింది. కందిపంట బాగా పడింది. ఇక కోత కోయవలసి ఉంది. ఒకరోజు ఒక దొంగ ఆ దారివెంట వెళ్తూ కందిచేను చూశాడు. దానిమీద కన్ను కుట్టింది. “ఈ చేను ఎవరిది?” అని అడిగాడు అక్కడ ఉన్న జనాన్ని. దానికి వాళ్ళు “ఇది పేను చేను” అని చెప్పారు. అందుకు దొంగ “ఓహో! అలా! ఐతే పేను నన్ను ఏం చేయగలుగుతుందిలే?” అని కందిచేనంతా కోసి బండిలో వేసుకుని వెళ్ళిపోయాడు.

పేను వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకుంది. తాను చాలా కష్టపడి పెంచిన చేనును దొంగ ఎత్తుకుపోయినందుకు చాలా బాధపడింది. ఎలాగైనా ఆ దొంగను చంపి తన పగ చల్లార్చుకోవాలనుకుంది. వెంటనే దొంగ ఇంటికి బయలుదేరింది.

పేనుకు దారిలో ఒక గుండ్రాయి ఎదురైంది. "పేను బావా! పేను బావా! ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది గుండ్రాయి. “నేను కష్టపడి పండించిన కందిపంటను ఒక దొంగ ఎత్తుకుపోయాడు. వాడిని చంపడానికి బయలుదేరాను” అని చెప్పింది పేను. దానికి గుండ్రాయి “ఐతే నీకు సాయంగా నేను వస్తాను పదా!" అంటూ పేను వెంట నడిచింది.

అలా అవి కొంతదూరం వెళ్ళగానే ఒక తేలు ఎదురయ్యింది. "పేను బావా! గుండ్రాయి బావా! ఎక్కడికీ బయలుదేరారు?” అని అడిగింది. పేను జరిగిన విషయమంతా వివరించింది. అది విన్న తేలు “నేను కూడా నీకు సాయంగా వస్తాను. పదండి" అంటూ బయలుదేరింది.

అవి మూడూ మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక పాము ఎదురైంది. "పేను బావా! గుండ్రాయి బావా! తేలు బావా! ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు” అని అడిగింది పాము. తాము ఎక్కడికి వెళ్తున్న సంగతి పేను పాముకు చెప్పింది. అది విన్న పాము "మీతో పాటు నేను కూడా వస్తాను” అంటూ వాటివెంట రాసాగింది.

ఇంకొంత దూరం వెళ్ళాక ఒక పులి ఎదురైంది. “ఏమిటీ అందరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికో!" అని అడిగింది. పేను జరిగిన విషయం చెప్పింది. “నీకు కీడు చేసిన దొంగను చంపడానికి నేనూ సాయంగా వస్తాను పదండి" అంటూ పులి కూడా వాళ్ళ వెంట నడవసాగింది.

అన్నీ కలిసి సాయంత్రం వేళకు దొంగ ఇంటికి చేరుకున్నాయి. పులి ఇంటి ముందు తలుపు ప్రక్కన నిలబడింది. గుండ్రాయి దూలం మీద కూర్చుంది. తేలు అద్దం వెనక నక్కింది. పాము పొయ్యిలో పడుకుంది. పేను దొంగ గెడ్డంలోకి వెళ్ళి కరవసాగింది.

దొంగ అద్దంలో గెడ్డాన్ని చూసుకుందామని అద్దం పట్టుకున్నాడు. వెంటనే తేలు కరిచింది. దొంగ “మంట మంట” అని ఎగురుతూ పొయ్యిలో కాలు వేశాడు. అక్కడున్న పాము కాలుకు కాటు వేసింది. దొంగ మరింత భయంతో బయటికి రాబోగా దూలం మీద గుండ్రాయి బలంగా అతని తలమీద పడింది. దొంగ తల పగిలింది. పరుగెత్తుకుంటూ బయటకు రాగానే తలుపు దగ్గర ఉన్న పులి అతన్ని తినేసింది. దొంగను చంపినందుకు అవన్నీ ఆనందించాయి.

Responsive Footer with Logo and Social Media