గర్వ భంగం
శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది.
“పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె గర్వం మరీపెరిగిపోయింది.
ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది.
“ఆమె గర్వం అణచాలి పండితుల గౌరవం కాపాడాలి” అని నిశ్చయించుకుని- ఒకనాడు సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డిమోపు పెట్టుకుని – ఆమె యింటిముందు “గడ్డిమోపండీ..గడ్డిమోపు-” అని అరవసాగాడు.
శ్రీవాణి యింట్లో కొన్ని ఆవులుండేవి. అందుచేత ఆమెతరచుగా పచ్చ గడ్డి కొనేది. అది తెలుసుకునే రామలింగడు అలా వేషమేసుకుని అరవసాగాడు. ఆమెకతని కేకలు విని మేడదిగి కిందకొచ్చి “ఏమయ్యా గడ్డిమోపెంతకిస్తావ్?” అని అడిగింది.
తన పాచిక పారుతూందని మనసులో సంతోషపడుతూ “పట్టెడు మెతుకులుపెడితే గడ్డిమోపిస్తాను” అన్నాడతను. అమాయకంగా. భలేమంచి చౌకటేరమూ(తక్కువ ధర)… మించిన దొరకదూ…” అని ఆనందపడిపోతూ “అలాగే పెడతాను మోపు పెరట్లో వెయ్యి” అంది. రామకృష్ణుడు మోపునిలోపల వేసి వచ్చి నిలబడ్డాడు. ఆమె పట్టెడన్నం ఆకుతో తెచ్చి అతనికివ్వబోయింది. రామకృష్ణుడది తీసుకోకుండా-“నేనడిగింది మెతుకుకాని అన్నం కాదు నీకు తెలిసిన పాండిత్యమింతేనా? ఈపాటిదానికేనా నీకంటే గొప్ప పండితులు లేరని గర్వంతో విర్రవీగిపోతున్నావు?, పట్టెడు మెతుకుకీ పట్టెడన్నానకీ తేడా తెలుసుకోలేని నీపాండిత్యమేం పాండిత్యం? ఇప్పుడు నీ ఓటమి నంగీకరిస్తావా? అని అడిగాడు. అతను రామకృష్ణకవి అని ఆమె గ్రహించి, సిగ్గుపడుతూ తన ఓటమినంగీకరించింది . ప్రకటించిన ప్రకారం అతనికి వెయ్యివరహాలూ యిచ్చేసింది. ఈ విషయం విని – శ్రీవాణికి గర్వభంగం చేసినందుకు రాయలవారితో సహ పండితలోకం పరమానందపడింది.