గడసరికోతి-సొగసరి మొసలి



బలవర్ధనుడు, క్రకచుడు స్నేహంగా ఉండడాన్ని గమనించిన ఒకానొక మొసలి, ఆ సంగతిని క్రకచుని భార్యకు తెలియజేసింది. వాళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారని ఉన్నదీ లేనిదీ కల్పించి చెప్పింది. దాంతో ఆమె గగ్గోలు పెట్టింది. తననీ, పిల్లల్నీ క్రకచుడు అనాథల్ని చేశాడని ఏడవసాగింది.మొసలి ఒకటి, తననీ, బలవర్థనునీ దూరంగా గమనించడాన్ని క్రకచుడు చూశాడు. అది, తన భార్య బంధువన్నది గ్రహించాడు. చాడీలు చెప్పడం దానికి బాగా అలవాటు. ఏం చెప్పిందో భార్యకు? ఎలా ఉందో ఇంటి దగ్గరి పరిస్థితి అనుకున్నాడు. ఎందుకయినా మంచిదని, కానుకగా బలవర్థనుడు ఇచ్చిన బోలెడు మేడిపళ్ళు పట్టుకుని, ఇంటికి బయల్దేరాడు. చేరుకున్నాడు ఇంటికి. అక్కడంతా చిందర వందరగా ఉంది. భార్యకు జ్వరమట! కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. మూలుగుతోంది. నోటి మాట లేదు. చుట్టూ బంధుగణం కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా క్రకచుని మీద ఇలా విరుచుకు పడ్డారు.‘ఏమయ్యా, నీకేమయినా బుద్ధి ఉందా? భార్యాబిడ్డల్ని పట్టించుకోవా? ఎప్పుడో వెళ్ళిన వాడివి, ఇప్పుడా తిరిగి రావడం? నువ్వు రాలేదని, నీ మీది భయంతో నీ భార్య, చూశావుగా, ఎలా మంచం పట్టిందో! మాట కూడా పడిపోయింది. ఎన్ని మందులు ఇప్పించినా రోగం నయం కావట్లేదు. బ్రతుకుతుందన్న ఆశ లేదు. ఏం చేస్తావిప్పుడు?’ఏం చేస్తాడు? భార్యను ఎలా బ్రతికించుకుంటాడు? అయోమయంగా చూశాడు క్రకచుడు.‘నీ భార్య బ్రతకాలంటే ఒకటే మార్గం ఉంది. పదే పదే అడిగితే వైద్యులు చెప్పిందొకటే! అదేమిటంటే...ఎక్కడయినా ఒక కోతి గుండెకాయ సంపాదించి, దాన్ని కోసి, పాలతో పాటుగా నాలుగు రోజులు పాటు పుచ్చుకుంటే బ్రతకుతుందన్నారు. లేకపోతే కష్టం అన్నారు. ఆలోచించు. కోతి గుండెకాయ కావాలి. నీ భార్య బ్రతకాలంటే దాన్ని నువ్వు సంపాదించాలి.’బంధుగణం ఒక్కమాటగా చెబుతూంటే చేష్టలుడిగిపోయాడు క్రకచుడు.

ఏం చేయాలో తోచలేదతనికి.భార్య బ్రతకాలంటే కోతి గుండెకాయ కావాలి. సంపాదించాలి దాన్ని. అదెక్కడ దొరకుతుంది? ఆలోచించసాగాడు. బాగా ఆలోచించిన మీదట ఉపాయం తట్టిందతనికి. మిత్రుడు బలవర్థనుణ్ణి ఎలాగయినా ఇంటికి రప్పించి, చంపితే, అతని గుండెకాయ భార్య వైద్యానికి సరిపోతుంది. బలవర్థనుణ్ణి ఇంటికి రప్పించాలనుకున్నాడు క్రకచుడు. మిత్రద్రోహానికి ఒడిగట్టడం ఇష్టం లేదు కాని, తప్పదు. భార్యను బ్రతికించుకోవాలంటే మిత్రద్రోహానికే కాదు, ఎలాంటి ద్రోహానికైనా పూనుకోవాలనుకున్నాడతను.టక టకా ఈదుకుంటూ ఈవతలి గట్టుకు చేరుకున్నాడు.

చెట్టు మీది బలవర్థనుణ్ణి చూశాడు. పలకరించాడు.‘ఏమయింది? వెళ్ళినవాడివి వెళ్ళినట్టే తిరిగొచ్చాశావు. ఇంటి దగ్గర ఓ వారం పది రోజులు ఉంటానన్నావు. ఉండకుండా ఎందుకొచ్చేశావు?’ బలవర్థనుడు అడిగాడు. జవాబుగా అబద్ధం చెప్పాడు క్రకచుడు.‘నేను ఇంటికి వెళ్తానంటే నువ్వు మేడిపళ్ళిచ్చావు చూడూ, వాటిని నా భార్య ఎంతో అబ్బురంగా తింది. తిని, బాగున్నాయని తెగ మెచ్చుకుంది. ఇంత మంచి పళ్ళు నీకెక్కడివి? అనడిగితే నువ్వు ఇచ్చావని చెప్పాను. మనిద్దరి స్నేహం గురించి కూడా చెప్పాను.’

‘ఏమంది అప్పుడు?’ అడిగాడు బలవర్థనుడు.‘అంత మంచి స్నేహితుణ్ణి ఒంటరిగా వదిలి వస్తావా? నీకసలు బుద్ధి ఉందా? అంది. వెళ్ళు. వెళ్ళి, వెంటనే మనింటికి తీసుకుని రా! విందు చేద్దాం అతనికి. వెళ్ళి తీసుకుని రాకపోయావో, నీతో నేను మాట్లాడను పో పొమ్మంది.’ అన్నాడు క్రకచుడు.ఆమె అభిమానానికి పొంగిపోయాడు బలవర్థనుడు. వెళ్ళాలని ఉవ్విళ్ళూరాడు. అంతలోనే నీరుగారిపోయాడు. దానికి కారణం నీరే!‘ఏంటలా అయిపోయావు?’ అడిగాడు క్రకచుడు.‘మీరు నీళ్ళలో ఉంటారు. నేనే మో చెట్టు మీద ఉంటాను. ఎలా రాను? నేను ఈదలేనుగా’‘ఆ సంగతి నేను ముందే ఆలోచించాను. మా ఇంటి దగ్గర పెద్ద దిబ్బ ఉంది. దాని మీద చెట్లున్నాయి వాటి మీద నువ్వు ఉండొచ్చు’ అన్నాడు క్రకచుడు.‘ఉండొచ్చు సరే, ఇప్పుడు రావడం ఎలాగ?’ అడిగాడు బలవర్థనుడు.

‘ఎలా అంటే...నువ్వు నా మీద ఎక్కి కూర్చో! నీళ్ళలో ఈదుకుంటూ నీకెలాంటి ప్రమాదం లేకుండా మా ఇంటికి తీసుకుని వెళ్తాను. వస్తావా?’‘ఎందుకు రాను? పద పద’ అన్నాడు బలవర్థనుడు. ఎగిరి క్రకచుని వీపు మీదికి దూకాడు. బయల్దేరాడు క్రకచుడు. మిత్రద్రోహానికి ఒడిగడుతున్నానని బాధగా ఉంది క్రకచునికి. దాంతో అతను మాట్లాడలేక మవునంగా ఉన్నాడు. గలగలా మాట్లాడే క్రకచుడు మవునంగా ఉండడం తేడా అనిపించింది బలవర్థనునికి. అడిగాడిలా.‘ఏమయింది మిత్రమా? ఎందుకంత మవునంగా ఉన్నావు? నిజం చెప్పు? మీ ఇంటి దగ్గరంతా క్షేమంగానే ఉన్నారు కదా?’‘అంతా క్షేమంగానే ఉన్నారు. కాకపోతే నా భార్యకే బాగోలేదు.’‘ఏమయింది?’‘జ్వరం’‘జ్వరమే కదా! జ్వరానికంత బాధపడితే ఎలా? ధైర్యంగా ఉండు.’ అన్నాడు బలవర్థనుడు.‘జ్వరమే కాని, ఒక పట్టాన తగ్గట్లేదు.’‘వైద్యునికి చూపించాల్సింది.’‘చూపించాను. బ్రతకడం కష్టమన్నాడు. పాపం, యమయాతన పడుతోంది.’ చెప్పాడు క్రకచుడు.‘ఇలాంటి పరిస్థితుల్లో నాకు విందేమిటయ్యా?ఇంటికి తీసుకుని వెళ్తున్నావు.’

‘నిన్ను...నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తున్నది విందుకి కాదు.’‘మరి’‘నా భార్య జ్వరం తగ్గాలంటే కోతి గుండెకాయ కావాలన్నాడు వైద్యుడు. దాన్ని నాలుగు రోజుల పాటు పాలతో పుచ్చుకుంటే బ్రతుకుతుందన్నాడు...’ తర్వాత ఇంకేదేదో చెబుతున్నాడు క్రకచుడు. వినపడట్లేదు బలవర్థనుడికి. అతని గుండెలు జారిపోయాయి.అమ్మో! ఎంత మోసం! తనని చంపడానికి తీసుకుని వెళ్తున్నాడు. చావు నుంచి తప్పించుకోవడం ఎలా?బలవర్థనుడు గట్టిగా ఆలోచించాడు. ఉపాయం తట్టింది. ఆందోళనగా అరిచాడిలా.‘కోతిగుండెకాయ కావాలా? ఈ మాట ముందెందుకు చెప్పలేదు.’‘చెబితే నువ్వు రానంటావేమోనని...’ నీళ్ళునమిలాడు క్రకచుడు.‘ఎందుకు రానంటాను. భలేవాడివే! ఇప్పుడు నీ భార్య బ్రతకాలంటే నా గుండెకాయ నీకు కావాలి. అంతేకదా?’‘అంతే అంతే’‘అయితే వెనక్కి పోదాం, పద! నీ మీద కూర్చుని ప్రయాణం కదా, నీకు బరువవుతుందని, నా గుండెకాయ చెట్టుకొమ్మకి తగిలించి వచ్చాను. పద, తెచ్చుకుందాం.’ అన్నాడు బలవర్థనుడు.

సర్రున క్రకచుడు వెనక్కి తిరిగాడు. పరపరమని ఈదుకుంటూ మేడిచెట్టు దగ్గరకి బలవర్థనుణ్ణి తీసుకుని వచ్చాడు. చెట్టు కనిపించడం ఏమిటి, ఒక్కదుటన చెట్టేక్కేశాడు బలవర్థనుడు. ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు క్రకచునితో అన్నాడిలా.‘దుర్మార్గుడా! నీతో స్నేహం చేసిన పాపానికి నా ప్రాణాలు తీద్దామనుకున్నావు. నీతో స్నేహం చేసి పొరపాటు చేశాను. తప్పు నాదే! అయితే అదృష్టం బాగుండి, బ్రతికి బయటపడ్డాను. నీకూ, నీ స్నేహానికో దణ్ణం. చాల్చాలు, వెళ్ళిక్కణ్ణుంచి.’అయినా క్రకచుడు కదల్లేదు. అప్పుడు ఓ కథ చెప్పాడు బలవర్థనుడు. తనని చంపబోయిన నక్క నుంచి తాబేలు ఎలా తప్పించుకున్నదీ ఇలా వివరించాడు.

‘అనగనగా ఓ నది. ఆ నదిలో ఓ తాబేలుండేది. ఓ రోజు మధ్యాహ్నం నదిలోంచి తీరానికి చేరి, అక్కడ చెట్టు నీడన పడుకుంది తాబేలు. సరిగ్గా అదే సమయానికి నీళ్ళు తాగుదామని నది దగ్గరకు వచ్చింది ఓ నక్క. నీళ్ళు తాగబోతూ చెట్టు కింద పడుకున్న తాబేలుని చూసింది.‘ఆహా! అదృష్టం! మంచి ఆహారం దొరికింది.’ అనుకుంది నక్క. పరుగున వచ్చి, తాబేలు మీద కాలు వేసింది. అదిమిపెట్టింది దాన్ని. అప్పుడు మెలకువ తెచ్చుకుంది తాబేలు.తాబేలు తలా, కాళ్ళూ, చేతులూ మెత్తగా ఉంటాయి. వీపు భాగం మాత్రం గట్టిగా రాచిప్పలా ఉంటుంది. ప్రమాదం పొంచి ఉన్నదని తెలిస్తే శరీరాన్నంతా చిప్పలోనికి లాక్కుంటుంది తాబేలు. అలా జాగ్రత్తపడుతుంది. ఆ స్థితిలో చిప్ప పగులగొట్టి, తాబేలుని తినడం ఏ జంతువు వల్లా కాదు.ఎప్పుడయితే తన వీపు మీద నక్క కాలు మోపి అదిమిందో, అప్పుడు, తాబేలు శరీరాన్నంతా లోపలికి లాక్కుంది. తిందామంటే తాబేలు ఏ భాగమూ కనిపించలేదు నక్కకి. నానారకాల ప్రయత్నాలూ చేసి అలసిపోయిందది. ఆ క్షణంలో తాబేలు ఇలా అంది.

‘ఎంత ఆశపడి వచ్చావో! ఎంత ఆకలిగా ఉన్నావో! నిన్ను చూస్తూంటే జాలి వేస్తోంది. నువ్వు నన్ను అదిమినప్పుడే నా ప్రాణాలు పోయాయి. నేను నీకు ఆహారం కావడం నేను చేసుకున్న పుణ్యం. అయితే నా వీపు మీద కాలుంచి, నువ్విలా అదిమినంత మాత్రాన లోపలి నేను నీకు చిక్కను. నేను చిక్కాలంటే నా వీపు మెత్తపడాలి. మెత్తపడాలంటే నన్ను నువ్వు నీళ్ళలో నానబెట్టాలి. అప్పుడు మెత్తపడి, నేను నీకు పండులా అందుతాను.’తాబేలు మాటలు నమ్మలేదు నక్క. తప్పించుకునేందుకు చేస్తూన్న ప్రయత్నం అని తెలుసుకుంది. అయినా తాబేలు మాటల్లో నిజం లేకపోలేదనిపించింది. రాచిప్ప మెత్తపడాలంటే నానబెట్టాల్సిందే అనుకుంది. మెల్లగా నీళ్ళలోకి లాకొచ్చింది తాబేలుని. పారిపోకుండా కాలు ఉంచి, కదలకుండా చేసింది. రెండు గంటలు గడిచింది. అయినా తాబేలు మెత్తబడలేదు. నక్కకి చిరాకు కలిగింది.