ఫుర్రెతో పుట్టిన బుద్ధి
పరమ పిసినారి జమీందారు సర్వారాయుడికి ఎప్పడైనా గుడికి వెళ్తే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వటం, దేవునికి కొబ్బరికాయ పగలకొట్టడం, పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వడం ఇష్టముండేది కాదు.
జమీందారు పిసినారితనం బాగా ఎరిగిన పూజారి సోమనాథశాస్త్రి ఆయనను నోరెత్తి ఏమి అడిగేవాడు కాదు.
ఓ మహాశివరాత్రి పర్వదినాన జమీందారు సర్వారాయుడు మొదట వ్యక్తిగా గుడికి రావడమే కాకుండా పూజారి శాస్త్రికి ఒక కానీ దక్షిణగా పళ్ళెంలో వేశాడు.
అంత చిన్న బోణితో మనసు బాధవడ్డ పూజారిశాస్త్రి "జమాందారుతో తమలాంటి గొప్పవారినుండి 'కానీ' దక్షిణగా స్వీకరించడం నాకు ఎంతో అవమానంగా వుంది! దయచేసి మరొక కానీ దక్షిణగా ఇవ్వండి!” అన్నాడు.
ఆ మాటలతో ఒళ్ళుమండిన సర్వారాయుడు "ఇంకొక కానీ ఇచ్చి మళ్ళీ రెండోసారి మిమ్మల్ని అవమానపరచటం నాకూ ఇష్టం లేధు" అంటూ ఇచ్చిన కానీ వెనక్కి తీసుకుని గుడి బయటకు నడిచాడు.