ఎత్తుకు పై ఎత్తులకి
ఐదున్నర సంవత్సరాల క్రితం లక్షరూపాయాల్ని ఫిక్స్డ్ డ్ డిపాజిట్ చేసిన రామనాధం గారికి ఆ రోజే రెండు లక్షలు చేతికొచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో "నాన్నా! ఇన్నాళ్ళు అద్దె ఇంట్లో వున్నాం. ఇప్పడీ డబ్బుతో మంచి ఇల్లు కటుకుందాం" అన్నాడు.
అందుకు తండ్రి చిరునవ్వు నవ్విఏం ఆ అద్దెఇల్లు బాగాలేదా?" అని ప్రశ్నించాడు! అలాగని కాదు నాన్నా! స్వంతింటికి అద్దింటికి తేడా లేదా? ఇంటి ఓనర్ ఖాళీ చేయ్ అంటే ఖాళీ చేయాలి. మనం తిన్నా తినకపోయినా నెల నెలా తప్పనిసరిగా అద్దె కట్టాలి. అద్దె కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ రంకెలేస్తాడు" అన్నాడు కొడుకు.
రామనాధం బుర్రగోక్కుంటూ "ఇల్లు కట్టాలంటే దాదాపు రెండు లక్షలు అవుతుంది. రెండు లక్షలకు నెలకు ఒక రూపాయి వడ్డీ వేసుకున్నా రెండు వేలవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇంటికి 500లు అద్దె కడుతున్నాం. అంటే -ఈ ఇంట్లోనే ఉంటూ రెండు లక్షలు డబ్బును బ్యాంక్లో వేస్తే నెలకు 1,500/-లు ఆదా "అవుతాయి. అర్థమైందా?" అన్నాడు. గోపీ మరేం మాట్లాడలేదు.
ఒకటవ తేది రాగానే ఇంటి ఓనర్ రామనాధం వద్ద అద్దె తీసుకుని "చూడండి రామనాథం గారూ! మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి" అన్నాడు.
పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం కంగారునుండి తేరుకుని, "ఇప్పుడేమైందండి! ఇల్లు ఖాళీ చేయమంటున్నారు... నెలనెలా సక్రమంగా అద్దె ఇస్తూనే వున్నాను కదా.! కావాలంటే మరో వంద అద్దె పెంచుకోండి. అంతేగానీ ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా?" అన్నాడు.
ఖాళీ చేయక తప్పదండి ఈ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్. ఏమిటి మీరంటున్నది? ఆశ్చర్యంగా అడిగాడు రామనాధం.
"ఈ ఇల్లువల్ల నేను చాలా నష్టపోయాను. ఇప్పుడిలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం రెండు లక్షలు కావాలి. రెండు లక్షలకు ఒక రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకు రెండు వేలవుతుంది. ఇప్పుడు మీరిస్తున్న అద్దె 500లు, అంటే నేను నెలకు 1,500/- నష్టపోతున్నాను. అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను అదే ధరకు మీరు కొన్నాసరే! ఒకవేళ కొనడం ఇష్టంలేకపోతే అద్దె రెండువేలు ఇచ్చినా సరే మీ ఇష్టం! తెల్ల్సిన వారు కనుక చెబుతున్నాను అన్నాడు.
రామనాధం బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఇతడికిన్ని తెలివితేటలెక్కడుంచి వచ్చాయబ్బా? అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రామనాథం మనోభావాల్ని గమనించిన ఓనర్ నవ్వుతూ "ఏమిటలా ఆలోచిస్తున్నారూ? నా బుర్ర పదునుగా ఆలోచించినందుకా? అది నా తల మహత్యం కాదు. మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకు జ్ఞానోదయమైంది" అన్నాడు .
తెలివి ఎవరి సొత్తు కాదు. అది ఒకరికే పరిమితం కాదు.