ఏనుగు మరియు పిచ్చుకల కథ
ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసమేర్పరచుకున్నాయి. ఆడ పిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది. ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు క్రింద నిలబడింది. ఆ ఏనుగు సేదతీరకుండా, తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది. చెట్టుపైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. పిచ్చుకలకు చావుతప్పి ప్రమాదానికి గురైన పనైంది. గుడ్లన్నీ పగిలి పోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది. పిచ్చుక ఏడుపు విని ప్రక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది. “మిత్రమా! ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది. నీ గ్రుడ్లను పగులకొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి” అన్నది వడ్రంగి పిట్ట.
“కొండంత ఏనుగుపై మేము ఎలా పగతీర్చుకోగలం?” అన్నాయి పిచ్చుకల జంట. “నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళదాము. అదేమైనా ఉపాయం చెబుతుందేమో?” అని వడ్రంగి పిట్ట చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తుమ్మెద దగ్గరకు వెళ్లారు. “ఏనుగు చాలా బలమైనది. దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నా మిత్రుడు కప్ప వద్దకు వెళదాము. అదేమైనా ఉపాయం చెబుతుందేమో” అన్నది తుమ్మెద. అందరూ కలసి కప్ప వద్దకు వెళ్ళారు.
“ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం” అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది. కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టడానికి ప్రయత్నిస్తుంది. ఏనుగు కళ్ళు మూస్తూ, తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనబడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది.
ఏనుగు కళ్ళు మూసుకుని పరుగెత్త సాగింది. వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచేసింది. కళ్ళు సరిగా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. అక్కడ కొండ అంచున కప్ప కూర్చొని అరవసాగింది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈవైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగా కనబడక పోవడంతో అతి వేగంగా పరుగెత్తి, కొండ అంచును దాటి లోయలో పడింది. తప్పు తెలుసుకున్న ఏనుగు, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నిశ్చయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.
నీతి కథలు : ‘మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు’ అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి.