ఎలుక మరియు పిల్లి
ఒక అడవిలోని పెద్ద చెట్టు తొర్రలో ఒక పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు క్రిందనే ఉన్న రంధ్రంలో ఒక ఎలుక నివసిస్తుంది. పిల్లి నివసించే చెట్టు చుట్టూ ఒక వేటగాడు రాత్రివేళలో ఒక వల పెట్టాడు. పిల్లి ఆ వలలో ఇరుక్కుంది, పిల్లి బాధపడుతూ రోధించసాగింది. పిల్లి ఏడుపు విని ఎలుక తన రంధ్రంలో నుండి బయటకు వచ్చింది. తన శత్రువు వలలో ఇరుక్కుని ప్రాణాపాయస్థితిలో ఉండటం చూసిన ఎలుక మహదానందంతో గంతులేసింది. ఇక వలలో ఇరుక్కున్న పిల్లి ముందే ఎలుక నిర్భయంగా తిరగసాగింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక గుడ్లగూబ చూసింది. ఎలుకను చూడగానే దాన్ని తినాలని గుడ్లగూబకు నోరూరింది. గుడ్లగూబను చూడగానే ఎలుకకు భయంతో చెమటలు పట్టాయి. పిల్లితో స్నేహం చేస్తే గుడ్లగూబ వల్ల తనకు ప్రాణహాని ఉండదని ఎలుక అనుకొని పిల్లితో మాట్లాడింది.
“నేస్తమా! బాగున్నావా. ఈ చెట్టు క్రింద ఇద్దరం ఎంతో అన్యోన్యంగా సోదరుల్లా జీవించాము. నీ వల్ల నాకు గానీ, నా వల్ల నీకు గానీ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఇప్పటివరకు కలగలేదు. నిన్ను ఈ వల నుండి తప్పించాలని నేను భావిస్తుండగా ఈ గుడ్లగూబ ఎక్కడి నుండో వచ్చింది. అది నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది” అంటూ భయం నటిస్తూ పిల్లితో చెప్పింది ఎలుక. పిల్లి ఆ వైపు చూస్తే గుడ్లగూబ కనబడింది. “మిత్రమా! నాతో స్నేహం చేస్తావా? నేను నిన్ను ఈ వలలో నుండి కాపాడతాను. అయితే నన్ను నువ్వు చంపకూడదు” అని పిల్లితో అన్నది ఎలుక. “నా ప్రాణాలు కాపాడిన నిన్ను నేను ఎందుకు చంపుతాను. పైగా నన్ను నువ్వు కాపాడితే గుడ్లగూబ బారి నుండి నిన్ను రక్షిస్తానని మాట ఇస్తున్నాను” అన్నది పిల్లి.
పిల్లి మాటలు నమ్మిన ఎలుక వలను కొరకడానికి సిద్ధమయ్యింది. పిల్లి, ఎలుక ఎప్పుడైతే స్నేహంగా దగ్గరయ్యాయో గుడ్లగూబ భయపడి పోయింది. ఎలుకను తినాలనే తన కోరిక తీరకపోగా పిల్లి చేతిలో తన ప్రాణాలు పోవడం ఖాయమని భావించిన, గుడ్లగూబ అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇంతలో వేటగాడు వస్తూ కనిపించాడు. “మిత్రమా! వేటగాడు వస్తున్నాడు. ఆలస్యం చేయకుండా ఈ వలను కొరికి నన్ను బంధవిముక్తి చేసి రక్షించు” అని ప్రాధేయపడింది పిల్లి. ఎలుక ఆలస్యం చేయకుండా వలను కొరికేసి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. వల నుండి బయటపడ్డ పిల్లి ఆలస్యం చెయ్యకుండా చెట్టెక్కేసింది. వేటగాడు నిరాశగా చిరిగిన వల తీసుకుని వెళ్ళిపోయాడు.
కాసేపటికి పిల్లి చెట్టుదిగి ఎలుక రంధ్రం వద్దకు చేరింది. “ఎలుక మిత్రమా! మనిద్దరం ఇప్పుడు స్నేహితులం, నువ్వు నన్ను కాపాడావు. నిన్ను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వెంటనే రంధ్రంలో నుండి బయటకురా?” అని పిల్లి ప్రాధేయ పడింది. “నీ మాటలు నేను నమ్మను పిల్లి మిత్రమా! పొద్దున నుండి వలలో చిక్కుకుని అసలే నువ్వు ఆకలితో ఉన్నావు. ఆకలికి స్నేహాలు, ఆత్మీయతలు ఉండవంటారు. నేను రంధ్రంలో నుండి బయటకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు. నీ స్నేహానికి ఒక నమస్కారం. నేను రంధ్రంలో నుండి బయటకు రాను” అని చెప్పింది ఎలుక. పిల్లి చేసేది లేక వెళ్ళిపోయింది.
నీతి కథలు : మనం ఎవరికీ సహాయం చేసిన సరే మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది.