ఎలుక బుద్ధి
ఒక రంధ్రంలో ఎలుక ఒకటి నివసిస్తుంది. ప్రతిరోజు ఒక పిల్లి దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తుంది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని అనుక్షణం భయంతో ఎలుక జీవించేది. చివరకు ఆ ఎలుక అడవిలోకి పారిపోయింది. దానికి అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక ముని నివసిస్తున్నాడు. తన ప్రాణ భయం గురించి మునితో ఎలుక చెప్పింది. “నువ్వు ఎలుకగా ఉన్నంత కాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.
కాబట్టి నిన్ను ఒక సుందర కన్యగా మార్చేస్తాను” అని చెప్పి ఎలుకను అందాల కన్యగా ముని మార్చేశాడు. అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యుడితో వివాహం చేయాలని, సూర్యుడి వద్దకు తీసుకుని పోయాడు ముని. “అమ్మో! ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను” అన్నది అందాల రాశి. “అయితే మేఘుడిని వివాహం చేసుకో” అన్నాడు ముని. “నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేఘుడ్ని పెళ్ళిచేసుకోవడామా? కుదరదు” అని తేల్చి చెప్పింది.
అప్పుడు ఆ ముని గాలిదేవుడి వద్దకు అందాల రాశిని తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోమన్నాడు. “ఒకచోట స్థిరనివాసం లేని గాలి దేవుడ్ని పెళ్ళాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను” అన్నది అందాల రాశి. “ఈ పర్వతాన్ని పెళ్ళిచేసుకో” అన్నాడు ముని. “సుకుమారినైన అందాల రాశిని, బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను” అన్నది అందాల రాశి. “నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పుతల్లీ!” అన్నాడు ముని. అప్పుడు ఒక కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. “ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతడిని పెళ్ళి చేసుకుంటాను” అన్నది అందాల రాణి. “అందాల రాశిగా మారినా నీ ఎలుక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు” అని ఆ అందాల రాశిని ఎలుకకు ఇచ్చి పెళ్ళి చేశాడు.
నీతి కథలు : చుట్టుపక్కన పరిస్థితులను మరియు మన పరిస్థితులను బట్టి మనము ఇతరులతో సరిగ్గా వ్యవహరించాలి.