ఏకాగ్రత
భద్రాచలానికి దగ్గరలో గోదావరి నదీతీరానగల ఓ గ్రామంలో ఒక రామయ్య శాస్త్రీ ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు చదివిన ఉద్ధండపిండమే గాని లౌకిక జ్ఞానం లేనివాడు. ఎప్పడూ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు అంటూ కాలం గడిపేవాడే కాని ప్రజల మధ్య మసలుకున్నవాడు కాదు పిత్రార్థితమైన ఆస్తిపాస్తులు, పాడిపంటలకు లోటుండేది కాదు.
ఆ రామయ్య శాస్త్రి యజ్ఞం ఒకటి తలపెట్టాడు. అందుకు ఒక మేక కావలసి వచ్చింది దానిని తెఛ్చిపెట్టేవారెవరూ దొరకకపోవడం వల్ల కొని తెచ్చుకునేందుకు బయలుదేరాడు. ప్రక్క గ్రామంలోని గొల్లవీధిలోనికి వెళ్ళి ఓ చక్కని నల్లటి మేక నేరుకొని, దానికి వారడిగిన
ధరయిచ్చి కొన్నాడు. పై మీద అంగవస్త్రంతో దాన్నీ కట్టి పట్టుకొని తోలుకుంటూ తన స్వగ్రామమునకు బయలుదేరాడు.
మేకను తోలుకుంటూ వస్తున్న ఆ బ్రాహ్మణి నలుగురు దొంగలు చూచారు. ఆ మేకమీద వాళ్లకు ఆశకలిగింది. ఆ బ్రాహ్మణుడి నుండి దాన్ని అపహరించి దాన్ని చక్కగా వండుకుని తినాలనుకున్నారు. అందుకా బ్రాహ్మణ్ణి బెదిరించడం, నిర్జంథించడం, దోచుకోవడం దేనికి? మాటలతోనే మేకను కాజెయ్యాలని పన్నాగం పన్నారు.
ఆ రామయ్య శాస్త్రి కంటే ముందుకుపోయి ఆ మార్గమధ్యంలో నలుగురు నాలుగుచోట్ల కాసుక్కూచ్చున్నారు. మేకను తోలుకుంటూ వెడుతూ బ్రాహ్మణుడు దగ్గరకు రావడంతో మొదటి దొంగ ఎంతో వినయంగా దండం పెట్టి “ఏంటిదీ పంతులుగారూ! నల్ల కుక్కను పట్టుకుపోతున్నారు” అని తన త్రోవన తాను వెళ్ళిపోయాడు. రెండవ దొంగను సమీపించేసరికి అతడు రామయ్యశాస్త్రితో కలసి అడుగులు వేస్తూ “అవునుగానీ అయ్యగారు ఈ కుక్క నెక్కడ్నించి తీసుకెడుతుండారండీ” అని తన దారిని తాను వెళ్ళిపోయాడు. రామయ్యకి వీడు కూడా దీన్ని కుక్కే అన్నాడేమిటా అని నడుస్తూనే దాస్తాకసారి ఎగాదిగా చూచాడు. మరికొంతదూరం నడిచేసరికి మూడన దొంగ ఎదురుపడి “ఏమండోయ్! బ్రాహ్మడు గారూ! కుక్క పట్టుకు పోతుండారు. దానితోటి తమకేటి పనండి అయినా బ్రాహ్మణులు కుక్కను ముట్టుకోవచ్చునటండి” అని అతడూ వెళ్ళిపోయాడు.
“అరరే! వీడు కూడా దీన్ని కుక్కనే అంటున్నాడు, ఇది కుక్క కాకపోతే వీళ్ళంతా అలాగే ఎందుకంటారు మరి గొల్ల నమ్మకంగానే ఇచ్చాడు. నేనేమన్నా మోసపోయానా?” అనుకుంటూ నడుస్తున్నాడు. అంతలో, నాల్గవ దొంగ కలుసుకుని “ఇదేంటండి కర్రి కుక్క పట్టుకెళ్తున్నారు. తమ కెందుకండిది మీ ఊరోళ్లు చూస్తే కుక్కను ముట్టుకున్నారని తప్పట్టరా యేటి?” అని ముందుకు వెళ్ళిపోయాడు.
“వీడు కూడా దాన్ని కుక్కనే అంటున్నాడు. కుక్క కాకపోతే ఇంతమంది అదేమాట అంటారా! దీన్ని ముట్టుకుని నేను మైలపడ్డాను. గొల్లడు నన్నెంత మోసం చేసాడు. తెలిసినవాళ్ళ నెవర్షయినా పంపించి మేకనే కొనిసించుకోవాలి. ఈ కుక్క నాకెందుకు? దీనితో ఉళ్ళోకెడితే నలుగురూ గేలిచేసి తప్పపడతారు” అని తర్మించుకుని అంగవస్త్రం విప్పి ఆ మేకను వదిలివేశాడు గోదావరిలో స్నానం చేసి ఇంటికి చేరుకున్నాడు.
అలా వదిలేసిన మేకను, వెనకనే వస్తున్న దొంగలు నలుగురు కలసి వట్లుకొని బ్రాహ్మడి తెలివితక్కువతానికి నవ్వుకుంటూ తీస్కొని వెళ్లిపోయారు
నలుగురాడిందే వేదమనుకునే విజ్ఞానునికిల్లాంటి భంగపాటే జరుగుతుందంటారు. ఒకే మాటమీద కలిసికట్టుగా నిలబడితే ఎలాంటివారినైనా ఒప్పించవచ్చు. ఎలాంటి పనినయినా సాధించవచ్చు.