ఏడుగురు అక్కాచెల్లెళ్ళ కథ



ఒక రాజు మరియు రాణి ఉండేవారు. వాళ్ళకు సంతానం కలుగలేదు. రాణి తనకు పిల్లలు కలగడం లేదన్న బాధతో ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండేది. ఒకరోజు కలలో ఆమెకు దేవుడు కనిపించాడు. “ఊరి చివర పుట్టమీద మామిడిచెట్టు ఉంటుంది. ఆ చెట్టుకున్న మామిడిపండ్లలో ఒక పండు తిను. నీకు పిల్లలు కలుగుతారు.” అని చెప్పాడు దేవుడు.

మరునాడు రాణి రాజుతో మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు ఎక్కి ఏడు మామిడిపండ్లను తిన్నది. అప్పుడే పుట్టలోంచి ఒక పాము బయటకి వచ్చి “ఒక పండు తినమని దేవుడు చెబితే, ఏడు పండ్లు తిన్నావు. నీకు పుట్టే పిల్లలకు ఏడేళ్ల వయసు రాగానే నిన్ను చంపేస్తాను” అంది. పాము మాటల్ని రాణి పట్టించుకోలేదు. కొంతకాలానికి రాణికి ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిని ప్రేమగా పెంచి పెద్ద చేయసాగింది. వాళ్ళకు ఏడేళ్ళ వయసు వచ్చింది. అప్పుడు రాణికి పాము మాటలు గుర్తుకు వచ్చాయి. భయపడింది. పాము రాకుండా రోజూ రాత్రిపూట తన మంచం చుట్టూ మంటలు మండించి పడుకునేది. కానీ పాము పైనుండి వచ్చి రాణిని కరిచి చంపేసింది.

ఆ తర్వాత రాజు మరో పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి పిల్లల్ని బాగా చూసుకునేది కాదు. వాళ్ళని తిట్టేది, కొట్టేది. వారందరినీ బడికి పంపకుండా ఎక్కడో బయట కిటకిటా పెట్టి ఉంచేది. రాజు అడిగితే బడికే పంపానని చెప్పేది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. దాంతో ఆమె పిల్లల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒకరోజు రాజుతో “నీ మొదటి భార్య పిల్లలందరినీ అడవికి తీసుకువెళ్ళి చంపిరా. లేకుంటే నేను నీతో కాపురం చేయను” అంది. రాజు ఎంత చెప్పినా వినలేదు. చివరకు రాజు విధిలేక తన ఏడుగురు కూతుళ్ళను తీసుకుని అడవికి వెళ్ళాడు. ఆడుకోమని చెప్పాడు.

చీకటిపడ్డాక అందరూ వరుసగా పడుకున్నారు. రాజుకు తన కూతుళ్ళను చంపడానికి మనసొప్పలేదు. పిల్లలంతా మంచి నిద్రలో ఉండగా తాను లేచి తన స్థానంలో ఒక పెద్ద బండరాయిని పెట్టి వెళ్ళిపోయాడు.

తెల్లవారాక కూతుళ్ళు లేచి తమ తండ్రి బండరాయిగా మారాడనుకుని దుఃఖించారు. ఆ తర్వాత అదే అడవిలో ఆహారం సంపాదించుకుంటూ, ఉయ్యాలలూగుతూ సంతోషంగా జీవించసాగారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఏడుగురు అన్నదమ్ములు ఆ అడవికి వేటకు వచ్చారు. వాళ్ళు ఆ అమ్మాయిలతో “మీరెవరు? ఈ అడవిలో ఎందుకు ఉంటున్నారు?” అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ తమ గతం గురించి చెప్పారు. అది విన్న అన్నదమ్ములు “మీరెవరో కాదు. మా కోడళ్ళే. మీ అమ్మ మా అక్క మాతో రండి మా ఇంటికి వెళ్దాం” అంటూ ఆ అమ్మాయిలందరినీ తమతో తీసుకుపోయారు. ఆ అమ్మాయిలు వెళ్ళాక అన్నదమ్ముల ఇంట్లో సిరిసంపదలు పెరిగాయి. వాళ్ళు చాలా ధనవంతులయ్యారు. ఏడుగురు అన్నదమ్ములు ఆ ఏడుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. లగ్నం పెట్టించారు.

ఇదిలా ఉండగా తన కూతుళ్ళు ఇంటినుండి వెళ్ళిపోయాక రాజుకు దరిద్రం పట్టుకుంది. రాజ్యం పోయింది. బికారిగా మారాడు. తన భార్యతో ఊరు ఊరుగా తిరిగి బిచ్చం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన కూతుళ్ళు ఉన్న ఊరికి వచ్చాడు. ఆ రోజే వాళ్ళ పెళ్లి జరుగుతుంది. తమ పెళ్లికి వచ్చి బిచ్చం పుచ్చుకుంటున్న తండ్రిని గుర్తుపట్టారు కూతుళ్ళు. ఏడుస్తూ తండ్రిని కౌగలించుకున్నారు. తన కూతుళ్ళు బ్రతికే ఉన్నందుకు చాలా సంతోషించాడు. తర్వాత అందరూ కలసి హాయిగా జీవించారు.

Responsive Footer with Logo and Social Media