ఎద్దు- సింహం స్నేహం



‘‘ప్రభూ’’ పిలిచాడు దమనకుడు.‘‘చెప్పు’’ కళ్ళు తెరిచాడు పింగళకుడు.‘‘ఇందాక తమరు యమునానది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలుచున్నారు. తర్వాత వెను తిరిగి వచ్చారు. వస్తూన్నప్పుడు మిమ్మల్ని చూశాను. అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉన్నారు. ఏంటాలోచిస్తున్నారో సెలవిస్తారా?’’ పింగళకుణ్ణి ముగ్గులోకి దించే ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు.‘‘అదా...అదీ...నీలాంటి వాడికి చెప్పడంలో నామోషీ ఏముందిగాని, ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా. ఏ జంతువుదో పెద్ద కూత. అదే జంతువు అయి ఉంటుందో అంతు చిక్కలేదు. నాకు వినిపించేలా అంతగా కూత పెట్టిందంటే, అదేఁ తక్కువది కాదు. చాలా బలమయినదై ఉండాలి. పైగా ఎంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా’’‘‘మిమ్మల్ని భయపెట్టడమా?’’ మధ్యలోనే మాట అందుకుని ఆశ్చర్యం నటించాడు దమనకుడు.‘‘భయపెట్టడం అంటే భయపెట్టడం కాదు, కాకపోతే నన్ను సవాల్‌ చేస్తున్నట్టుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింప చేసింది.’’ అన్నాడు పింగళకుడు. తర్వాత తల విదిల్చాడు. నిద్రమత్తును పొగొట్టుకున్నాడు. ఇలా అన్నాడు.

‘‘నాకు తెలీయకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు చొరుకున్నాడు. ఎవరన్నదీ త్వరలోనే తెలుసుకోవాలి. పట్టి చంపాలి. చంపకపోతే సిగ్గుచేటు.’’ అని దిగ్గున లేచి నిలుచున్నాడు పింగళకుడు. అతనితో పాటుగా దమనకుడు కూడా లేచి నిల్చున్నాడు.‘‘ఈ కొత్తశత్రువు ఎక్కణ్ణుంచి ఎలా వచ్చిందిక్కడికి? ఎవరయి ఉంటుంది? ఆలోచిస్తోన్న కొద్దీ తల పేలిపోతోంది.’’ అన్నాడు పింగళకుడు.‘‘మహారాజా! మీరు ఆలోచిస్తున్నానంటున్నారు కాని, మీరు భయపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఈ మాట నేను అన్నందుకు నన్ను మీరు క్షమించాలి. అయ్యా! అది తెలియని శబ్దం కాదు. రంకె. ఎద్దు రంకె అది. విన్న శబ్దాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకే తెలుస్తుంది.’’ అన్నాడు దమనకుడు. గుర్తు చేసుకున్నాడు పింగళకుడు.‘‘ఎద్దు రంకె అయినా అమ్మో, విన్నంతనే చాలా భయపడ్డాను.’’‘‘అదే! ఆ భయమే వద్దంటున్నాను.’’ అన్నాడు దమనకుడు.‘‘వెనకటికి నాలాంటిదే ఓ నక్క ఉండేది. దానికి ఓ రోజు తిండి దొరకలేదు. తిండిని వెదుక్కుంటూ చాలా దూరం ప్రయాణించిందది. ఆఖరికి దానికో యుద్ధభూమి కనిపించింది. అక్కడ చచ్చిపడి ఉన్న గుర్రాలూ, ఏనుగులతో పాటు సైనికుల్ని కూడా చూసింది. నోరూరిపోయి వాటి మీదపడి తిందామనుకున్నంతలో పెద్ద శబ్దం వినవచ్చింది. ఆ శబ్దానికి భయపడి పారిపోబోయి మూర్ఛపోయింది. కాస్సేపటికి మూర్ఛ నుంచి తేరుకుంది. భయపడకుండా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసింది. చూస్తే అక్కడి మర్రిచెట్టు కింద నగారా కనిపించింది. యుద్ధనగారా. యుద్ధం ముగిసిపోవడంతో వూరికే పడి ఉంది. గాలికి మర్రి ఊడలూ, కొమ్మలూ ఊగుతూ నగారాని తాకుతున్నప్పుడల్లా అది మోగుతోంది. ఇందాక విన్న శబ్దం అదే! ఓస్‌, ఇదా అనుకుంది నక్క. ధైర్యం తెచ్చుకుంది. భయపడి పారిపోతే ఆహారం దొరికేది కాదు. భయపడకుండా చూసింది కాబట్టే అన్నీ వివరంగా తెలిశాయి. దాంతో హాయిగా కడుపు నిండా తిని ఎంచక్కా వెళ్ళిపోయింది.’’ అన్నాడు దమనకుడు.

‘‘నువ్వు చెప్పదలచుకున్నది ఒక్క ముక్కలో చెప్పు.’’ అడిగాడు పింగళకుడు.‘‘మరేం లేదు మహారాజా! దేనికీ భయపడకూడదు. అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకూడదని నా అభిప్రాయం.’’‘‘సరేగాని, ఇప్పుడేం చేద్దామంటావు’’‘‘మీరు అనుమతి ఇస్తే ఆ రంకె ఎవరు వేశారు? ఎక్కడ వేశారు? ఎందుకు వేశారు? ఇవన్నీ కనుక్కొస్తాను.’’ అన్నాడు దమనకుడు. పింగళకుడికి కావాల్సింది అదే! రంకె వేసిన శత్రువు బలాబలాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎలా తెలుసుకోవాలా? అనుకుంటున్నాడు. కాగల కార్యం దమనకుడు తీరుస్తానంటున్నాడు. ఇంకేముంది? నిరభ్యంతరంగా ఒప్పుకున్నాడు.‘‘ముందా పని చేసిరా! శత్రువుని అన్ని కోణాల్లోనూ చదివి రా! అలా చదివి నువ్వొస్తే తర్వాత దానిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా మట్టుబెట్టాలో నేను ఆలోచిస్తాను.’’ అన్నాడు పింగళకుడు. దమనకుడు తోక వూపుకుంటూ ముందుకు నడిచాడు.‘‘ఇదిగో’’ వెనక్కి పిలిచాడు పింగళకుడు.‘‘చెప్పండి రాజా’’‘‘ఎదుటివారి బలాబలాలు చూసుకుని మరీ మాట్లాడు. సమయోచితంగా మాట్లాడు.మన గురించి అవసరమయితే నాలుగు మంచి మాటలు చెప్పు. వీలయితే భయపెట్టు. నీకివన్నీ బాగా తెలుసుననుకో, కాకపోతే చెప్పాల్సిన బాధ్యత రాజుగా నామీదుంది. అందుకని చెబుతున్నాను. వెళ్ళిరా.’’ అన్నాడు పింగళకుడు. దమనకుడు పరుగందుకున్నాడు. రాజుకి కనిపించే వరకు పరుగుదీసి, తర్వాత నింపాదిగా న డవసాగాడు. పైఅధికారి చెబితే అందుకుంటాడు అన్నట్టుగా ఉండాలి సేవకుడు. అలాగే నటించాలి. అధికారి కంటికి కనిపించేంత వరకూ హడావుడి చేసి, అపై నెమ్మదించాలి.

ఆ తీరులోనే దమనకుడు నెమ్మదిగా నడుస్తూ ఇలా ఆలోచించసాగాడు.ఎలాగయినా మళ్ళీ రాజుకి దగ్గరవ్వాలి. దగ్గరయ్యి, రాజుకి సలహాదారూ, సన్నిహితుడూ అనిపించుకుంటే ఆ హోదానే వేరు. తనని చూసి జంతువులన్నీ భయపడతాయి. భయంతో గౌరవిస్తాయి. కావాల్సింది అదే! అనుకున్నాడు దమనకుడు. బురద రాదారిలో అడుగుజాడల్ని బట్టి వెతుకుతూ వెతుకుతూ సంజీవకుణ్ణి చేరుకున్నాడు. బలంగా దిట్టంగా ఉన్న సంజీవకుణ్ణి చూసి ముందు భయపడినా, తర్వాత ధైర్యం తెచ్చుకుని ఇలా కేకేశాడు.‘‘సంజీవకా’’సమాధానంగా దమనకుణ్ణి చూశాడు సంజీవకుడు.‘‘నేనెవరో తెలుసా? ఈ అడవిని ఏలుతున ్న మృగరాజుకి బాగా కావాల్సినవాణ్ణి. నా పేరు దమనకుడు. రాజుగారు పింగళకుడు పంపితేనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇందాక నీ రంకె నేనూ, రాజుగారూ ఇద్దరం విన్నాం. నాకేం అనిపించలేదుగాని, రాజుగారికి బాగా కోపం వచ్చింది.’’‘‘అయ్యయ్యో’’ భయపడ్డాడు సంజీవకుడు.‘‘భయపడకు. నేనున్నాను.’’ అన్నాడు దమనకుడు.‘‘తమ దయ’’ అన్నాడు సంజీవకుడు కృతజ్ఞతగా.‘‘దయ చూపించాల్సింది రాజుగారు. వారు దయ చూపించాలంటే ముందు రాజుగారిని నువ్వు దర్శించుకుని, ‘రంకె వేసి తప్పు చేశాను, క్షమించండి’ అని అడగాలి. అడిగితే రాజుగారు తప్పకుండా క్షమిస్తారు. తర్వాత నిన్ను తన పరివారంలో చేర్చుకుంటారు. రాజుగారి పరివారంలోని వారంటే ఎవరికీ భయపడనవసరం లేదు. మనకి కూడా ప్రాణభయం ఉండదు. లేకపోతే రాజుగారికి ఆకలి వేసిందంటే మన సంగతి వేరే చెప్పాలా’’

‘‘నిజమే! బాగా సెలవిచ్చారు’’‘‘పద! నాతో రా! రాజుగారి దగ్గరకి నిన్ను నేను తీసుకుని వెళ్తాను. నేను చెప్పింది నువ్వక్కడ చెప్పు’’ అన్నాడు దమనకుడు.‘‘పదండి’’ అన్నాడు సంజీవకుడు. ఇద్దరూ బయల్దేరారు. అల్లంత దూరంలో రాజు ఉన్నాడనగా, సంజీవకుణ్ణి ఇక్కడాపి-‘‘ముందు రాజుగారితో నేను మాట్లాడి వస్తాను. తర్వాత నువ్వు వద్దూగాని’’ అన్నాడు దమనకుడు. సంజీవకుణ్ణి వదిలి, పింగళకుణ్ణి కలిశాడు.‘‘మహారాజా! మీ ఆజ్ఞప్రకారం ఎద్దుని కలిశాను. దాని పేరు సంజీవకుడు. రంకె వేసినందుకు మీకు కోపం వచ్చిందని చెప్పాను. అంతే! భయంతో వణికిపోయాడు. అంటే సంజీవకుడు మీకు శత్రువు కాదు. సేవకుడు. ఎందుకయినా మంచిదని సంజీవకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాను. మీరు ప్రవేశ పెట్టమంటే పెడతాను’’ అన్నాడు దమనకుడు.‘‘ప్రవేశపెట్టు’’ చెప్పాడు పింగళకుడు.వచ్చి సంజీవకుణ్ణి కలిశాడు దమనకుడు.

‘‘నీ అదృష్టం బాగుంది. రాజుగారు మంచి కళనున్నాడు. పద! వెళ్ళి కలుద్దాం.’’సంజీవకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు దమనకుడు. పింగళకుణ్ణి చూస్తూనే దణ్ణం పెట్టాడు సంజీవకుడు.‘‘నువ్వు నా శత్రువు కాని పక్షంలో మిత్రుడుగా ఉండిపో! మంత్రిగా మా ఆస్థానంలో కుదురుకో! నీకూ నాకూ మనిద్దరికీ బాగుంటుంది. ఈ అడవిని పాలించడం కష్టంగా ఉంది. నువ్వు నాకు తోడుంటే ఇబ్బంది ఉండదనిపిస్తోంది. ఏమంటావు?’’ అడిగాడు పింగళకుడు.‘‘మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను.’’ అన్నాడు సంజీవకుడు.రోజులు గడుస్తున్నాయి. పింగళకుడికి ప్రీతిపాత్రుడయిపోయాడు సంజీవకుడు. పింగళకుడుకి సంజీవకుడి తోడిదే లోకం అయిపోయింది. సంజీవకుణ్ణి విడిచి పింగళకుడు క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తోడూ నీడయిపోయారు. ఇది దమనకుడు భరించలేకపోయాడు.