దుర్యోధనుని వైష్ణవయాగం



ఒక రోజు దుర్యోధనుడు కర్ణునితో " కర్ణా! ధర్మరాజు రాజసూయయాగం చేసాడు కదా. అలాంటి యాగం నేను చేయాలని అనుకుంటున్నాను. తగు సన్నాహాలు కావించు " అన్నాడు. కర్ణుడు వెంటనే " అదెంతపని సుయోధనా ! ఈ భూమండలంలోని రాజులంతా నీ సామంతులు. అందరికి ఆహ్వానాలు పంపించు. బ్రాహ్మణులను సత్కరించు. యాగశాలలు నిర్మించు. అన్న సంతర్పణకు సంభారాలు సమకూర్చు. దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి " అన్నాడు.

సుయోధనుడు బ్రాహ్మణులను పిలిపించి రాజసూయయాగానికి తగిన సన్నాహాలు చేయమన్నాడు. వారు " సుయోధనా! పాండవులు నీ శత్రువులు. వారిని జయించి కాని నీవు రాజసూయ యాగం చేయలేవు. రాజసూయయాగం వంటిదే వైష్ణవయాగం. దానిని ఇది వరకు వాసుదేవుడు చేసాడు. అది నీకు తగిన యాగం " అని చెప్పారు. సుయోధనుడు అందుకు సమ్మతించి తల్లితండ్రులైన గాంధారిదృతరాష్ట్రుల వద్ద గురుదేవులైన ద్రోణ, కృపుల వద్ద, భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు. రాజులకు, బ్రాహ్మణోత్తములకు ఆహ్వానాలు పంపాడు. పాండవులకు ఆహ్వానం పంపాడు. దూత " ధర్మరాజా ! సుయోధన చక్రవర్తి చేసే వైష్ణవయాగానికి మిమ్మలిని పిలువడానికి నన్ను పంపాడు. కనుక మీరు తప్పక వేంచేయాలి " అని అర్ధించాడు. ధర్మరాజు " సుయోధనుడు యాగం చేయటం మాకు చాలా సంతోషం. దీని వలన మా వంశం పావనమౌతుంది.

మేము చేసుకున్న ఒప్పందం కారణంగా మేము అరణ్యవాస సమయంలో నగరప్రవేశం చేయడం సమజసం కాదు. ఆ విషయం దయచేసి మీ రాజుకు చెప్పండి " అన్నాడు. పక్కనే ఉన్న భీముడు " అరణ్యాజ్ఞాత వాసములు గడచిన పిమ్మట మేమే పిలవ కుండానే వచ్చి మా ఆయుధాలతో అగ్ని గుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని అతని నూరుగురు తమ్ములను యజ్ఞ పశువులుగా అర్పించగలము " అని చెప్పు అన్నాడు. దూత అవే మాటలను సుయోధనునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు యాగనిర్వహణకు, అతిథి సత్కారానికి విదురుని నియోగించాడు. యాగం నిర్విజ్ఞంగా సమాప్తి అయింది. యాగానికి వచ్చిన కొందరు సుయోధనుని పొగిడారు.

కొందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో అది సరి పోలదని అన్నారు. సోదరు లందరూ చుట్టూ నిలువగా ప్రముఖ ఆసనం పై కూర్చున్న దుర్యోధనుడితో కర్ణుడు " సుయోధనా! వైష్ణవ యాగం నిర్విఘ్నంగా జరిపించావు. ఇదే విధంగా పాండవులను చంపి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను అర్జునుని చంపే వరకు నేను ఎవరితోనూ కాళ్ళు కడిగించుకోను. నీట బుట్టిన వేవీ తినను. ఎవరయినా యాచిస్తే లేదు అనను" అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అందుకు సుయోధనుడు ఆనందించి " నీ సాయం ఉంటే పాండవులను జయించడం నాకు కష్టం కాదు " అన్నాడు.