దురాశ దుఃఖానికి చేటు



‘‘తర్వాత ఏం జరిగింది?’’ అడిగాడు మంథరుడు.హిరణ్యకుడు ఇలా చెప్పసాగాడు.‘‘అప్పటికీ బుద్ధి రాలేదు. అక్కడే ఉన్నానింకా. విసిగిపోయాడు చూడాక ర్ణుడు. కోపంగా ఒక రోజు నా మీదకుకర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాణ్ణే! అదృష్టం బాగుండి తగల్లేదు. తప్పించుకున్నాను.అయితే అప్పటికి నాకు జ్ఞానోదయం అయింది.ఈ లోకంలో కష్టాలన్నిటికీ మూలకారణం డబ్బు, దాని మీది ఆశే! ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన హాయి లేదు. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు. పండితుడు. పదిమందిని వేధించకుండా దొరికిన దానితో పొట్టపోషించుకున్నవాడే ధన్యుడనిపించింది. చేసు కున్నవారికి చేసుకున్నంత అని, మనం చేసుకున్న పాప పుణ్యాలను అనుసరించే మనకేదయినా ప్రాప్తిస్తుంది. అంతేకాని, మనకి ఇది కావాలి, అది కావాలనుకోవడం తప్పు.నేనిప్పుడు ఉంటున్న ఈ మఠం, నా తాత తండ్రులది కాదు. నా సొంతం అంతకన్నా కాదు. అటువంటప్పుడు దీన్ని పట్టుకుని వేళ్ళాడడం అవివేకం. ఈ చూడాకర్ణుడితో మాటలు పడే కంటే, దెబ్బలు తినే కంటే ఏ అడవిలోనో తల దాచుకోవడం సుఖం అనిపించింది. బండ రాయిలో కప్పకు కూడా ఇంత తిండిపెట్టే ఆ దేవుడు, నాకెందుకు పెట్టడనిపించింది. మఠాన్ని వదిపెట్టేశాను. ఊరిని వదిలేశాను. అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులూ అలములూ తింటూ, దొరికిన చోట నీళ్ళు తాగుతూ కాలం గడపసాగాను. ఆ రోజుల్లోనే ఇదిగో, ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుణ్ణి చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలం అంటే అదే! దాన్ని మించింది లేదు.

ఈ ప్రపంచంలో రెండే రెండు ఆనందాలు ఉన్నాయి. ఒకటి: గొప్ప గొప్ప కథలు వినడం. రెండు: స్నేహితులతో సరదాగా తిరగడం.’’‘‘నిజం చెప్పావు’’ అన్నాడు మంథరుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు.‘‘డబ్బు శాశ్వతం కాదు. అలాంటిదే యవ్వనం కూడా. ఈ రెండూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటవి. చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు. అదో నీటి బుడగ. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దానధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియని వారు ఏమీ చేయక, చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలుకాక విలపిస్తారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టేవు. దాంతోనే అల్లరిపాలయ్యావు.నీరు ప్రవహించాలి. ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. డబ్బుని ఎప్పుడూ ఖర్చు చెయ్యాలి. ఖర్చు చెయ్యడం అంటే విందులకూ, వినోదాలకూ ఖర్చు చెయ్యడం కాదు, దానం చెయ్యాలి దాన్ని. లేదంటే ఏదేని మంచి పనులకు ఉపయోగించాలి. డబ్బు కూడ బెట్టకూడదు. కూడబెడితే కష్టాలే! బరువును మోస్తూ తిరిగే కంటే బరువును దించుకోవడం సుఖం. డబ్బును అనుభవించాలి. లేదంటే పదిమందికీ పంచిపెట్టాలి. అంతేకాని, నువ్వూ సుఖపడక, పదిమందినీ సుఖపెట్టక కట్టకట్టలుగా డబ్బు దాచడంలో లాభం ఏముంది? పిసినారికి ఎంత డబ్బూ చాలదు. ఎంతున్నా వాడు దరిద్రుడే! నిజం చెప్పాలంటే...పిసినారికంటే దరిద్రుడే నయం. వాడి దగ్గర డబ్బుండదు కాబట్టి దానికి కాపలా కాసే కష్టం ఉండదు వాడికి. పిసినారి తాను తినడు. ఇతరులకు పెట్టడు. దాంతో ఆ డబ్బు నేలపాలు లేదంటే దొంగల పాలు కాక తప్పదు. వివేకవంతుడు డబ్బు సంపాదించాలి. కాని కూడబెట్టకూడదు. కూడబెట్టినా అవసరాల మేరకే కూడబెట్టాలి. మితి మీరి కూడబెడితే దీర్ఘరావం అనే నక్కలా నాశనమయిపోతాడు.’’

‘‘ఆ కథేంటో చెప్పవా’’ అడిగాడు హిరణ్యకుడు.‘‘చెబుతాను, విను’’ అంటూ చెప్పసాగాడు మంథరుడు.‘‘అనగనగా ఒక ఊరు. దాని పేరు కల్యాణకటకం. ఆ ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఓ రోజు, అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి, అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి, అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం, భైరవుడు దాన్ని చంపి, ఇంటి దారి పట్టాడు. తోవలో అడవిపంది కనిపించిందతనికి. దాంతో ఈ రోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాల మీది జింకను కిందికి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చి పోలేదు. గాయపడి, కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పందీ-భైరవుడూ పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తర్వాత పంది కూడా చచ్చిపోయింది. భైరవుడూ-పందీ పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి నలిగి పచ్చడయిపోయింది.కాస్సేపటికి దీర్ఘారావం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము, మనిషిని చూసి నాలిక చప్పరించింది. చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోనవసరం లేదనుకుంది.మనిషి మాంసం నెలరోజుల దాకా సరిపోతుంది. పందీ-జింకల మాంసంతో రెణ్ణెళ్ళు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుందని లెక్కలుగట్టి ఆనందించింది. పడి ఉన్న విల్లుని చూసిందప్పుడు. దాని తాడుని నాకి చూసింది. జంతునరంతో చేసిన తాడని తేల్చుకుంది. ముందీ నరాన్ని తిని ఈ రోజు సరిపెట్టుకుంటాను. తర్వాత జింకా, పందీ, పాము వాటన్నిటినీ తినవచ్చుననుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి, తినేందుకు దాన్ని కొరికింది నక్క. అంతే! తాడు తెగింది. విల్లు విచ్చుకుంది.

ఆ విచ్చుకోవడంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది. దాంతో నక్క చచ్చిపోయింది.’’కథ ముగించాడు మంథరుడు. ఇలా అన్నాడు.‘‘దురాశ దుఃఖానికి చేటంటే ఇదే! దురాశ కారణంగానే నక్క చావుని కొనితెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకి ఇవ్వాలి. రెండూ చేయక చచ్చి సాధించేదేముంది?’’‘‘అవును నిజమే’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘వివేకవంతులు అందని దాని కోసం బాధ పడరు. అలాగే అందింది చేజారిపోయినా బాధ పడరు. వారిలాగే నువ్వు కూడా దేని గురించీ బాధపడకు. ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండు. ఉత్సాహంగా హాయిగా ఉన్నవాడే గొప్పవాడు. దిగులు పడుతూ దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడయినా పనికిరానివాడే!’’ అన్నాడు మంథరుడు. హిరణ్యకుడి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు.

‘‘అనారోగ్యం వచ్చింది. మందులు వాడాలి. వాడితేనే ఆరోగ్యం కలిగేది. అంతేకాని, మందులు పేర్లు వింటే అనారోగ్యం పోతుందా చెప్పు? గుడ్డివాడి చేతిలో దీపం ఉండి ప్రయోజనం ఏమిటి? అలాగే వివేకం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా అంతే!నేనున్నాను. నేను ఆపదలకు కుంగిపోను. సంపదలకు పొంగిపోను. కష్టాలూ సుఖాలూ రెండూ ఒకటే నాకు. డబ్బు వస్తుంది, పోతుంది. దాని నైజం అది. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. పేదవాడు అయినంత మాత్రాన విద్వాంసుల్ని గౌరవించకుండాపోరు. అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం కాదు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే.. నువ్వు మంచి వాడివి. బుద్ధిమంతుడివి. ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమీ లేదు. నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు గొప్పవాడు. వాడు అన్ని జీవులకీ వేళకింత పడేస్తాడు.అనుమానం లేదందులో. అలాంటప్పుడు ఎలా బతకాలి? ఎలా బతుకుతాం? అన్న దిగులు అనవసరం.’’ అన్నాడు మంథరుడు.‘‘బాగా చెప్పావు’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘నాకు ఈ లఘుపతనకుడు ఎంతో నువ్వూ అంతే! ఎందుకు కలిపాడో మన ముగ్గుర్నీ దేవుడు కలిపాడు.

కలిసే ఉందాం. దొరికింది పంచుకుంటూ, తింటూ కాలం గడిపేద్దాం.’’ అన్నాడు మంథరుడు.‘‘మంచిమాటలు చెప్పావు మంథరా’’ మెచ్చు కున్నాడు లఘుపతనకుడు.‘‘దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని సృష్టించిన దేవుడు, ఆ జంతువుల కోసం రకరకాల ఆహార విహారాల్ని కూడా సృష్టించాడు. తిని బతకండని దీవించాడు. అది మనం పట్టించుకోం. దాచుకోవడానికి తాపత్రయపడతాం. అక్కడే చిక్కులొస్తాయి. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కాని, ఆనందం లేదు. దీన్ని గ్రహించాలి మనం. కోటాను కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం స్నేహంగా ఉందాం. మిత్రలాభాన్ని పొందుదాం’’ అన్నాడు లఘుపతనకుడు.ముగ్గురూ ముచ్చటగా నవ్వుకున్నారు.(ఇంకా ఉంది)